jagityala : డీసీసీ పీఠం దక్కేదెవరికో..?
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:41 AM
జగిత్యాల, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. డీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి కసరత్తు చేస్తోంది.
-ఎంపిక కోసం త్వరలో జిల్లాకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకుల రాక
-ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
-నియోజకవర్గాల వారీగా అభిప్రాయ సేకరణ
-ఆశావహుల ముమ్మర యత్నాలు
జగిత్యాల, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. డీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ, టీపీసీసీ కార్యాలయం నుంచి ప్రత్యేక పరిశీలకులను పంపిస్తోంది. దీంతో జిల్లాలో ఆశావహుల హడావుడి మొదలైంది. తమ పొలిటికల్ గాడ్ ఫాదర్స్ ఆశీస్సులతో దరఖాస్తులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొడిమ్యాల, మల్యాల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిదిలోని మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండలాలకు చెందిన పలువురు సీనియర్ నేతలు డీసీసీ పీఠం దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు.
ఫఏఐసీసీ పరిశీలకుడిగా జయకుమార్
డీసీసీ అధ్యక్ష పదవికి నేతను ఎంపిక చేయడానికి తొలుత జగిత్యాల జిల్లాకు ఏఐసీసీ పరిశీలకుడిగా సిద్ధిఖీ, పీసీసీ పరిశీలకులుగా జగ్గారెడ్డి, మహ్మద్ ఖాజా ఫకీరోద్దిన్, కేతూరి వెంకటేశ్, గిరిజ శెట్కార్‌లను నియమించారు. అయితే సిద్ధిఖీ పలు కారణాల వల్ల రాలేకపోవడంతో ఏఐసీసీ పరిశీలకుడి నియామకంలో రెండు రోజుల క్రితం మార్పు చేసింది. జగిత్యాల జిల్లా ఏఐసీసీ పరిశీలకుడిగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాజీ ఎంపీ డాక్టర్ జయ కుమార్‌ను నియమించింది.
ఫరెండు రోజుల్లో జిల్లా పర్యటన..
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులతో కూడిన బృందం వచ్చే రెండు, మూడు రోజుల్లో జగిత్యాల జిల్లాలో పర్యటించనుంది. ఈ బృందం జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని మల్యాల, కొడిమ్యాల, వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్, మేడిపల్లి, బీమారం మండలాలకు చెందిన ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు. కార్యకర్తలు, పార్టీ క్యాడర్ అభిప్రాయాలను సేకరించనున్నారు.
ఫకాంగ్రెస్‌లో హడావుడి..
జిల్లాకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు వస్తున్న నేపథ్యంలో డీసీసీ పీఠం కొరకు పోటీపడుతున్న నాయకుల హడావుడి మొదలైంది. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభిప్రాయం సైతం కీలకం కానుంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనుచరులకే మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగిస్తారని ఆయన అనుచరులు అంటున్నారు. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి అనుచరుడు, టీపీసీసీ సెక్రెటరీ బండ శంకర్, కోరుట్ల నియోజకవర్గానికి చెందిన టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్‌రావు, ధర్మపురి దేవస్థాన అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు, టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు శేర్ నర్సారెడ్డి తదితరుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. పలువురు బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలు అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పలువురు మహిళా నేతలు సైతం అధ్యక్ష పీఠంపై దృష్టి సారించినట్లు సమాచారం. కాంగ్రెస్ బీసీ కార్డుతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో డీసీసీ పగ్గాలు బీసీలకు వస్తాయని మరికొందరు అంటున్నారు. వీటికి తోడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు అభిప్రాయాలు ఎలా ఉంటాయో.. చివరకు డీసీసీ పీఠం ఎవరిని వరిస్తుందోనన్న చర్చలు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చోటుచేసుకుంటున్నాయి.
ఫముగ్గురి పేర్లతో అధిష్ఠానానికి జాబితా
పదేళ్లుగా ప్రతిపక్ష పార్టీగా ఉండి ప్రస్తుతం అధికారంలోకి రావడంతో పార్టీ పదవులపై పలువురు ఆశావహులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు సైతం ఎవరికీ పెద్దగా దక్కలేదు. ఈ క్రమంలో సీనియర్ నాయకులు తమకు పదవులు ఇవ్వాలని కోరుతున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన విషయం విదితమే. అయితే అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటించారు. ఈ వ్యవహారం అసెంబ్లీ స్పీకర్ పరిశీలనలో ఉంది. అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే గానీ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ వ్యవహారంతో అటు బీఆర్‌ఎస్‌లో, ఇటు కాంగ్రెస్‌లో తమకు పదవులు దక్కడం లేదని ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్ అనుచరులు నిరాశతో ఉన్నారు. కాగా ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు జిల్లాలో పర్యటించి కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకొని ముగ్గురు పేర్లతో జాబితా పంపించనున్నారు. ఆ ముగ్గురు జాబితాలో ఎవరికి చోటు లభిస్తుందోనని ఆశావహులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.