jagityaala : పల్లె పోరు షురూ..!
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:40 AM
జగిత్యాల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. సర్పంచ్, వార్డుసభ్యులుగా పోటీ చేసే నాయకులు బిజీగా మారారు.
-తొలి రోజు సర్పంచ్ స్థానాలకు 48 నామినేషన్లు..
- గెలుపు కోసం ప్రధాన పార్టీల వ్యూహాలు
- ఓటర్ల మద్దతు కోసం ఆశావహుల ఆరాటం
- మొదటి విడతలో 122 పంచాయతీలు, 1,172 వార్డులకు ఎన్నికలు
జగిత్యాల, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. సర్పంచ్, వార్డుసభ్యులుగా పోటీ చేసే నాయకులు బిజీగా మారారు. గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. జిల్లాలో తొలి విడతలో 122 పంచాయతీలు, 1,172 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రెండు, మూడో ద శ ఎన్నికలతో పోలిస్తే తొలి విడతలో పోటీ చేసే నాయకులకు గడువు తక్కువగా ఉంది. దీంతో ఆయా చోట్ల పోటీ చేసేవారంతా సర్పంచ్‌లుగా గెలిచి తమ పార్టీ బలం చూపేందుకు సిద్ధమయ్యారు. జనరల్, మహిళా స్థానాల్లో అధిక పోటీ నెలకొంది. మండల కేంద్రాలు, మేజర్ గ్రామపంచాయతీలు, రాజకీయ చైతన్యం అధికంగా ఉన్న గ్రామాల్లో పోటీ పెరుగుతోంది.
ఫపల్లెల్లో పట్టు కోసం ముమ్మర యత్నాలు
అధికార కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, ఇతర రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులు గెలిచేలా నాయకులు నేరుగా రంగంలోకి దిగారు. పోటీ జరిగే స్థానాలు అధిక జనాభా, ఓటర్లు ఉన్న స్థానాలు, తమకు పూర్వం నుంచి బలం ఉన్న గ్రామాల్లో ఆశావహుల పేర్లతో జాబితా సిద్ధం చేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల కోసం మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల మండలాల పరిధిలో నాయకులు, కేడర్‌ను సన్నద్ధం చేసింది. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావులు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై దృష్టి సారించి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ నాయకుడు జువ్వాడి నర్సింగరావు, బీజేపీలో ఎంపీ అర్వింద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యాదగిరి బాబుతో పాటు ఆపార్టీ నాయకులు వ్యవహారాలను చూసుకుంటున్నారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్, మేడిపల్లి, బీమారం మండలాల్లో కాంగ్రెస్ వ్యవహారాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీజేపీ పార్టీ నియోజకవర్గం నాయకులు చెన్నమనేని వికాస్‌రావు, కరీంనగర్ మాజీ మేయర్ సునీల్‌రావు, బీఆర్‌ఎస్ నాయకులు చల్మెడ లక్ష్మీనృసింహరావు, మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డిలు వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఈ మేరకు గ్రామాల్లో పర్యటిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల తర్వాత పరిషత్, ఆపై మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్న తరుణంలో గ్రామ స్థాయి నుంచి స్థానిక సంస్థల్లో అధిక స్థానాలు గెలిచి జిల్లాలో పట్టు పెంచుకునేందుకు బలమైన అభ్యర్థులను పోటీలో దింపేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ప్రజాబలంతో పాటు ఆర్థికంగా ఖర్చును తట్టుకునే అభ్యర్థులను రంగం లోకి దింపి పోటీ చేయించి, వీలైనన్ని గ్రామాల్లో పార్టీ జెండా ఎగురవేయాలని సిద్ధమయ్యారు.
ఫబంధువులను బరిలో నిలిపేందుకు నాయకుల ఆరాటం
గ్రామాల్లో సర్పంచ్‌గా ఎన్నిక కావాలని ఆశపడుతున్న నాయకులంతా ఈసారి తమ అదృష్టాన్ని పరిరక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో స్థానానికి కనీసం ఐదు కంటే అధికంగానే నామినేషన్ల దాఖలయ్యే అవకాశాలున్నాయి. జనరల్ స్థానాలతో పాటు మహిళా ఎస్సీ, ఎస్టీ స్థానాల్లోనూ బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. తమకు కలిసి రాని చోట తమ సతీమణులు, కుటుంబ సభ్యులను పోటీలోకి నిలబెడుతున్నారు. పరిషత్ ఎన్నికల్లో రిజరేషన్లు కలిసి వస్తాయో..రావో మరోవైపు పార్టీ గుర్తు కావడంతో బీఫాం ఇస్తారో.. లేదో అనే ముందస్తు వ్యూహంతో మొదట సర్పంచ్ స్థానానికి పోటీ చేసి తమ బలాన్ని తెలుసుకునేందుకు ఆరాట పడుతున్నారు. ఇందుకోసం అన్ని వనరులు సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల ఖర్చు కోసం ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నారు.
ఫవార్డు సభ్యుల స్థానాలకు 33 నామినేషన్లు
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం తొలి రోజు సర్పంచ్ స్థానాలకు 48 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 33 నామినేషన్లు దాఖలు అయినట్లు జిల్లా పంచాయతీ అధికారి (ఎఫ్‌ఏసీ) రఘువరన్ ప్రకటించారు. సర్పంచ్ స్థానాలకు బీమారం మండలంలో 13 నామినేషన్లు, ఇబ్రహీంపట్నంలో 5, కథలాపూర్‌లో 13, కోరుట్లలో 6, మల్లాపూర్‌లో 6, మెట్‌పల్లిలో 8 నామినేషన్లు దాఖలు అయినట్లు ప్రకటించారు. వార్డు సభ్యుల స్థానాలకు బీమారం మండలంలో 11, ఇబ్రహీంపట్నం మండలంలో 2, కథలాపూర్ మండలంలో 9, కోరుట్ల మండలంలో 5, మల్లాపూర్ మండలంలో 1, మెట్‌పల్లి మండలంలో 5 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మేడిపల్లి మండలంలో తొలిరోజు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎలాంటి నామినేషన్ దాఖలు కాలేదని డీపీవో రఘువరన్ తెలిపారు.