Share News

jagityaala : ఓటర్లకు గాలం

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:42 AM

జగిత్యాల, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొదటి విడతలో 122 పంచాయతీలు, 1,172 వార్డులు ఉన్నాయి.

jagityaala :  ఓటర్లకు గాలం

- గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఆఫర్లు

- గంపగుత్త ఓట్లపై నజర్‌

- కుల సంఘాలకు తాయిలాల ఎర

- జిల్లాలో తొలి, మలి విడతల ప్రచార హోరు

జగిత్యాల, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మొదటి విడతలో 122 పంచాయతీలు, 1,172 వార్డులు ఉన్నాయి. ఇందులో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. పంచాయతీ సర్పంచ్‌ స్థానాలకు 461 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, వార్డు సభ్యుల స్థానాలకు 1,954 మంది పోటీ పడుతున్నారు. వీటికి ఈనెల 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 144 సర్పంచ్‌, 1,256 వార్డు స్థానాలున్నాయి. ఇందులో 10 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 134 సర్పంచ్‌ స్థానాలకు గానూ 521 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండో విడతలో 1,256 వార్డు స్థానాలకు గానూ జగిత్యాల రూరల్‌ మండలం గట్రాజుపల్లిలో ఒకటవ వార్డుకు స్థానిక పరిస్థితుల వల్ల నామినేషన్‌ దాఖలు కాలేదు. 330 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 925 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, 2,624 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బరిలో ఉండే అభ్యర్థు లెక్క తేలడంతో ఇక ప్రచారం ముమ్మరం చేయడమే కాకుండా గెలుపే లక్ష్యంగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా హామీలతతో పాటు ఆఫర్లు చేస్తున్నారు. గంపగుత్త ఓట్లను రాబట్టేందుకు కుల సంఘాలకు భారీగా తాయిలాలతో గాలం వేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్న ఓటర్లను పోలింగ్‌ రోజున రప్పించుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నారు.

ఫకోడి కూయక ముందే ప్రచారం ప్రారంభం

గ్రామాల్లో రైతులు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటుండడంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కోడి కూయక ముందే ఇళ్లకు వెళ్లి ప్రచారాలు ప్రారంభిస్తున్నారు. జిల్లాలోని పలు పంచా యతీల్లో సర్పంచ్‌, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉదయం వేళలోనే ప్రచారాన్ని ప్రారంభి స్తున్నారు. సూర్యోదయానికి ముందే అభ్యర్థులు తమ అనుచరగణంతో గ్రామంలోని పలువురి ఇళ్లకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో ఉదయం వేళల్లోనే గ్రామంలోని ప్రధాన వీధుల్లో పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.

ఫ వ్యూహాత్మక ప్రచారం

తొలి విడత ఎన్నికలు జరుగుతున్న కోరుట్ల సెగ్మెంట్‌లోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, కోరుట్ల, మెట్‌పల్లి, వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్‌, మేడిపల్లి, బీమారం మండలాల్లోని ఆయా గ్రామాల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ప్రారంభించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో మలి విడత పంచాయతీ ఎన్నికలల్లో నామినేషన్ల ఉపసంహరణ ముగిసి బరిలో ఉండే అభ్యర్థులు తేలిపోవడం, గుర్తుల కేటాయింపులు పూర్తికావడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. రైతులు, వ్యాపారులు, ఓటుహక్కును కలిగియున్న విద్యార్థులు, బీడీ కార్మికులు సూర్యోదయం అయిన తదుపరి కొద్ది గంటలకే తమ దైనందిన కార్యక్రమాల్లోకి వెళ్ళి పోతుండడంతో అభ్యర్థులు ఓటర్లను కలవడానికి ఉదయం, సాయంకాలం వేళలను ఎంచుకుంటున్నారు.

ఫవలస ఓటర్లపై గురి

పల్లెలకు చెందిన పలువురు వ్యక్తులు దగ్గరలో గల పట్టణాల్లో స్వయం ఉపాధి పొందుతుండడం, వ్యాపారాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిని కలిసి ఓటు అడగడానికి అభ్యర్థులు మధ్యాహ్నం సమయాల్లో పట్టణాల్లో సైతం ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం వరి కోతలు పూర్తి చేసుకున్న రైతులు నారు పోయడం, ముందస్తుగా నారు పోసుకున్న రైతులు నాట్లు వేయడం వంటి పనులు చేస్తున్నారు. దీంతో రైతులను, వ్యవసాయ కార్మికులను కోడి కూత సమయాని కంటే ముందు నిద్రలేపి మరీ ఓట్లు వేయాలని నాయకులు అభ్యర్థిస్తుండడం విశేషం. ఉదయం పూట ఓటర్ల వద్ద నుంచి హామీ తీసుకుంటే తప్పకుండా ఓటు వేస్తారని అభ్యర్థులు విశ్వసిస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి రైతులు, వ్యవసాయ కూలీలను కలిసి ఓట్లను అభ్యర్థిస్తుండడం జరుగుతోంది. అభ్యర్థులు ప్రచారాల్లో వ్యవహరిస్తున్న వ్యూహాలు ఎన్నికల్లో ఏమేరకు ఫలితాలను అందిస్తాయో మరి.

Updated Date - Dec 08 , 2025 | 12:42 AM