Share News

ఎండలోనే ‘ఉపాధి’

ABN , Publish Date - Mar 12 , 2025 | 01:18 AM

అప్పుడే ఎండలు భగ్గుమంటున్నాయి.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ నీడ పట్టున ఉంటున్నారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధిహామీ కూలీలు మాత్రం ఎండలో మాడిపోతున్నారు. నీడ, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా చేసిన పనికి కూలి గిట్టుబాటు కావడం లేదు. ఉపాధిహామీ కూలీలు పడుతున్న ఇబ్బందులు.. వారికి అందుతున్న సౌకర్యాలపై మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ రాజన్న సిరిసిల్ల జిల్లా బృందం పని ప్రదేశాలను విజిట్‌ చేసింది. పని ప్రదేశాల్లో ఎండలో ఉపాధి పొందుతూ కూలీలు ఆవేదనను వ్యక్తం చేశారు.

ఎండలోనే ‘ఉపాధి’
ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లిలో కూలీలు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల/నెట్‌వర్క్‌)

అప్పుడే ఎండలు భగ్గుమంటున్నాయి.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ నీడ పట్టున ఉంటున్నారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధిహామీ కూలీలు మాత్రం ఎండలో మాడిపోతున్నారు. నీడ, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా చేసిన పనికి కూలి గిట్టుబాటు కావడం లేదు. ఉపాధిహామీ కూలీలు పడుతున్న ఇబ్బందులు.. వారికి అందుతున్న సౌకర్యాలపై మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ రాజన్న సిరిసిల్ల జిల్లా బృందం పని ప్రదేశాలను విజిట్‌ చేసింది. పని ప్రదేశాల్లో ఎండలో ఉపాధి పొందుతూ కూలీలు ఆవేదనను వ్యక్తం చేశారు.

వేసవి భత్యం దూరం..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో 90 వేల జాబ్‌కార్డులు ఉండగా, 2 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. ఇందులో 64 వేల జాబ్‌ కార్డుల ద్వారా మాత్రమే నిత్యం పనిచేస్తున్నారు. గతంలో వేసవి సమయంలో సమ్మర్‌ అలవెన్స్‌లు అందించేవారు. ఐదు నెలల పాటు వేసవి దృష్ట్యా అందించే భత్యం మూడేండ్లుగా అందడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పనులపై అజామాయిషీ చేస్తూ సాఫ్ట్‌వేర్‌ను మార్చారు. 2022 వరకు దేశమంతా ఒకే విధానంతో ఉండేది. ఆ సమయంలో వేసవి అలవెన్స్‌ కింద ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం ఏప్రిల్‌, మేలో 30 శాతం, జూన్‌లో 20 శాతం అందించేవారు. రాష్ట్ర ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌లో మాత్రమే సమ్మర్‌ అలవెన్స్‌లు జమ చేసేవారు. కేంద్ర ప్రభుత్వం సాప్ట్‌వేర్‌లో సమ్మర్‌ అలవెన్స్‌లో అప్షన్‌ అవకాశం లేకపోవడంతో 2022 నుంచి నిలిచిపోయింది. ఉపాధిహామీ పనుల అంచనాల్లో ఏడాది కాలంలో కనీసం వంద రోజులు తగ్గకుండా పని అందించాలనే లక్ష్యం ఉంది. గతంలో ఒక గ్రామంలో కనీసం 200 మంది వరకు పనిచేసే విధంగా పెద్దపెద్ద పనులు, చెరువుల మరమ్మతులు లాంటివి చేసేవారు. ఇప్పుడు ఎక్కువ శాతం చెట్లకు నీళ్లుపోయడం వంటివే చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి వంద రోజులు పూర్తి చేసిన కుటుంబాలు అతి తక్కువగా ఉండడం గమనర్హం. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో లేబర్‌ బడ్జెట్‌లో ఫిబ్రవరి వరకు 27.55 లక్షల పనిదినాలకు 22 లక్షల వరకు పూర్తి చేశారు. స్థానిక అవసరాల రీత్యానే పనులు కల్పిస్తున్నారు.

