jagityala : వేతనాలు అందేదెన్నడో..?
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:47 AM
జగిత్యాల, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఒకేషనల్ లెక్చరర్లు ఐదు నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.
-ఐదు నెలలుగా ఒకేషనల్ కాంట్రాక్టు లెక్చరర్ల ఎదురుచూపులు
-భారంగా కుటుంబ పోషణ
-ప్రభుత్వం స్పందించాలని వినతి
జగిత్యాల, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఒకేషనల్ లెక్చరర్లు ఐదు నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న సుమారు 420 మంది, జిల్లాలో 11 మంది కాంట్రాక్టు ఒకేషనల్ లెక్చరర్లు సకాలంలో వేతనాలు అందక విలవిలలాడుతున్నారు. చాలీచాలని జీతాలతో అనేక సంవత్సరాలుగా విద్యార్థులకు బోధిస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధిందిన వేతనాలు రాకపోవడంతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక శాఖ క్లియరెన్స్ రాకపోవడం వల్ల వేతనాలు అందడం లేదని వారు వాపోతున్నారు. గత బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో ఇంటర్ బోర్డు పరిధిలో దాదాపు మూడు వేల మంది కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేశారు. ఇంటర్ ఒకేషనల్ కోర్సు విభాగంలో పనిచేస్తున్న సుమారు 420 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పోస్టులు మంజూరు కాకపోవడం, పలు ఇతర కారణాల వల్ల రెగ్యులర్ కాలేదు. ఒకవైపు ఉద్యోగాలు రెగ్యులర్ కాకపోవడం, మరోవైపు ఏప్రిల్ నుంచి వేతనాలు అందకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని వారు కోరుతున్నారు.
ఫజిల్లాలోని నాలుగు కళాశాలల్లో..
జిల్లాలో నాలుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 11 మంది కాంట్రాక్టు ఒకేషనల్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. ఇందులో జగిత్యాల ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో ఐదుగురు, జగిత్యాల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఒక్కరు, కోరుట్ల ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో ముగ్గురు, రాయికల్ కళాశాలలో ఇద్దరు ఒకేషనల్ జూనియర్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. సంవత్సరాల తరబడి తమ పోస్టులు రెగ్యులర్ కాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. వీరితో పనిచేసిన జనరల్ సబ్జెక్టుల లెక్చరర్లు మంచి వేతనాలతో పాటు సెలవులు, ఇతర ప్రయోజనాలు పొందుతున్నారు. 2000 సంవత్సరం నుంచి పనిచేస్తున్నప్పటికీ రెగ్యులర్ కావడం లేదని వారు వాపోతున్నారు. కేవలం చిన్నాచితక కారణాలతో రెగ్యులర్ చేయకుండా పక్కన పెట్టడం అన్యాయమని కాంట్రాక్టు ఒకేషనల్ లెక్చరర్లు వాపోతున్నారు. సాంక్షన్ పోస్టులు లేవని కొందరిని రెగ్యులర్ చేయకుండా అడ్డుకోవడం ఆర్టికల్ 14కు విరుద్ధమని అంటున్నారు. తమ పోస్టులను రెగ్యులర్ చేసి ప్రతీ నెల వేతనాలు అందించాలని వారు కోరుతున్నారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
- నలువాల శ్రీనివాస్, కాంట్రాక్టు లెక్చరర్, జగిత్యాల
రాష్ట్రంలో జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల పెండింగ్ వేతనాలు వెంటనే అందించాలి. ఐదు నెలలుగా వేతనాలు అందకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కుటుంబ పోషణ భారంగా మారుతోంది. వేతనాలు ప్రతీ నెల సక్రమంగా చెల్లించాలి.
సమస్య పరిష్కరించాలి
- కాసం గంగాభవాని, కాంట్రాక్టు లెక్చరర్, జగిత్యాల
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒకేషనల్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు ఐదు నెలలుగా వేతనాలు అందడం లేదు. ఆర్థిక శాఖ క్లియరెన్స్ లేకపోవడంతో వేతనాలు అందడం లేదంటున్నారు. చాలీచాలని వేతనాలతో సంవత్సరాల తరబడి పనిచేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే వేతనాలు విడుదల చేయాలి.
రెగ్యులరైజ్ చేయాలి
-అంబారి శంకరయ్య, కాంట్రాక్టు లెక్చరర్, జగిత్యాల
రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఒకేషనల్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి. ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ రెగ్యులరైజ్ కాకపోవడం, వేతనాలు సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా పాలకులు స్పందించి కాంట్రాక్టు ఒకేషనల్ లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలి.