Share News

సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌

ABN , Publish Date - Dec 30 , 2025 | 01:23 AM

గ్రామ పంచాయతీ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.

సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు   జాయింట్‌ చెక్‌ పవర్‌

- ఉత్తర్వులు జారీచేసిన పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌

- గ్రామాల్లో అభివృద్ధికి ఆటంకాలు తొలిగేనా..

- హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

గ్రామ పంచాయతీ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ ఎంప్లాయిమెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి శ్రీజన ఉత్తర్వులను జారీ చేశారు. 2019 జూన్‌ 17న అప్పటి ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులకు సంబంధించి సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఇచ్చింది. ఆ బాధ్యతలను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 31, 2023న గ్రామపంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేకాధికారికి చెక్‌ పవర్‌ ఇచ్చింది. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ నిధులు రెండేళ్లుగా నిలిచి పోయాయి. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా పడకేయగా, కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకాధికారులు నిధులు లేక ఇబ్బందులు పడ్డారు. ప్రజా సమస్యలను పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది.

ఫ రెండేళ్ల తర్వాత పంచాయతీలకు పాలకవర్గాలు

గ్రామ పంచాయతీలకు ఈనెల 17న ఎన్నికలు నిర్వహించారు. దాదాపు రెండేళ్ల తర్వాత సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఈనెల 22న గ్రామ పాలన చేపట్టారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేకాధికారి జాయింట్‌ చెక్‌ పవర్‌ను రద్దు చేస్తూ తిరిగి సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఇచ్చింది. దీంతో పంచాయతీ ఖాతాల్లో ఉన్న నిధులను అభివృద్ధి పనులు, ఇతరత్రా ఖర్చులకు డ్రా చేసేందుకు మార్గం సుగమమైంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాల్లోకి నేరుగా నిధులు విడుదల చేస్తోంది. ప్రతి మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఖాతాల్లో జమ అవుతాయి. ఈ ఆర్థిక లావాదేవీల నిర్వహణకు కేంద్ర పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ అనే ఆన్‌లైన్‌ పోర్టల్‌ను తీసుకువచ్చింది. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ సంతకాలు, వేలి ముద్రల ఆధారంగా డిజిటల్‌ కీ తయారు చేస్తారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు, పరిపాలన పరమైన ఖర్చులకు సంబంధించిన అంశాలను పాలకవర్గాలు తీర్మానం చేస్తే సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ జాయింట్‌ చెక్‌పవర్‌తో ఆ నిధులను వినియోగించుకునేందుకు మార్గం సుగమమైంది. గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న మల్టీపర్పస్‌ వర్కర్ల జీతాల చెల్లింపునకు వీలు కలుగుతుంది. రెండేళ్లుగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు జాయింట్‌ చెక్‌ పవర్‌తో చెక్‌పడే అవకాశాలున్నాయి.

Updated Date - Dec 30 , 2025 | 01:23 AM