Share News

jagityala : జడ్పీ పీఠంపై గురి

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:28 AM

జగిత్యాల, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహరచన చేస్తున్నాయి.

jagityala :  జడ్పీ పీఠంపై గురి

- చైర్మన్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల వ్యూహరచన

- జనరల్‌ మహిళకు రిజర్వ్‌

- సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ తహతహ

- ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే పట్టుదలతో కాంగ్రెస్‌

- రేసులో తాము సైతం అంటున్న బీజేపీ

జగిత్యాల, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ప్రధాన పార్టీలన్నీ వ్యూహరచన చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కావడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జడ్పీ చైర్మన్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో అతివల్లో ఆశావహులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లాలో అత్యధిక ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలను బీసీలకు కేటాయించారు. చైర్మన్‌ స్థానం జనరల్‌ మహిళకు కేటాయించడంతో ఆయా పార్టీలు బలమైన నేతల కోసం గాలిస్తున్నాయి. తాజా రిజర్వేషన్ల ప్రకారం 20 మండలాల్లో 10 జడ్పీటీసీ స్థానాలను మహిళలకు కేటాయించారు. వీటితో పాటు జనరల్‌ స్థానాల్లోనూ మహిళలు పోటీ చేసే అవకాశాలు ఉండడంతో ఆ దిశగా పావులు కదుపుతున్నారు. జనరల్‌ స్థానాలతో పాటు ఆయా సామాజిక వర్గాల్లో మహిళలకు కేటాయించిన స్థానాల్లో ఏదో ఒక మండలం నుంచి పోటీ చేయించి జడ్పీ పీఠం దక్కించుకోవాలని ప్రధాన పార్టీలు ప్లాన్‌ వేస్తున్నాయి. పీఠంపై కన్నేసిన నేతలు ఒకరికి తెలియకుండా మరొకరు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

ఫపోటీకి సై అంటున్న ముఖ్య నేతల సతీమణులు

జగిత్యాల జిల్లా పరిషత్‌ ఏర్పాటైన తర్వాత జరిగిన ఎన్నికల్లో జడ్పీ పీఠాన్ని బీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో జడ్పీ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం జిల్లా నుంచి రాష్ట్ర ఎస్సీ. ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందినప్పటికీ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని ప్రకటించారు. జిల్లాలోని కథలాపూర్‌, మేడిపల్లి, భీమారం మండలాలకు ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, కొడిమ్యాల, మల్యాల మండలాలకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రాతినిత్యం వహిస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌ రెడ్డి జిల్లా కాంగ్రెస్‌ రాజకీయాల్లో తనదైన పట్టును కలిగియుండడం కాంగ్రెస్‌కు కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో జడ్పీ పీఠం తమకే దక్కుతుందని కాంగ్రెస్‌ నేతలు ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా చైర్మన్‌ పదవిని సొంతం చేసుకోవాలని చూస్తోంది. బీజేపీ సైతం రేసులో తాము ఉన్నామన్న సంకేతాలను పంపుతోంది. జిల్లాలో 20 జడ్పీటీసీ, ఎంపీపీ, 216 ఎంపీటీసీ, 385 పంచాయతీలు, 3,536 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జడ్పీ పీఠం జనరల్‌ మహిళకు కేటాయించడంతో బరిలో నిలిచేందుకు ముఖ్య నేతల సతీమణులు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఫకాంగ్రెస్‌లో ఆశావహులు అధికం..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండడంతో ఆ పార్టీలో పోటీ అధికమైంది. ప్రతి నియోజకవర్గం నుంచి పలువురు నేతలు పోరుకు సిద్ధమవుతున్నారు. జగిత్యాల నియోజకవర్గంలోని ఏదైనా ఒక మండలం నుంచి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి కుటుంబసభ్యుల్లో ఒకరు, కోరుట్ల నియోజకవర్గంలోని ఏదైనా ఒక మండలం నుంచి మాజీ మంత్రి, దివంగత జువ్వాడి రత్నాకర్‌రావు కుటుంబం నుంచి ఎవరైనా పోటీ పడే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికార కాంగ్రెస్‌ పార్టీలో దాదాపుగా అన్ని మండలాల్లో అధిక సంఖ్యలో నేతలు పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి మండలం నుంచి ముగ్గురు నుంచి నలుగురు పేర్లతో ఆశావహుల జాబితాను నేతలు అధిష్ఠానానికి అందించినట్లు చర్చలు జరుగుతున్నాయి.

