Share News

jagityala : చెరువులకు జలసిరి

ABN , Publish Date - Aug 25 , 2025 | 01:54 AM

జగిత్యాల, ఆగుస్టు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

jagityala :  చెరువులకు జలసిరి

- జిల్లాలో మొత్తం చెరువులు...1,072

- మత్తడి పారుతున్న చెరువులు...411

- పూర్తిగా నిండినవి 200

- సగానికిపైగా నిండిన చెరువులు 134

- సాగునీటికి తీరిన కొరత

- జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదు

జగిత్యాల, ఆగుస్టు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటితో చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. వందల సంఖ్యలో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ అధిక వర్షపాతం నమోదై వరద పోటెత్తడంతో చెరువులు, కుంటలు, ఇతరత్రా జలాశయాలు పూర్తిస్థాయిలో నిండి మత్తడి మీద నుంచి పారుతున్నాయి. జిల్లాకు వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుతో పాటు వరద కాలువ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, రోళ్లవాగు ప్రాజెక్టు, బొమ్మెన ప్రాజెక్టు, రాళ్లవాగు ప్రాజెక్టు, సుమారు 35 ఎత్తిపోతల పథకాలు, పలు రిజర్వాయర్లలో, చిన్నాచితక ప్రాజెక్టుల్లో జలకళ ఉట్టిపడుతోంది. దీంతో జిల్లాలోని ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

- 60,000 ఎకరాల ఆయకట్టు..

జిల్లా వ్యాప్తంగా 1,072 చెరువులు, కుంటలున్నాయి. వీటి కింద సుమారు 60,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో వంద ఎకరాలకు పైబడి ఆయకట్టు కలిగిన చెరువులు 166 కాగా, వంద ఎకరాల్లోపు ఆయకట్టు గల చెరువులు 906 ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల జిల్లాలోని 411 చెరువులు మత్తడి పారుతున్నాయి. 200 చెరువులు పూర్తిగా నీటితో నిండగా, 134 చెరువులు సగానికిపైగా నిండాయి. 25 శాతంలోపు నిండిన చెరువులు 179 ఉండగా, 25 శాతం నుంచి 50 శాతం వరకు 148 చెరువులు నిండాయి. 50 శాతం నుంచి 75 శాతం వరకు 134 చెరువులు నిండాయి. జిల్లా పరిధిలోని 14 మండలాల్లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాలువ కింద ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 1,67,744 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేస్తున్నారు.

- సాగునీటికి తీరిన కొరత...

జిల్లాలోని పలు చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి గత నెలలోనే నీరు చేరినా... అంతంతమాత్రంగానే నిండాయి. దీంతో ఆయకట్టు కింద రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలతో చెరువుల్లోకి నిండుగా నీరు చేరడంతో జలకళను సంతరించుకున్నా యి. ఆయకట్టుకు నీటి కొరత తీరడంతో పాటు మూగ జీవాల దాహార్తి సైతం తీరనుంది. దీంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగనున్నాయి.

- ఇరు శాఖల సంయుక్త పర్యవేక్షణ...

ప్రస్తుత యేడాది వరద కారణంగా జిల్లా వ్యాప్తంగా చెరువులకు బుంగలు, గండ్లు తదితర అంశాలపై అధికారులు సంయుక్తంగా పర్యక్షిస్తున్నారు. నీటి పారుదల శాఖ, వరదలతో నిండిన చెరువులకు గండ్లు పడకుండా రెవెన్యూ, చిన్ననీటిపారుదల శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చెరువులు, కుంటల స్థితిగతులను పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షిస్తూ రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం నివేదించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

- 544.1 మిల్లీమీటర్ల వర్షపాతం..

ప్రస్తుత సీజన్‌లో జిల్లావ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదైంది. సారంగపూర్‌ మండలంలో మినహా ఇతర ప్రాంతాల్లో సాధారణ, లోటు వర్షపాతం నమోదు అయింది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 615.7 మిల్లీమీటర్లు కాగా 544.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, రాయికల్‌, బీర్‌పూర్‌, ధర్మపురి, బుగ్గారం, మేడిపల్లి, కోరుట్ల, మల్యాల, వెల్గటూరు, ఎండపల్లి, బీమారం మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. జగిత్యాల, జగిత్యాల రూరల్‌, మెట్‌పల్లి, కథలాపూర్‌, మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది.

Updated Date - Aug 25 , 2025 | 01:54 AM