jagityaala : స్థానిక పోరుపై ఉత్కంఠ
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:51 AM
జగిత్యాల, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
- నేటి రాష్ట్ర కేబినెట్ నిర్ణయమే కీలకం
- పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు సర్కారు మొగ్గు..?
- జిల్లాలో 20 జడ్పీటీసీ, 385 సర్పంచ్ స్థానాలు
జగిత్యాల, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ విజయం సాధించడంతో అదే ఉత్సాహంతో స్థానిక ఎన్నికల వైపు వెళ్లడానికి ఆ పార్టీ అధిష్ఠానం పచ్చజెండా ఊపినట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకు నెలకొన్న సందిగ్ధతకు ఇకనైనా తెరపడుతుందా..? లేక అలాగే కొనసాగుతుందా...? అనేది కేబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయంతో తేలనుంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణకు సిద్ధపడగా అందుకు న్యాయపరమైన చిక్కులు తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రక్రియకు ముందడుగు పడలేదు. కోర్టు నిర్ణయానికి అనుగుణంగానే ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర మంత్రివర్గం తీసుకునే నిర్ణయంపై ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఫనిలిచిన నిధుల విడుదల..
జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, పంచాయతీలు, మున్సిపాలిటీలకు పాలక వర్గాలు లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధుల విడుదల నిలిచిపోయింది. దీంతో ఎన్నికలు త్వరగా నిర్వహించాలనే అభిప్రాయం అంతటా వినిపిస్తోంది. గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసి దాదాపుగా ఏడాదిన్నర అయింది. మండల పరిషత్, జిల్లా పరిషత్ వర్గాలు, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగిసి సుమారు ఏడాది దాటింది. ప్రస్తుతం వీటన్నింటిలో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల విడుదల పూర్తిగా నిలిచిపోయింది. దీంతో స్థానిక వనరులపై ఆధారపడాల్సి వస్తోంది. సరిపడా నిధులు లేక అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. కొన్ని పంచాయతీల్లో ట్రాక్టర్ డీజీల్, వాహనాల కిస్తీలు, విద్యుత్ బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. పారిశుధ్యం, తాగునీటి పనులకు పంచాయతీ సెక్రెటరీలు అప్పులు చేయాల్సి వస్తోంది. దీంతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ప్రజల్లో బలంగా ఉంది.
ఫకాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్ల యోచన
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాలు కాంగ్రెస్‌లో ఉత్సాహాన్ని నింపాయి. ఈ నేపథ్యంలో ఈనెల 17వ తేదీన కేబినెట్ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇందులో బీసీ రిజర్వేషన్ల అమలు, ఎన్నికల నిర్వహణకు తీసుకునే నిర్ణయాలను నివేదిక రూపంలో హైకోర్టుకు అందించే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు వెళ్తారా..? లేదా 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత లభించాకే ఎన్నికలు నిర్వహించేలా నిర్ణయం తీసుకుంటారా..? అనే సందిగ్ధతకు తెరపడే అవకాశం ఉంది. కాగా ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన పూర్తి కసరత్తు చేసింది. ఈసారి ప్రభుత్వం ఎన్నికలపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. డిసెంబరు రెండో వారంలో లేదంటే జనవరి మొదటి వారంలో పరిషత్ లేదా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నగారా మోగనున్నట్లు తెలుస్తోంది. 50 శాతం రిజర్వేషన్లు దాటకుండానే కోర్టు నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నట్లు వివిధ రాజకీయ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.
------------------------------------------------------------------
జిల్లాలో స్థానిక సంస్థల వివరాలు...
------------------------------------------------------------------
జడ్పీటీసీ స్థానాలు...20
ఎంపీటీసీ స్థానాలు...216
ఎంపీపీ స్థానాలు..20
సర్పంచ్ స్థానాలు..385
వార్డులు సభ్యులు..3,586
పంచాయతీ ముసాయిదా ఓటర్లు...6,07,222
పురుషులు.. 2,89,249
మహిళలు...3,17,964
ఇతరులు..9