26.75 లక్షల పనిదినాల లక్ష్యం...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఉపాధిహామీ పథకంలో కూలీలకు పనిదినాలు కల్పించడానికి రూ.80.26 కోట్ల అంచనా బడ్జెట్‌తో 26.75 లక్షల పనిదినాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 255 గ్రామాల్లో సభలు నిర్వహించి పనులను గుర్తించారు. గ్రామాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు లబ్ధిచేకూరే విధంగా 60 శాతానికి తగ్గకుండా మండల స్థాయిలో వ్యవసాయ సంబంధిత పనులకు ప్రాధాన్యం ఇచ్చారు. లేబర్‌ బడ్జెట్‌ పనిదినాల్లో బోయినపల్లి మండలంలో 1,40,710 పనిదినాలు లక్ష్యంగా పెట్టుకోగా, చందుర్తిలో 2,44,424, ఇల్లంతకుంటలో 2,63,735, గంభీరావుపేటలో 3,66,733, కోనరావుపేటలో 3,02,552, ముస్తాబాద్‌లో 2,51,286, రుద్రంగిలో 69,347, తంగళ్లపల్లిలో 3,34,000, వీర్నపల్లిలో 2,35,000, వేములవాడలో 45,200, వేములవాడ రూరల్‌లో 1,46,730, ఎల్లారెడ్డిపేటలో 2,75,666 పనిదినాలను లక్ష్యంగా పెట్టుకున్నారు. పనిదినాలను 2025 సంవత్సరంలో ఏప్రిల్‌ మాసంలో 4,36,477 పనిదినాలు కల్పించాలని నిర్ణయించారు. మేనెల వరకు 8,65,202 పనిదినాలు, జూన్‌వరకు 11,19,603 పనిదినాలు, జూలై వరకు 12,31,258 పనిదినాలు, ఆగస్టు వరకు 13,37,300 పనిదినాలు, సెప్టెంబరు వరకు 14,43,862 పనిదినాలు, అక్టోబరు వరకు 15,58,084 పనిదినాలు, నవంబరు వరకు 16,92,632 పనిదినాలు, డిసెంబరు వరకు 18,42,542 పనిదినాలు, 2026 సంవత్సరంలో జనవరి వరకు 20,25,122 పనిదినాలు, ఫిబ్రవరి వరకు 23,08,391 పనిదినాలు, మార్చి వరకు పూర్తిగా 26,75,383 పనిదినాలు లక్ష్యాన్ని పూర్తిచేసే విధంగా యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేశారు. కానీ ఉపాధిహామీ కూలీలకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఇల్లంతకుంటలో..

వలసల నివారణకు ప్రభుత్వం కొనసాగిస్తున్న ఉపాధిహామీ పనుల వద్ద వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మండలంలో 33 గ్రామపంచాయతీలు ఉండగా అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. పనులకు ప్రతిరోజు 1100 మంది కూలీలు వస్తున్నారు. ఉపాధిహామీ పథకం కింద చేపల చెరువు, ఫాంపాండ్‌లు, ఫీడర్‌చానల్‌, ఖండిత కందకాల పనులు కొనసాగుతున్నాయి. పనుల వద్ద తాగునీరు. నీడ ఏర్పాటు చేయడం గ్రామపంచాయతీలకు అప్పగించారు. తాగునీటి సౌకర్యం అన్ని గ్రామాల్లో ఉండగా, చలువ పందిళ్లు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు.

ఎల్లారెడ్డిపేటలో..

ఎల్లారెడ్డిపేట మండలంలోని 24 గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద అధికారులు భూఅభివృద్ధి, నీటి కుంటలు, కాల్వల పూడికతీత పనులను చేపట్టారు. మొత్తం 12234 మందికి జాబ్‌ కార్డులుండగా ప్రతి రోజు గ్రామాల్లో 6 వేల మంది మండుతున్న ఎండల్లోనే కూలీలు పనులు చేస్తున్నారు. ఎలాంటి చలువ పందిళ్లను ఏర్పాటు చేయలేదు. తాగేందుకు నీళ్లను కూలీలే ఇళ్ల వద్ద నుంచి తీసుకెళుతున్నారు. పని ప్రదేశాల్లో మెడికల్‌ కిట్టు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటలో లేవు. ఎండ తీవ్రతకు ఎవరైనా కూలీలు అస్వస్థతకు గురైతే దగ్గరలోని చెట్ల కిందకు తీసుకెళుతున్నారు. రాచర్లబొప్పాపూర్‌ గ్రామంలో ట్యాంకరు లేకపోవడం వల్ల ఉపాధి కూలీలు రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ పొలాల నుంచి బిందెలతో నీళ్లు మోసుకొచ్చి మొక్కలకు పోస్తున్నారు. అసౌకర్యాల నడుమ పనులు చేయాల్సి వస్తోందని కూలీలు వాపోతున్నారు.

చందుర్తిలో..

