Share News

jagityaala : తొలి విడత పోలింగ్‌ ప్రశాంతం

ABN , Publish Date - Dec 12 , 2025 | 02:27 AM

జగిత్యాల, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది.

jagityaala :  తొలి విడత పోలింగ్‌ ప్రశాంతం

ఫ ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు

ఫ అధిక స్థానాల్లో ‘హస్తం’ మద్దతు దారుల గెలుపు

ఫ 122 స్థానాల్లో 60 కాంగ్రెస్‌, 32 బీఆర్‌ఎస్‌, 15 బీజేపీ, 15 ఇతరులు

ఫ గ్రామాల్లో విజేతల సంబరాలు

జగిత్యాల, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది. గురువారం జరిగిన ఎన్నికల్లో ఏడు మండలాల్లో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. మొత్తం 122 సర్పంచ్‌ స్థానాలకు 4 సర్పంచ్‌ పదవులకు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 118 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 1,172 వార్డు స్థానాలకు గానూ రెండు స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 349 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 821 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో రాత్రి 10 గంటల వరకు వెల్లడయిన 119 సర్పంచ్‌ స్థానాల్లో 59 కాంగ్రెస్‌ మద్దతు దారులు, 30 బీఆర్‌ఎస్‌ మద్దతు దారులు, 15 మంది బీజేపీ మద్దతుదారులు, 15 మంది ఇతరులు విజయం సాధించారు. పల్లెల్లో విజేతలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ్‌ రావు పంచాయతీ ఎన్నికల వ్యవహారాలను నిర్వర్తించారు. కోరుట్ల నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్‌ స్థానాలు కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకోవడంతో జువ్వాడి నర్సింగ్‌ రావు వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. గత రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌కు చెందిన డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ విజయం సాధించారు. అయితే ప్రస్తుతం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ ఆధిక్యత సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అదేవిదంగా వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్‌, మేడిపల్లి, బీమారం మండలాల్లో సైతం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిక్యతను చాటింది. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యవహారాలను పర్యవేక్షించారు. వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఆధిక్యత సాదించగా, తదుపరి స్థానాల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీలు నిలిచాయి. జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ సత్తాచాటినట్లయింది.

జిల్లాలో తొలి విడతలో 77.68 శాతం పోలింగ్‌ నమోదు

జగిత్యాల, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండలాల్లో గురువారం జరిగిన తొలి విడత పోలింగ్‌లో 77.68 శాతం ఓటింగ్‌ నమోదు అయింది. కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, కోరుట్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్‌, మేడిపల్లి, బీమారం మండలాల్లో జిల్లాలో తొలి విడతలో 122 సర్పంచ్‌, 1,172 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే తొలి విడతలో 4 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా 118 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఇందుకు గానూ 461 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీ పడ్డారు. అదేవిదంగా 1,172 వార్డు స్థానాలకు గానూ రెండు స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 349 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 821 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగగా 1,952 మంది పోటీ పడ్డారు.

అత్యధికంగా మల్లాపూర్‌

జిల్లాలోని ఏడు మండలాల్లో మొత్తంగా 77.68 శాతం పోలింగ్‌ నమోదు అయింది. అత్యధికంగా మల్లాపూర్‌లో 80.07 శాతం, అత్యల్పంగా మెట్‌పల్లిలో 77.3 శాతం పోలింగ్‌ జరిగింది. ఇందులో బీమారంలో 76.67 శాతం, ఇబ్రహీంపట్నంలో 78.13 శాతం, కథలాపూర్‌లో 74.75 శాతం, కోరుట్లలో 78.79 శాతం, మల్లాపూర్‌లో 80.07 శాతం, మేడిపల్లిలో 77.43 శాతం, మెట్‌పల్లిలో 77.3 శాతం పోలింగ్‌ నమోదైంది. ఏడు మండలాల్లో కలిపి 2,18,194 మంది ఓటర్లుండగా ఇందులో 1,02,238 పురుషులు, 1,15,955 మంది మహిళలు, ఇతరులు ఒక్కరు ఉన్నారు. ఇందులో మొత్తం 1,69,486 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 74,640 పురుషులు, 94,846 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో 5వ వార్డు అభ్యర్థి విజయలక్ష్మీ రోడ్డు ప్రమాదానికి గురయి చేతి విరిగింది. కోరుట్ల మండలం వెంకటాపూర్‌ గ్రామంలో మద్యం మత్తులో వెంకట్‌ అను ఓటరు బాక్స్‌లో వేయాల్సిన బ్యాలెట్‌ పేపర్‌ను నమిలి మింగాడు. వార్డు మెంబర్‌కు చెందిన బ్యాలెట్‌ నమిలి మింగగా, సర్పంచ్‌ అభ్యర్థి బ్యాలెట్‌ పేపర్‌ను నమిలి ఉంచి వేసిన సంఘటన చోటుచేసుకుంది. దీంతో వెంకట్‌ను పోలింగ్‌ అధికారులు పోలీసులకు అప్పగించారు.

పోలింగ్‌లో పోటెత్తిన మహిళలు..

తొలి విడత పోలింగ్‌లో మహిళలు అత్యధిక సంఖ్యలో ఓటు వేశారు. తొలి విడతలో 1,69,486 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఇందులో పురుషులు 74,640, మహిళలు 94,846 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 20,206 మంది అధికంగా ఓటు వేశారు. కాగా జిల్లాలో తొలి విడతలో ఉదయం 9 గంటలకు 16.67 శాతం, 11 గంటలకు 48.09 శాతం, మధ్యాహ్నాం 1 గంటకు 77.68 శాతం పోలింగ్‌ నమోదైంది.

ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ పూర్తి

-కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌

జగిత్యాల, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రశాంత వాతావరణంలో మెదటి విడత పోలింగ్‌ నిర్వహణ పూర్తి అయిందని జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్న కేంద్రాన్ని కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ సందర్శించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. అంతకు ముందు మేడిపల్లి మండల కేంద్రంలోని కొండాపూర్‌ గ్రామం, భీమారం మండల కేంద్రంలోని కమ్మరిపేట, కోరుట్ల మండలంలోని సంగెం, నాగులపేట్‌, ఐలాపూర్‌ గ్రామాలు, మెట్‌పెల్లి మండలంలోని వెల్లుల్ల, జగ్గసాగర్‌ గ్రామాలు, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమ సంఖ్య సరిచూసుకొని ఓటింగ్‌ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్‌ అధికారులకు సూచించారు. పోలింగ్‌ నిర్వహణను, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్‌ స్టేషన్‌ ఆవరణలో పోటీలో ఉన్న సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల సంఖ్య పోలింగ్‌ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్‌ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఒకటి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్‌ కేంద్రం లోపలికి అనుమతించకూడదని ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో అడిషనల్‌ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ బి. రాజ గౌడ్‌, జడ్పీ సిఈవో గౌతమ్‌ రెడ్డి, డిపివో రఘువరన్‌, జిల్లా నోడల్‌ అధికారులు, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు జీవాకర్‌ రెడ్డి, శ్రీనివాస్‌, ఎమ్మార్వోలు, ఎంపిడివోలు తదితరులున్నారు.

Updated Date - Dec 12 , 2025 | 02:27 AM