ఫపట్టు నిలుపుకోవాలని బీఆర్‌ఎస్‌ ఆరాటం..

జిల్లా ఏర్పాటైన తర్వాత జడ్పీ పీఠాన్ని కేవసం చేసుకున్న బీఆర్‌ఎస్‌ మరోమారు పట్టు నిలుపుకోవాలనే ఆలోచనతో ఉంది. గత ఎన్నికల్లో మెజార్టీ జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకొని పీఠాన్ని దక్కించుకుంది. ఈసారి కూడా అదే పంథా కొనసాగించాలని చూస్తోంది. ఈ విషయమై జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, సుంకె రవి శంకర్‌, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ తదితరులు ప్రత్యేకంగా సమావేశమై పార్టీ నేతలతో సమాలోచనలు జరిపినట్లు సమాచారం.

ఫసత్తా చాటేందుకు బీజేపీ యత్నం..

జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో మెజార్టీ జడ్పీటీసీ స్థానాలను దక్కించుకొని జడ్పీపై జెండా ఎగురవేయడానికి కమలనాథులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ నేతృత్వంలో బీజేపీ నాయకులు స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని అన్ని స్థానాల నుంచి అభ్యర్థులను బరిలో నిలిపి సత్తా చాటాలని వ్యూహరచన చేస్తున్నారు. జడ్పీ పీఠంపై కన్నేసిన నేతలు ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు, ఆయా నియోజకవర్గాల నుంచి ప్రాతినిత్యం వహిస్తున్న నేతల అండదండలను పొందడానికి, స్థానిక నాయకుల మద్దతు కూడగట్టుకోవడానికి యత్నిస్తున్నారు. సమీకరణలు ఎలా ఉన్నా జిల్లా పరిషత్‌ అభ్యర్థులను నిర్ణయించడంలో ఆయా పార్టీల అధినాయకత్వం పాత్ర కీలకం కానుంది.

ఫజనరల్‌ స్థానాల్లోనూ పోటీకి అతివల ఆసక్తి..

జడ్పీ చైర్మన్‌ పదవిని జనరల్‌ మహిళకు కేటాయించడంతో అతివల్లో పోటీ అధికమైంది. జిల్లాలో మహిళలకు రిజర్వ్‌ చేసిన స్థానాలతో పాటు జనరల్‌కు కేటాయించిన స్థానాల్లోనూ మహిళా అభ్యర్థులు బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 20 జడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇందులో 10 స్థానాలను ఆయా కేటగిరీలకు చెందిన మహిళలకు కేటాయించారు. ఎస్సీ మహిళకు ఎండపల్లి, మల్యాల, బీసీ మహిళకు పెగడపల్లి, జగిత్యాల, భీమారం, మేడిపల్లి, రాయికల్‌, జనరల్‌ మహిళకు బుగ్గారం, మల్లాపూర్‌, కథలాపూర్‌ రిజర్వ్‌ చేశారు. వీటితో పాటు ఆయా సామాజిక వర్గాల్లో జనరల్‌కు కేటాయించిన స్థానాల్లోనూ మహిళలు పోటీ చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎస్టీ జనరల్‌కు కేటాయించిన బీర్‌పూర్‌, ఎస్సీ జనరల్‌కు కేటాయించిన కొడిమ్యాల, గొల్లపల్లి, బీసీ జనరల్‌కు కేటాయించిన కోరుట్ల, వెల్గటూరు, సారంగపూర్‌, మెట్‌పల్లి, జనరల్‌కు కేటాయించిన ఇబ్రహీంపట్నం, ధర్మపురి, జగిత్యాల రూరల్‌ మండలాల్లో సైతం మహిళలు పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా జిల్లాలో ఏ మండలం నుంచి అయిన సరే మహిళలు పోటీ చేసే అవకాశాలున్నాయి. జడ్పీ పీఠం జనరల్‌ మహిళకు కేటాయించడంతో ఏ సామాజిక వర్గం నుంచి గెలిచిన మహిళా అభ్యర్థి అయినా పదవిని దక్కించుకునే అవకాశాలు ఉండడంతో అతివల్లో పోటీ అధికమైంది.

Updated Date - Oct 06 , 2025 | 12:28 AM