Share News

jagtyaala : రిజర్వేషన్లు కొలిక్కి

ABN , Publish Date - Nov 24 , 2025 | 12:50 AM

జగిత్యాల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశాలతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను చేపట్టి పూర్తి చేశారు.

jagtyaala :  రిజర్వేషన్లు కొలిక్కి

- పలు ప్రాంతాల్లో తారుమారైన బీసీ సీట్లు

- రిజర్వేషన్‌ రివర్స్‌తో నిరుత్సాహం

- జిల్లాలో 385 పంచాయతీలు

జగిత్యాల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశాలతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను చేపట్టి పూర్తి చేశారు. ఆయా మండలాలకు చెందిన ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మహిళా రిజర్వేషన్లకు డ్రా నిర్వహించారు. కొన్ని రోజులుగా పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల రిజర్వేషన్ల కోసం ఆశావహులు ఎదురుచూశారు. ప్రభుత్వం గెజిట్‌ జారీ చేయడంతో అధికారులు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. జీవో నంబరు 46కు అనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియను నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం మించకుండా జాగ్రత్తలు వహించారు. ఆర్డీవోల ఆధ్వర్యంలో సర్పంచ్‌ రిజర్వేషన్లు, ఎంపీడీవోల ఆధ్వర్యంలో వార్డులకు రిజర్వేషన్లను ఖరారు చేశారు.

ఫరొటేషన్‌ పద్ధతిలో మహిళా రిజర్వేషన్లు

సర్పంచ్‌ రిజర్వేషన్లకు 2011 జన గణన, ఎస్‌ఈఈసీసీ డేటా వినియోగిస్తూ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్‌ పద్ధతిలో అధికారులు ఖరారు చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో రిజర్వు చేసిన వార్డులు, గ్రామాలు అదే కేటగిరీకి మళ్లీ రిజర్వ్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వంద శాతం ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్‌ స్థానాలు ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు. మొదట ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ తర్వాత ఎస్సీ, బీసీలకు కేటాయింపులు జరిపారు.

జిల్లాలో 3,536 వార్డులు..

జిల్లా వ్యాప్తంగా 385 గ్రామ పంచాయతీలు, 3,536 వార్డులకు అధికారులు రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వెల్లడించారు. జిల్లాలో గ్రామీణ ఓటర్లు 6,07,263 ఉండగా, ఇందులో 2,89,266 పురుషులు, 3,17,988 మహిళలు, 9 ఇతర ఓటర్లున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కొరకు అవసరమైన సంఖ్యలో పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో 11,213 ఎంపీటీసీ పోలింగ్‌ స్టేషన్లు, 416 పోలింగ్‌ లొకేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన 3,508 జంబో బ్యాలెట్‌ బాక్సులు, 1,428 మీడియం బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశారు.

ఫఏర్పాట్లపై అధికారం యంత్రాంగం దృష్టి.

పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సరిపడా ఉద్యోగులు, ఇతర అన్ని రకాల పనులను ఇదివరకే పూర్తి చేశారు. బ్యాలెట్‌ పత్రాలు, పోస్టల్‌ ఓట్ల వ్యవహారం, వివిధ రకాల బాఽధ్యతలు అప్పగించనున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ మేరకు జాబితాను కలెక్టర్‌ సత్యప్రసాద్‌ పరిశీలిస్తున్నారు. అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత, లోకల్‌ బాడీ అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌లతో పాటు పలువురు జిల్లా అధికారులకు వివిధ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగించనున్నారు.

ఫ పల్లెల్లో ఎన్నికల సందడి

రిజర్వేషన్ల ప్రక్రియలో ప్రభుత్వం తెచ్చిన మార్పులతో కొన్ని పల్లెల్లో సీన్‌ రివర్స్‌ అవుతోంది. పలు చోట్ల ఆశావహులు జాతకాలు తారుమారు అయ్యాయి. సర్పంచ్‌ పదవి దక్కుతుందనుకున్న వారి అదృష్టం చేజారి పోతోంది. సెప్టెంబరు 29 నాటి నోటిఫికేషన్‌లో రిజర్వేషన్లతో పలు ప్రాంతాల్లో పదవులు బీసీలకు కేటాయించబడ్డాయి. వారే సర్పంచ్‌లని, వార్డు సభ్యులని భావించగా, ప్రస్తుతం బీసీ రిజర్వేషన్‌ మార్పు చేసి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తున్నందున మళ్లీ బీసీ, మహిళా రిజర్వేషన్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో సర్పంచ్‌ పదవుల్లో పలు చోట్ల ఆశావహులకు షాక్‌ తగిలింది. ఫలితంగా పంచాయతీ ఎన్నికల వేళ, జిల్లా రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

---------------------------------------------------------------------------------

జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్లు ఇలా..

జిల్లాలో మొత్తం పంచాయతీలు...385

మొత్తం వార్డులు...3,536

---------------------------------------------------------------------------------

సర్పంచ్‌ రిజర్వేషన్లు...మొత్తం...జనరల్‌...మహిళలు

వంద శాతం ఎస్టీలు గల పంచాయతీలు...22 -12 - 10

ఎస్టీలు - 05 - 05 - 00

ఎస్సీలు - 72 - 41 - 31

బీసీలు - 98 - 54 - 44

అన్‌ రిజర్వ్‌డ్‌ - 188 - 99 - 89

---------------------------------------------------------------------------------

Updated Date - Nov 24 , 2025 | 12:50 AM