jagityaala : వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా..
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:46 AM
జగిత్యాల, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వార్షిక పరీక్షల్లో వంద శాతం ఫలితాలే లక్ష్యంగా ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టడానికి కసరత్తులు చేస్తోంది.
- నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
- 90 రోజుల ప్రత్యేక కార్యాచరణ
- పాఠ్యాంశాల వారీగా ప్రణాళిక
- వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
- మానసిక ఒత్తిడికి గురికాకుండా కౌన్సెలింగ్
జగిత్యాల, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వార్షిక పరీక్షల్లో వంద శాతం ఫలితాలే లక్ష్యంగా ఇంటర్ బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టడానికి కసరత్తులు చేస్తోంది. అత్యంత కీలకమైన ఇంటర్‌లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల ఉత్తీర్ణత అంతంతే ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా అడుగేసింది. ఇందుకు 90 రోజుల ప్రణాళిక రూపొందించి అమలు చేయడానికి యోచిస్తోంది. గత యేడాది డిసెంబరు నుంచి 90 రోజుల ప్రణాళిక అమలు చేశారు. ఈసారి ముందస్తుగా నిర్వహించడాని కి ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం నుంచి జూనియర్ కళాశాలల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు.
- జిల్లాలో 42 కళాశాలలు..
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు కస్తూర్బా, ఇతర గురుకుల జూనియర్ కళాశాలలు 42 వరకు ఉన్నాయి. ఇందులో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 26 ప్రభుత్వ, కస్తూర్బా, మోడల్, మైనార్టీ, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, లోకల్ బాడీస్, ఇతర సంక్షేమ కళాశాలలున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో సుమారు 2,950 మంది, ద్వితీయ సంవత్సరంలో సుమారు 2,430 మంది విద్యార్థులున్నారు. జూనియర్ కళాశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ 279 మంది ఉన్నారు.
- గత యేడాది ఫలితాలు..
గత విద్యా సంవత్సరం ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 68.73 శాతం, ప్రథమ సంవత్సరంలో 56.34 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సరంలో బాలికలు 3,137 మంది పరీక్షలకు హాజరుకాగా 2,465 మంది 78.58 శాతం ఉత్తీర్ణత కాగా, బాలురు 2,233 మంది హాజరుకాగా 1,226 మంది 54.09 శాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 3,550 మంది పరీక్షలకు హాజరుకాగా 2,443 మంది 68.82 శాతం ఉత్తీర్ణత కాగా, బాలురు 2,554 మంది హాజరుకాగా 996 మంది 39 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్‌లో 65.88 శాతం ఉత్తీర్ణత లభించగా ఇందులో బాలురు 49.78 శాతం, బాలికలు 86.82 శాతం ఉత్తీర్ణులయ్యారు.
- విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి...
జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హజరు శాతం సగం కూడా దాటడం లేదు. దీని ప్రభావం ఉత్తీర్ణతపై చూపి ఫలితాల శాతం తగ్గుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన ఇంటర్ విద్యాశాఖ హాజరు పెంపుపై దృష్టి సారించింది. ఇంటర్‌లో ముఖగుర్తింపు హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటి నుంచి పరీక్షలు పూర్తయ్యే వరకు విద్యార్థులు తప్పనిసరిగా కళాశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. గైర్హాజరవుతున్న విద్యార్థులను వారి తల్లిదండ్రు లకు సమాచారం ఇవ్వడం, విద్యార్థి విధిగా తరగతులకు హాజరయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
- పాఠ్యాంశాల వారీగా..
వార్షిక పరీక్షలకు మూడు నెలల సమయం ఉండటంతో పాఠ్యాంశాల వారీగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. నిర్ణీత సమయాల్లో పరీక్షలు నిర్వహించి ప్రతీ విద్యార్థి స్థాయిని అంచనా వేస్తున్నారు. వెనుకబడిన వారిని, ముందున్న వారితో సమానం అయ్యేందుకు ప్రణాళిక రూపొందించు కొని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా పరీక్షల సమయం వరకు అందరూ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేలా ప్రతీ లెక్చరర్ దృష్టి సారించేలా ఇంటర్ బోర్డు ప్రయత్నాలు చేస్తోంది.
- మరిన్ని కార్యక్రమాలు....
డిసెంబరు నెలాఖరుకు సిలబస్ పూర్తి చేయడం, ప్రతీ కళాశాలను డీఐఈవోలు తనిఖీ చేస్తూ ప్రిన్సిపాల్స్, అధ్యాపకులకు పలు సూచనలు చేయనున్నారు. అకాడమిక్ గైడెన్స్, మానిటరింగ్ సెల్ ద్వారా కేర్ టేకింగ్ పద్ధతిలో ఒక్కో లెక్చరర్‌కు కొంత మంది విద్యార్థులను అనుసంధానం చేస్తారు. ఆ విద్యార్థులు అన్ని సబెక్ట్‌లో ఉత్తీర్ణత సాధించేలా చేసే బాధ్యత ఆ లెక్చరర్లపైనే ఉంటుంది.
- ఒత్తిడి అధిగమించేలా యోగా...
విద్యార్థులు మానసికంగా ఒత్తిడి గురికాకుండా ఉండడంతో పాటు మత్తుపదార్థాలతో కలిగే నష్టాలపై అవగహన కల్పనకు ప్రతీ కళాశాలలో ఒక లెక్చరర్ కౌన్సిలర్‌గా నియమించారు. విద్యార్థులు అధికంగా ఉంటే మరొకరిని నియమించుకోవచ్చు. ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను పర్యవేక్షిస్తూ దాని నుంచి బయటపడేలా చూస్తున్నారు.