మండలంలోని 19 గ్రామాల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. మండలంలో మొత్తం జాబ్‌ కార్డులు 7,933 ఉండగా, 4,805 మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారు. ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో పని ప్రదేశాల్లో ఉపాధి కూలీలకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికార యంత్రాంగం కనీస వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం చూపుతోంది. పని ప్రదేశాల్లో తాగునీటి సదుపాయం లేక ఇళ్లనుంచే నీటి డబ్బాలు వెంట తెచ్చుకుంటున్నారు. మరికొందరు తడారిన గొంతులతో తల్లడిల్లుతున్నారు. పని ప్రదేశాల్లో నేల గట్టిగా ఉండటంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. పదేళ్లుగా పనిముట్లు అందించడంలేదు. దీంతో కూలీలే ఎవరికి వారు పనిముట్లు తెచ్చుకుంటున్నారు. కూలీలకు గాయాలు జరిగిన సందర్భంలో ప్రాథమిక చికిత్స కిట్లు సమకూర్చాలి. కిట్లో అయోడిన్‌, బ్యాండేజి, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, కొన్ని రకాల మాత్రలు అందుబాటులో ఉంచాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి వీటి పంపిణీ నిలిచిపోయింది. కూలీలు తమ పని దినాల వివరాలు రాసేందుకు ఉపాధిహామీ కూలీలకు జాబ్‌ కార్డులో అందకపోవడంతో ఇంటివద్ద నుంచే నోట్‌బుక్స్‌ తెచ్చుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి జాబ్‌కార్డులు రావడంలేదని కూలీలు పేర్కొన్నారు.

అలవెన్స్‌ ఇవ్వడం లేదు..

- పున్ని రేణుక, గొల్లపల్లి

ప్రభుత్వం గతంలో కూలీలకు వేసవి అలవెన్స్‌ ఇవ్వగా, ఈసంవత్సరం ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఎండలో పనిచేయడం ఇబ్బందిగా మారింది. పనిముట్ల సరఫరా లేకపోవడంతో వచ్చిన కూలిడబ్బుల్లో నుంచి పనిముట్లు కొంటున్నాం. జనవరిలో కూలి డబ్బులు అకౌంట్లో పడగా, ఇంతవరకు రాలేదు. పనిప్రదేశాల వద్ద అన్ని విధాలైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.

చేతికి బొబ్బలు వస్తున్నాయి..

- సుంకరి నర్సయ్య, అక్కపల్లి

మా ఊరిలోని కామునిచెరువులో ఉపాధి పనులు చేస్తున్నాం. మట్టి గట్టిగా ఉండడం వల్ల తవ్వేందుకు ఇబ్బందవుతోంది. చేతులు బొబ్బలు వస్తున్నాయి. కొలతలు తగ్గించాలి. ఎండలో పనులు చేయడం వల్ల ఇంటి నుంచి తెచ్చుకున్న నీళ్లు సరిపోవడం లేవు. పనులు చేస్తున్న క్రమంలో గాయాలైతే వైద్యం అందించేందుకు మందులు లేవు.

ఇంటి నుంచి వాటర్‌ బాటిళ్లు తెచ్చుకుంటున్నాం..

- మందాటి మల్లవ్వ, ఉపాధి కూలీ, అక్కపల్లి

పొద్దుగాల ఏడు గంటలకు పోతే ఇంటికి వచ్చేసరికి ఒంటిగంట అవుతోంది. ఊరికి దూరంలో ఉన్న కాముని చెరువులో మట్టి తీత పనులకు పోతున్నా. తాగేందుకు ప్రతి రోజు ఇంటి నుంచే వాటర్‌ బాటిళ్లు వెంట తీసుకుపోతున్నా. నీళ్లు సరిపోవడం లేవు. ఎండలోనే పనులు చేయడం వల్ల దూపయితంది. తాగునీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలి.

కూలీ డబ్బులు రావడం లేదు..

- రెడ్డి మల్లవ్వ, తంగళ్లపల్లి

ఉపాధిహమీ కూలి డబ్బులు సక్రమంగా రావడం లేదు. గతంలో 15 రోజులకు అకౌంట్‌లో జమ అయ్యేవి. నెల 15 రోజులవుతున్నా డబ్బులు రాలేదు. ప్రస్తుతం రోడ్డు పనులు చేస్తున్నాం. రోడ్డుపక్కన చెట్ల పోదాలు తొలగిస్తుంటే పాములు వస్తున్నాయి. ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకుని పనులు చేస్తున్నాం. ఎండలు ముదిరితే పనులు కష్టంగా ఉంటాయి. ప్రస్తుతం పనుల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేవు.

ప్రయాణ భత్యం చెల్లించడం లేదు..

- పసుల మల్లవ్వ, ఎనగల్‌

గత కొన్ని సంవత్సరాలు నుంచి ఉపాధిహామీ పనులకు హాజరయ్యే వికలాంగులకు కూలీలకు ప్రయాణ భత్యం చెల్లించడం లేదు. తాగునీటి సరఫరా కూడా జరగడం లేదు. గతంలో గడ్డపారలకు డబ్బులు ఇచ్చేది.. ఇప్పుడు ఇస్తలేరు. వికలాంగులకు పని సమయం తగ్గించాలి.

Updated Date - Mar 12 , 2025 | 01:18 AM