Share News

jagityala : ఉత్సవాలకు సన్నద్ధం

ABN , Publish Date - Aug 23 , 2025 | 01:12 AM

జగిత్యాల, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం కోసం జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది.

jagityala :  ఉత్సవాలకు సన్నద్ధం

-గణేష్‌ నవరాత్రోత్సవాలు శాంతియుతంగా జరిగేలా ప్రణాళిక

-సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల ప్రత్యేక నిఘా

-శోభాయాత్రలో డీజేలు నిషేధం

-ఈనెల 27న వినాయక చవితి

జగిత్యాల, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం కోసం జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు జరగడానికి పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 6 వరకు గణేష్‌ నవరాత్రోత్సవాలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం 2,791 మండపాలు ఏర్పాటు చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈసారి మండలపాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జిల్లా ఉన్నతాధికారులు విద్యుత్‌ శాఖ, నీటి పారుదల శాఖ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌, మత్స్య శాఖ, అగ్నిమాపక శాఖ, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులందరినీ సమన్వయం చేస్తున్నారు. రహదారుల వెంట శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం, రోడ్లకు మరమ్మతుల వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు.

ఫప్రతి మండపానికి అనుమతి తప్పనిసరి..

ప్రతి మండపానికి అనుమతి తప్పనిసరి. ఇందుకోసం ప్రత్యేకంగా పోలీస్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు ఇచ్చిన అనుమతి కాపీని మండపంలో కనిపించే విధంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ప్రతి మండపాన్ని జియో ట్యాగింగ్‌ చేయనున్నారు. డీజేలకు అనుమతి లేదు. అనుమతి ఇచ్చిన మేరకు రాత్రి పది గంటల లోపు మైక్‌లు కట్టేయాలి. ప్రతి మండపాన్ని బ్లూకోట్స్‌ పోలీసులు, పెట్రో మొబైల్‌ కానిస్టేబుళ్లు విజిట్‌ చేస్తారు. అక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకొని పరిష్కరిస్తారు. నిమజ్జనానికి అవసరమైన రూట్‌ మ్యాప్‌ ముందుగానే పోలీసు శాఖకు అందించాలి. నిమజ్జనం కోసం ప్రధాన పట్టణాలైన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌లలో చెరువులు, కాలువలు, వాగుల వద్ద భద్రతా ఏర్పాటు చేస్తున్నారు.

ఫతాత్కాలిక విద్యుత్‌ కనెక్షన్‌..

ప్రతి మండపం నిర్వాహకులు డీడీ చెల్లిస్తే విద్యుత్‌ శాఖ సిబ్బంది కరెంట్‌ పోల్‌ నుంచి తాత్కాలిక కనెక్షన్‌ ఇస్తారు. అనుకోని పరిస్థితిలో ప్రమాదం జరిగితే విద్యుత్‌ శాఖ నుంచి పరిహారం అందుతుంది. దీని కోసం 250 కిలోవాట్స్‌కు రూ.500లు, 500 కిలో వాట్స్‌కు రూ.1,000లు, 1000 కిలో వాట్స్‌కు రూ.1,500తో పాటు ప్రతి కిలో వాట్స్‌కు రూ.750 చెల్లించాలి. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా కిందికి వేలాడే కరెంటు తీగలు, చెట్ల కొమ్మలు ఉంటే తొలగించనున్నారు. అయితే విగ్రహాల ఎత్తు సమాచారం ముందుగానే తీసుకుంటారు. వినాయక నిమజ్జనోత్సవం కోసం చెరువుల వద్ద గజ ఈత గాళ్లను అందుబాటులో ఉంచనున్నారు. క్రేన్‌, లైటింగ్‌ వ్యవస్థ, అత్యవసర వైద్యం, తాగునీరు, బారికేడ్లు, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, పారిశుధ్యం వంటి చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలను ఉన్నతాధికారులు ఆదేశించారు. విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు పర్యవేక్షణ కొనసాగనుంది.

ఫసోషల్‌ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా

ప్రతి గణేష్‌ మండపం వద్ద విధిగా పాయింట్‌ పుస్తకం ఏర్పాటు చేయాలని, అందులో వివరాలు నమోదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పికెట్‌ ఏర్పాటు, సీసీ కెమెరాల బిగింపు, లైటింగ్‌ తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టేవారిపై, వాటిని ఫార్వర్డ్‌ చేసే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక సోషల్‌ మీడియా విభాగం ఏర్పాటు చేసి ప్రతి పోస్టును నిశితంగా పరిశీలించడానికి ఏర్పాట్లు చేశారు.

భక్తి శ్రద్ధలతో నవరాత్రోత్సవాలు జరుపుకోవాలి

-సత్యప్రసాద్‌, కలెక్టర్‌

జిల్లాలో గణేష్‌ నవరాత్రోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. నవరాత్రి ఉత్సవాల్లో నిబంధనలు పాటించాలి. పలు ప్రభుత్వ శాఖల సమన్వయంతో నవరాత్రోత్సవాలు, నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. అధికారులకు అన్ని వర్గాలు ప్రజలు సహకరించాలి.

ప్రశాంతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లు

- అశోక్‌ కుమార్‌, ఎస్పీ

జిల్లాలో గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకునేలా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. గణేష్‌ మండపాల నిర్వాహకులతో ముందుగానే సమావేశాలు నిర్వహించి సమీక్షిస్తున్నాం. వేడుకల్లో ఎక్కడా శాంతి భద్రతల సమస్య రానివ్వకుండా పటిష్ట చర్యలు చేపడతాం.

Updated Date - Aug 23 , 2025 | 01:12 AM