Share News

Karimnagar: 42శాతం రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వాలి

ABN , Publish Date - Jul 17 , 2025 | 11:13 PM

హుజూరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ స్టాండ్‌ చాలా క్లియర్‌గా ఉందని, 42శాతం రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే అందజేస్తానంటే ప్రధాని మోదీని ఒప్పించి బిల్లును అమోదించేందుకు కృషి చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

 Karimnagar:  42శాతం రిజర్వేషన్లు బీసీలకే ఇవ్వాలి

- కార్యకర్తలు పార్టీ కోసమే పనిచేయాలి

- గ్రూపు రాజకీయాలు చేస్తే టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తి లేదు

- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌

హుజూరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ స్టాండ్‌ చాలా క్లియర్‌గా ఉందని, 42శాతం రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకే అందజేస్తానంటే ప్రధాని మోదీని ఒప్పించి బిల్లును అమోదించేందుకు కృషి చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం హుజూరాబాద్‌ హైస్కూల్‌ మైదానంలో పదో తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 1,037 సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 42శాతం రిజర్వేన్లలో 10శాతం రిజర్వేషన్లు ముస్లీంలకు ఇస్తానంటే ఒప్పుకునే ప్రసక్తి లేదన్నారు. బీజేపీలో ఏ గ్రూపు లేదని, ఉన్నదల్లా మోదీ గ్రూప్‌ అన్నారు. బీజేపీలో ఈ వర్గం ఆ వర్గమంటూ ఉండదన్నారు. జెండా, పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. బీజేపీలో వ్యక్తి కోసం పనిచేస్తే ప్రోత్సహించే ప్రసక్తి లేదన్నారు. బీజేపీలో కష్టపడ్డ వారికి ఎంపీ ల్యాండ్స్‌, ఈజీఎస్‌ నిధులను అందిస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రూపుల పేరుతో రాజకీయాలు చేస్తే టిక్కెట్లు ఇచ్చేది లేదన్నారు. కష్టపడ్డ వారికే టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకుంటామన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో రూ. 219 కోట్లు సీఆర్‌ఐఎఫ్‌ నిధులను తీసుకొచ్చి రోడ్లు వేయిస్తున్నామన్నారు. గ్రామాల్లో ప్రజల సౌకర్యార్థం బోర్లు వేయిస్తున్నామన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో నేను 2.25 లక్షల మెజార్టీతో గెలిచానంటే దానికి కారణం కార్యకర్తల కష్టమేనన్నారు. బనకచర్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. జల వివాదాలపై బీఆర్‌ఎస్‌ చేస్తున్న ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టిందన్నారు. ఈ ప్రభుత్వం కూడా అదే పంథాలో ఉన్నట్లుంద న్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇరిగేషన్‌ అధికారుల అవినీతిని చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయన్నారు. కాళేశ్వరంలో కేసీఆర్‌ కుటుంబం భారీ ఎత్తున దోచుకుందన్నారు. కేసీఆర్‌ కుటుంబంపై ఎన్నో అవినీతి కేసులు ఉన్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక్క కేసు విషయంలో కూడా కేసీఆర్‌ కుటుంబాన్ని దోషులుగా తేల్చలేకపోయిందన్నారు. హుజూరాబాద్‌ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల శిథిలావస్థలో ఉందని, నూతన భవనాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని పాఠశాల హెచ్‌ఎం బొరగాల తిరుమల, ఉపాధ్యాయులు పల్కల ఈశ్వర్‌రెడ్డి, ఆసియాలు కోరారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ అశ్విని వాకాడి, ఆర్డీవో రమేష్‌బాబు, ఏసీపీ మాధవి, తహసీల్దార్‌ కనకయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, డీఈవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 11:13 PM