jagityaala : తప్పని ఎదురుచూపులు
ABN , Publish Date - Oct 27 , 2025 | 12:54 AM
జగిత్యాల, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు (పెన్షనర్లు) తీవ్ర ఆవేదనలో ఉన్నారు. పెన్షనరీ బెనిఫిట్స్ అందక, వైద్యానికి డబ్బుల్లేక ఆర్థిక అవస్థల్లో పలువురు కొట్టుమిట్టాడుతున్నారు.
-రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక పెన్షనర్ల ఇక్కట్లు
-జిల్లాలో 18 నెలల్లో రిటైరైన వారు 672 మంది
-ఒక్కొక్కరికి రావాల్సినవి రూ.30 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు
జగిత్యాల, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు (పెన్షనర్లు) తీవ్ర ఆవేదనలో ఉన్నారు. పెన్షనరీ బెనిఫిట్స్ అందక, వైద్యానికి డబ్బుల్లేక ఆర్థిక అవస్థల్లో పలువురు కొట్టుమిట్టాడుతున్నారు. ఇంట్లో ఎదిగిన బిడ్డ పెళ్లి చేయలేక కొందరు, ఇంటి ఖర్చులకు డబ్బులు లేక మరికొందరు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ విరమణ పొందాక జీవిత కాలం దాచుకున్న డబ్బు వస్తుందనుకొని తెలిసిన వాళ్ల నుంచి, బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న వారు దానికి వడ్డీ, ఈఎంఐలు కట్టలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవలందించి, రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ కోసం కార్యాలయాల చుట్టు తిరిగితే పని కావడం లేదు. పదవీ విరమణ పొంది ఏడాదిన్నర అవుతున్నా బెనిఫిట్స్ అందక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో తనకు రావాల్సిన బెనిఫిట్స్ అందకపోవడంతో మనోవేదనతో ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆయన ఎక్కడున్నాడో ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొందరికి కనీసం వైద్యానికి డబ్బులు అందక అనారోగ్యం పాలవుతున్నారు.
ఫకోట్ల రూపాయల బకాయిలు
సాధారణంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు పనిచేసిన కాలంలో జమ చేసుకున్న జీపీఎఫ్‌తో పాటు, ఇతర ప్రయోజనాలు అన్నింటినీ కలిపి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ప్రభుత్వం ఉద్యోగ విరమణ చేసిన నెల లోగానే అందజేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఏడాదిన్నర గడుస్తున్నా పెన్షనర్లకు ఆ సొమ్ము ఇవ్వడం లేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2021 సంవత్సరంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచింది. ఆర్థిక భారంతో రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకనే అప్పట్లో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచిందన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్ గతంలో పెంచిన ఉద్యోగ విరమణ వయస్సు వల్ల నిలిచిపోయిన రిటైర్మెంట్లు 2024 మార్చి 31వ తేదీతో ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో అప్పటి నుంచి సుమారు 8,672 మంది రిటైరయ్యారు. జగిత్యాల జిల్లాలో 672 మంది పదవీ విరమణ పొంది ఏడాదిన్నర అవుతున్నా బెనిఫిట్స్ మాత్రం అందడంలేదు. వీరందరికీ గ్రాట్యూటీ, జీపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, టీజీఎల్‌ఐ, కమ్యూటేషన్, జీఐఎస్ లాంటి బెనిఫిట్స్ కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.10 వేల కోట్ల నుంచి రూ.13 వేల కోట్లు వరకు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.
ఫ17న హైదరాబాద్‌లో ధర్నా
ఉద్యోగుల క్యాడర్ (స్థాయి)ను బట్టి ఒక్కో ఉద్యోగికి కనీసం రూ.30 లక్షలు నుంచి అత్యధికంగా రూ.80 లక్షలు రావాల్సి ఉంది. ఇందులో జీపీఎఫ్ కింద ఒక్కో ఉద్యోగికి దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు, గ్రాట్యూటీ కింద సుమారు రూ.16 లక్షల వరకు, లీవ్ ఇన్‌క్యాష్‌మెంట్ కింద రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు, కమ్యూటేషన్ కింద రూ.7 లక్షల నుంచి రూ.15 లక్షలు, టీజీఎల్‌ఐ కింద సుమారు రూ.5 లక్షల వరకు, జీఐఎస్ కింద సుమారు రూ. 20 వేల వరకు బెనిఫిట్స్ రావాల్సి ఉంది. ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వంతో గతంలో జరిపిన చర్చల నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ చొరవతో మెడికల్ రీయింబర్స్‌మెంట్, జీపీఎఫ్ డబ్బులు గత నెలలో కొంత మొత్తంలో మంజూరు చేయించారని సంబంధిత వర్గాలు అంటున్నాయి. కాగా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ బిల్లులు అందక కొంత మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు న్యాయ పోరాటం చేస్తున్నారు. దీనిపై నాలుగు, ఆరు వారాలు గడువులోగా ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సందర్భాలున్నాయి. ఈ కుబేర్ సాఫ్ట్‌వేర్‌లో పెండింగ్‌లో ఉన్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు మంజూరు కావడం లేదని అంటున్నారు. దీంతో నగదు రహిత వైద్య సేవలు అందించడం లేదు. దీంతో పెన్షనర్లు జేఏసీ ఆధ్వర్యంలో నవంబరు 17న హైదరాబాద్‌లో ధర్నాకు సిద్ధమవుతున్నారు.
కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తాం
-హరి అశోక్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్
పెన్షనరీ బెనిఫిట్స్ కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. బెనిఫిట్స్ బిల్లులు సుమారు రూ.13 వేల కోట్లు రావాల్సి ఉంది. నవంబరు 10లోగా జీపీఎఫ్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, జీఎల్‌ఐ బిల్లులు చెల్లించాలి. ప్రభుత్వం ఇంకా స్పందించని పక్షంలో నవంబరు 17న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులతో ధర్నా చేపడుతాం.
ప్రభుత్వం నిధులు లేవంటోంది
-హన్మంత్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, టీ పెన్షనర్స్ అసోసియేషన్
నెలకు రూ.700 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ఉద్యోగ జేఏసీతో ఇచ్చిన హామీ అమలు కావడం లేదు. తమ దగ్గర డబ్బులు లేవని ప్రభుత్వం చెబుతోంది. పదవీ విరమణ పొందిన పెన్షనర్లు తీవ్ర మనోవేదనలో ఉన్నారు. అవసరాలకు డబ్బులు అందక పిల్లల పెళ్లిలు చేయలేకపోతున్నారు. విడతల వారీగానైనా ప్రభుత్వం పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయాలి.