jagtyaala : యువజనోత్సవాలకు వేళాయే..
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:29 AM
జగిత్యాల, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మారుమూల పల్లెల్లోని యువతలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం యువజన ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది.
- నేడు జగిత్యాల స్టేడియంలో ప్రారంభం
- జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపికలు
- ఏడు అంశాలపై పోటీలు
జగిత్యాల, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మారుమూల పల్లెల్లోని యువతలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం యువజన ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. చదువుతో పాటు కళలు, కళా ప్రదర్శనలు ఆటల్లో యువతను ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా ఏడు కేటగిరీల్లో ప్రదర్శనలకు అవకాశం ఇస్తూ జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపిక కోసం శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో యువజన క్రీడల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జానపద నృత్యం (గ్రూప్), జానపద పాటలు (గ్రూప్), కథా రచన(తెలుగు, హిందీ, ఇంగ్లీష్), పెయింటింగ్, ఉపన్యాసం (హిందీ, ఇంగ్లీష్, తెలుగు), కవిత్వం (హిందీ, ఇంగ్లీష్, తెలుగు), ఇన్నోవేషన్ ఆఫ్ ట్రాక్ (ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా) నిర్వహిస్తున్నారు. 15 నుంచి 29 సంవత్సరాల లోపు వయసు వారు మాత్రమే అర్హులు. ఇందుకు సంబంధించి కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాల మేరకు 29వ జాతీయ యువజన దినోత్సవం 2026 కోసం సంబంధిత శాఖ అధికారులు జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఫ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు...
మొత్తం ఏడు కేటగిరీలు ఉండగా ప్రథమ స్థానంలో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విజేతలను వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 12 వరకు న్యూఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయిలో జరిగే వేడుకలను పంపిస్తారు.
అంశాలు, నిబంధనలు...
ఫ జానపద నృత్య బృందం
ఈ బృందంలో సభ్యుల సంఖ్య 10కి మించరాదు. ప్రదర్శనకు గరిష్ఠ కాల పరిమితి 15 నిమిషాలు. భారత సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలి. సినిమా పాటలను అనుమతించరు. వాయిద్య పరికరాలు అభ్యర్థులే తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఫ జానపద పాటల బృందం
సభ్యుల సంఖ్య 10 మందికి మించరాదు. ప్రదర్శనకు గరిష్ట కాల పరిమితి 7 నిమిషాలు. భారత సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలి. సినిమా పాటలను అనుమతించరు. వాయిద్య పరికరాలు అభ్యర్థులే తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఫ కథా రచన (హిందీ, ఇంగ్లీష్, తెలుగు)
ఒక్కొక్కరు ఒక రచనను సమర్పించాలి. వ్యాస రచన వెయ్యి పదాల సముదాయంతో 60 నిమిషాలలో పూర్తి చేయాలి. ఏ కులాన్ని గానీ, ఏ మతాన్ని గానీ, జాతిని గానీ, వర్గాన్ని గానీ కించపరిచే విధంగా ఉండకూడదు. రచనలో అభ్యంతరకరంగా గానీ, అస్పష్టంగా గానీ అనుచిత వ్యాఖ్యలు ఉండకూడదు.
ఫ పెయింటింగ్
ఒక్కొక్కరు ఒక పెయింటింగ్ మాత్రమే సమర్పించాలి. ఎంట్రీ ఒరిజినల్ అయి ఉండాలి. పెయింటింగ్ ఏ3 సైజులో 90 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి. పెయింటింగ్ ఏదైనా నిర్థిష్ట సంస్థకు లేదా బ్రాండ్ పేరు ప్రాతినిధ్యం ఉండకూడదు. చిత్రలేఖనానికి సంబంధించిన శీర్షిక 20-30 పదాలు మించకూడదు. పెయింటింగ్ సామాగ్రిని ఎవరికి వారే తెచ్చుకోవాలి.
ఫ ఉపన్యాసం (హిందీ, ఇంగ్లీష్, తెలుగు)
ఎంపిక చేసిన అంశంపై ఏదైనా బాషలో ఏడు నిమిషాలు మించకుండా అనర్గళంగా మాట్లాడాలి.
ఫ కవిత్వం (హిందీ, ఇంగ్లీష్, తెలుగు)
ఒక్కొక్కరు ఒక్క రచనను మాత్రమే సమర్పించాలి. వ్యాస రచన 500 పదాల సముదాయంతో 60 నిమిషాలలో పూర్తి చేయాలి.
ఫ ఇన్నోవేషన్ ట్రాక్ (ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళా)
యువత సైన్స్ అండ్ టెక్నాలజీలో తయారు చేసిన కొత్త ప్రాజెక్టులను ప్రదర్శనకు తీసుకురావాలి. ఇందులో పాల్గొనే వారు పర్యావరణం, వాతావరణ మార్పు, ఆరోగ్య సంక్షోబాలు వంటి అధునిక సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైన ఆలోచన, సమస్య పరిష్కారం, ఆవ్కిరణలకు సంబంధించిన వాటిపై ప్రయోగాలను సైన్స్‌మేళాలో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇందులో ఎంపికైన ప్రాజెక్టును రాష్ట్రస్థాయికి పంపిస్తారు.
యువత సద్వినియోగం చేసుకోవాలి
-కోరుకంటి రవికుమార్, జిల్లా యువజన, క్రీడాభివృద్ధి అధికారి
జిల్లా స్థాయి యువజన కళాకారుల ఎంపిక వేదికను యువత సద్వినియోగం చేసుకోవాలి. చదువుతో పాటు ఆటలు, కళారూపకంగా రాణిస్తున్న వారికి ఇది చక్కటి వేదిక. ఏడు అంశాలలో పోటీలు జరుగుతాయి. ప్రతి అంశానికి న్యాయ నిర్ణేతలు విజేతలను ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయిలో అర్హత సాధించిన ప్రథములను రాష్ట్ర స్థాయికి, అక్కడ విజేతలుగా నిలిచిన వారిని జాతీయ స్థాయికి పంపిస్తారు.