jagityaala : వైద్యం గాడిన పడేనా?
ABN , Publish Date - May 11 , 2025 | 12:22 AM
జగిత్యాల, మే 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యం ఇష్టారీతిగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల లేమి, పోస్టుల కొరత, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల పేరిట దోపిడీ జరుగుతోంది.
- జగిత్యాలలో నిధుల లేమితో పూర్తికాని మెడికల్ కళాశాల భవనం
- ఖాళీగా కళాశాల ప్రిన్సిపాల్, జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ పోస్టులు
- పూర్తి కాని సబ్‌సెంటర్ల భవన నిర్మాణాలు
- రోగులకు సేవలు అంతంత మాత్రమే
- నేడు జగిత్యాలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాక
జగిత్యాల, మే 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యం ఇష్టారీతిగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల లేమి, పోస్టుల కొరత, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల పేరిట దోపిడీ జరుగుతోంది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పలు సమస్యలు తిష్ఠ వేశాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కాన్పుకు వెళ్లితే కోతలు తప్పడం లేదు. వెరసి రోగులకు సరియైున వైద్యం అందక ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అవస్థల పాలవుతున్నారు. ఈనెల 11వ తేదీన జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన జరగనున్న నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.
ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు మోజు..
ప్రభుత్వ వైద్యులకు ప్రయివేటు ప్రాక్టిస్ వ్యసనంగా మారుతోంది. జగిత్యాల జిల్లాలో కొందరు ప్రభుత్వ వైద్యులు తమ సొంత ఆసుపత్రుల్లో బిజీగా ఉంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వేళలో కూడా తమ సొంత ప్రైవేటు క్లినిక్స్‌లలో కాలం వెల్లదీస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబందంగా ఉన్న ప్రధాన ఆసుపత్రి, మాతా శిశు కేంద్రంతో పాటు జిల్లాలోని కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ పట్టణాల్లో గల తెలంగాణ వైద్య విదాన పరిషత్ ఆసుపత్రులు, పలు పీహెచ్‌సీ, యూహెచ్‌సీ, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాల్లో పనిచేస్తున్న వైద్యుల్లో చాలా మంది ప్రైవేటు ప్రాక్టిస్ పైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆగని లింగ నిర్ధారణ..
కాసులకు కక్కుర్తి పడి జిల్లాలోని కొందరు వైద్యులు యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గర్భంలో ఉన్నది ఆడ, మగ అని నిర్ధారిస్తూ...ఆడ శిశువు అయితే పురిట్లోనే కడతేరుస్తున్నారు. ఇటీవల జిల్లాలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఇటీవల వైద్య శాఖ ఆధ్వర్యంలో మెటర్నరీ హెల్త్ అండ్ న్యూట్రిషియన్ బృందం తనిఖీ చేసి అనుమతి లేకుండా ఉన్న అయిదు స్కానింగ్ మిషన్లను సీజ్ చేశారు. సదరు ఆసుపత్రిలో పేషంట్స్ వివరాలు, కేస్ షీట్ అందుబాటులో ఉంచకపోవడం, ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వంటి వాటిని గుర్తించి షోకాజ్ నోటీసు జారీ చేశారు. లింగ నిర్ధారణ ఫలితంగా జిల్లాలో బాలుర నిష్పత్తితో పోలిస్తే బాలికల నిష్పత్తి తక్కువగా నమోదవుతోంది. ఎప్పటికప్పుడు ఆయా సెంటర్లను తనిఖీలు నిర్వహించాల్సిన సంబంధిత అధికారులు అడిగినంత ఇస్తే చాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాన్పుకు వెళ్తే తప్పని కోతలు..
మహిళలకు సాధారణ కాన్పు పెంచడంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. ఉన్నతాధికారులు పలు పర్యాయాలు ఆదేశించినప్పటికీ కాసుల కోసం ఆశపడి ప్రైవేటు ఆసుపత్రుల్లో విచ్చలవిడిగా సిజేరియన్ డెలివరీలు చేస్తున్నారు. దీంతో ఓవైపు ఆసుపత్రి ఖర్చులను భరించడంతో పాటు సిజేరియన్ కాన్పు తదుపరి వచ్చే సమస్యలను మహిళలు ఎదర్కొవలసి వస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 3,660 ప్రసవాలు జరగగా ఇందులో 1,761 సాధారణ ప్రసవాలు, 1,899 శస్త్ర చికిత్స ప్రసవాలు జరిగాయి. 2025 ఏప్రిల్ నెలలో జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో 431 డెలివరీలు జరగగా ఇందులో 122 నార్మల్ డెలివరీలు(28.31 శాతం), 309 సిజేరియన్ డెలివరీలు(71.69 శాతం) జరిగాయి. ప్రైవేటు ఆసుపత్రిలో 157 డెలివరీలు జరగగా ఇందులో 12.1 శాతం 19 నార్మల్ డెలివరీలు, 87.9 శాతం 138 సిజేరియన్ డెలివరీలు జరిగాయి.
- పూర్తికాని మెడికల్ కళాశాల భవనం..
జిల్లా కేంద్రంలోని ధరూర్‌క్యాంపులో గల 27.08 ఎకరాల స్థలంలో రూ. 350 కోట్లతో మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. మూడేళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. జీ ప్లస్ త్రి పద్ధతిలో కళాశాల భవనం, జీ ప్లస్ సెవన్ పద్ధతిలో హాస్టల్ బిల్డింగ్‌లు, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ క్వార్టర్స్, జీ ప్లస్ ఫోర్ పద్ధతిలో హాస్పిటల్ బిల్డింగ్ నిర్మించడానికి నిర్ణయించారు. ఇందులో ఇప్పటివరకు ఆసుపత్రి భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. నిధులలేమి వల్ల మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ పోస్టులు ఖాళీగా ఉంటూ ఇన్‌చార్జిలతో కాలం వెల్లదీస్తుండడం సమస్యగా మారింది.
- జనరల్ ఆసుపత్రిలో సమస్యల తిష్ఠ..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమస్యలు తిష్ఠవేశాయి. ఆసుపత్రి భవనం శిథిలంగా మారడంతో రోగులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రిలోని గదులు రోగుల సంఖ్యకు సరిపోకపోవడంతో వరండాలోనే వైద్యం తీసుకుంటున్నారు. ఆసుపత్రిలో 80 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 500 ఎల్‌పీఎం సామర్థ్యం గల ఆక్సిజన్‌ప్లాంట్ పనిచేయడం లేదు. జిల్లా ఆసుపత్రిలో 150 పడకలుండగా, 10 ఐసీయూ పడకలున్నాయి. ఆక్సిజన్ ప్లాంట్ పనిచేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఆసుపత్రిలో ఐదు పడకలతో ఏర్పాటు చేసిన డయాలిసిస్ విభాగం గది ఇరుకుగా మారింది. ఆసుపత్రికి 46 మంది డయాలిసిస్ రోగులకు రెగ్యులర్‌గా వస్తుంటారు. పడకల సామర్థ్యం పెంచడంతో పాటు ప్రత్యేక గది ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లాలో 151 సబ్ సెంటర్లున్నాయి. ఇందులో 25 సబ్‌సెంటర్లకు మాత్రమే ప్రభుత్వ పక్కా భవనాలున్నాయి. 126 సెంటర్లకు పక్కా భవనాలు లేవు. 119 సబ్‌సెంటర్లకు కొత్త భవనాలు నిర్మించడానికి నిధులు మంజూరు అయ్యాయి. స్థలాల గుర్తింపు జరిగినప్పటికీ ఇప్పటివరకు భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. రూ. 1.56 కోట్లతో అంబారిపేట, రూ. 1.43 కోట్లతో అల్లమయ్యగుట్ట, రూ. 1.43 కోట్ల సాయిరాంనగర్ యూపీహెచ్‌సీ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కొత్తగా ఏర్పడ్డ బీమారం, ఎండపల్లి, బుగ్గారం మండలాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాలు మంజూరు కావాల్సి ఉంది. మెట్‌పల్లిలో 30 పడకల సామర్థ్యం గల సీహెచ్‌సీ భవన నిర్మాణానికి రూ. 7.50 కోట్లు మంజూరు అయినప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లా కేంద్రంలో పర్యటించనుండడంతో వైద్య ఆరోగ్య శాఖలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తారన్న ఆశతో జగిత్యాల జిల్లా ప్రజలు ఉన్నారు.