Jagityala : ఎడ్యుకేషన హబ్‌గా జగిత్యాల
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:01 AM
జగిత్యాల, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఉద్యమ ఖిల్లాగా పేరుగాంచిన జగిత్యాల జిల్లా విద్యారంగంలో విశిష్టస్థాయి ఖ్యాతిని గడించింది.
- విద్యా సంస్థలకు నెలవుగా జిల్లా
- ప్రస్తుత యేడాది నవోదయ పాఠశాల ప్రారంభం
- జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం మంజూరు
- ఇప్పటికే అందుబాటులోకి మెడికల్ కళాశాల
- సాంకేతిక విద్యకు కేరాఫ్‌గా జేఎన్టీయూ
- వ్యవసాయ రంగానికి దన్నుగా పొలాస పరిశోధన స్థానం
- కోరుట్ల సిగలో వెటర్నిటీ కళాశాల
జగిత్యాల, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఉద్యమ ఖిల్లాగా పేరుగాంచిన జగిత్యాల జిల్లా విద్యారంగంలో విశిష్టస్థాయి ఖ్యాతిని గడించింది. ఒకనాడు వ్యవసాయ రంగానికి పెట్టింది పేరుగా ఉన్న జగిత్యాల జిల్లా ప్రస్తుత యేడాది విద్యా వినీలాకాశంలో ముందడుగు వేసి, ఎడ్యుకేషన హబ్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలకు తోడు సాంకేతిక, వైద్యరంగాల్లో ఉన్నత విద్యను అందించే కాలేజీలతో జిల్లా కేంద్ర బిందువుగా మారింది. నర్సింగ్ కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల అందుబాటులోకి రావడంతో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. దీనికి తోడు ప్రస్తుత యేడాది జిల్లాలోని కోరుట్లలో నవోదయ పాఠశాల ఏర్పాటు కావడం, జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం జిల్లాకు విద్యారంగంలో మరింత వన్నె తెచ్చింది.
సాధారణ విద్యకు ధీటుగా వ్యవసాయ విద్య...
జిల్లాలోని కోరుట్ల పట్టణ శివారులో 2008లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పశువైద్య కళాశాల పట్టణం సమీపంలో అన్ని రకాల హంగులతో నిర్మాణం చేపట్టారు. పశువుల్లో అద్దె గర్భంతో పాటు అనేక రకాల పరిశోధలనకు కేంద్ర బిందువుగా మారింది. 1980 దశకంలో జగిత్యాలరూరల్ మండలం పొలాస గ్రామంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏర్పాటైంది. సుమారు 22ఏళ్ల కిందటే పరిశోధన స్థానానికి అనుబంధంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశారు. దీంతో వేలాది మంది విద్యార్థులు విద్యాభ్యాసం ప్రస్తుతం వ్యవసాయ శాఖలో ఆయా స్థాయిల్లో సేవలందిస్తున్నారు. అనేక రకాల వరి, ఇతర వంగడాలపై పరిశోధనలు, ప్రదర్శనలు ఏటా జరుగుతున్నాయి. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. సాగులో మెళకులవలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ జిల్లాలోనే వ్యవసాయ పరిశోధన స్థానం రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది.
సాంకేతికకు కేరాఫ్‌గా జేఎన్టీయూ కళాశాల
జగిత్యాల జిల్లాలో సాంకేతిక విద్యకు పర్యాయపదంగా కొండగట్టు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళశాల నిలుస్తోంది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీకి అనుబంధంగా నిర్వహిస్తున్న ఈ కళాశాల పూర్తిస్థాయి భవనంలో సకల సౌకర్యాలతో నిర్మించబడింది. జేఎన్టీయూ కళాశాలలో చదివిన విద్యార్థులు ఇప్పటికే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా దేశ విదేశాల్లో తమ సేవలందిస్తున్నారు. యుజీ ప్రోగ్రాం (బీటెక్)లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాజజీ, ఎలకి్ట్రకల్ అండ్ ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్‌లలో ఒక్కొక్క కోర్సుకు 66 సీట్లు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం(ఎంటెక్)లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ సిస్టమ్స్ అండ్ కంప్యూటర్ ఎలకా్ట్రనిక్స్, ఇంజనీరింగ్ డీజైన్, పవర్ సిస్టమ్స్‌లలో 18 చొప్పున సీట్లు ఉన్నాయి.
- ఇప్పటికే మెడికల్, నర్సింగ్ కళాశాల
జగిత్యాల జిల్లా కేంద్రంలో 2010లోనే నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ప్రారంభంలో అద్దె భవనంలో కొనసాగిన నర్సింగ్ కళాశాల, వసతిగృహం మూడేళ్ల కిందట సొంత భవనంలోకి మార్చారు. అలాగే గతేడాది జూనలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశారు. తర్వాత వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్ర ఆర్థిక శాఖ జగిత్యాల మెడికల్ కళాశాలకు దానికి అనుబంధంగా నిర్వహించే దవాఖానాకు సంబంధించి 1001 బోధన, భోదనేతర పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థలం కేటాయింపుతో పాటు తాత్కాలిక భవన నిర్మాణాలు పూర్తవడంతో అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. 150 సీట్లు మంజూరు కాగా నీట్ అర్హత, కౌన్సెలింగ్ ఆధారంగా విద్యార్థులకు సీట్లను కేటాయించి బోధన కొనసాగిస్తున్నారు. దీంతో జిల్లాలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కోరుట్లలో పశువైద్య కళాశాల..
జిల్లాలోనే తలమానికంగా కోరుట్ల ప్రభుత్వ పశువైద్య కళాశాల ఏర్పడింది. 2008 సంవత్సరం అప్పటి సీఎం వైఎస్‌ఆర్ ప్రభుత్వం మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కృషితో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజేంద్రనగర్‌తో పాటు కోరుట్ల పట్టణంలో పశువైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేసింది. కోరుట్ల శివారులో సుమారు 400 మంది విద్యార్థులు విద్యాభోదన అనుగుణంగా తరుగతి గదులతో పాటు హాస్టల్ వసతులను ఏర్పాటు చేసి మౌలిక వసతులను నిర్మాణం చేశారు.
చేరువగా ‘కేంద్రీయ’ విద్య....
ప్రస్తుత విద్యా సంవత్సరంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు, ఇటీవల కేంద్రీయ విద్యాలయం మంజూరుతో కేంద్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లాకు మరో విద్యా మణిహారం అందించినట్లయింది. కేంద్రీయ విద్యాలయం మంజూరుతో జిల్లా ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. పిల్లలకు ఉన్నతమైన, నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రత్యేక చొరవచూపడం, పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ ఈ యేడాది అక్టోబరులో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కాగా అందులో ఒకటి జగిత్యాల జిల్లాకు కేటాయించారు. కేంద్రీయ విద్యాలయంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. సీబీఎస్‌ఈ సిలబస్ బోధిస్తారు. పేద, మద్యతరగతి ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతుండగా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి భోదన జరిపేలా అధికారులు చర్యలు తీసుకుంటు న్నారు.
చల్‌గల్‌లో ఏర్పాటుకు కసరత్తులు...
జిల్లా కేంద్రానికి సమీపాన జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న చల్‌గల్ వాలంతరి వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. సుమారు 25 ఎకరాల స్థలంలో కేంద్రీయ విద్యాలయ భవన సముదాయం నిర్మాణం కానుంది. దీంతో జగిత్యాల జిల్లా విద్యా రంగంలో మరింత ముందుకు వెళ్లనుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.