jagitiala : వామ్మో జూన్
ABN , Publish Date - Jun 09 , 2025 | 01:00 AM
జగిత్యాల, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): జూన్ నెల వచ్చిందంటేనే పేద, మధ్య తరగతి కుటుంబాలకు గుబులు మొదలవుతుంది. ఓ వైపు పాఠశాలలు ప్రారంభం కానుండడం, మరోవైపు సాగు పనులు, ఇంకొక వైపు వైరల్ జ్వరాల ముప్పు పొంచి ఉండడం వెరసి సగటు జీవిపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.
-పేద, మధ్య తరగతి కుటుంబాల్లో గుబులు
-12 నుంచి ప్రారంభం కానున్న పాఠశాలలు
-పొలం బాట పట్టనున్న రైతులు
-రెండు వైపులా ఖర్చులు
జగిత్యాల, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): జూన్ నెల వచ్చిందంటేనే పేద, మధ్య తరగతి కుటుంబాలకు గుబులు మొదలవుతుంది. ఓ వైపు పాఠశాలలు ప్రారంభం కానుండడం, మరోవైపు సాగు పనులు, ఇంకొక వైపు వైరల్ జ్వరాల ముప్పు పొంచి ఉండడం వెరసి సగటు జీవిపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. మరో నాలుగు రోజుల్లో బడి గంట మోగనుంది. ఇన్నాళ్లు ఆట పాటల్లో మునిగిన విద్యార్థులు బడి బాట పట్టనున్నారు. ఈనెల 12న పాఠశాలలు తెరుచుకోనుండటంతో తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలైంది. పిల్లలను బడుల్లో చేర్పించడం, ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, ట్రంకు పెట్టెలు, బ్యాగులు, టై, బెల్టు, షూస్, ఇతర స్టేషనరీ, రవాణా చార్జీల వంటివి ఉంటాయి, వీటికే వేలాది రూపాయాలు వెచ్చించాలి. మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పెరిగిన ఫీజులను చూసి తల్లిదండ్రులు జడుసుకుంటున్నారు. కొన్ని స్కూళ్లలో ఎల్‌కేజీ విద్యార్థులకే రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో 60 శాతం ఫీజు మొదలే చెల్లించాల్సి ఉంటుంది.
ఫరైతులకు పెట్టుబడి భారం..
జూన్ నెల వచ్చిందంటే రైతుల పైనా భారం ఉంటుంది. ఈ సమయంలోనే వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి. ఇప్పటికే తొలకరి వర్షాలు కురవడంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు దున్నడం, కూలీలు ఇతర వాటికి ఖర్చులు ఉంటాయి. మొత్తంగా సీజన్ ప్రారంభంలో ఎకరాకు కనీసం రూ.10 వేలైనా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో పలువురు రైతులు పెట్టుబడి కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు విత్తనాలు, ఎరువుల ధరలు ఈ యేడాది అమాంతంగా పెరగడం రైతులకు మరింత భారంగా మారనుంది.
ఫపొంచి ఉన్న వ్యాధుల ముప్పు..
వర్షాకాలం వచ్చిందంటే చాలు వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. పరిశుభ్రత లోపించడం, మురుగు నీరు ఇళ్లలోకి రావడం, మురికి కాలువలు శుభ్రంగా లేకపోవడం, చెత్తాచెదారం పేరుకపోవడం తదితర కారణాలతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందుతాయి. దీంతో విష జ్వరాలు రావడం వ్యాప్తి చెందడం వంటివి చోటుచేసుకుంటాయి. వాతావరణ పరిస్థితులు మారుతుండడం వల్ల చిన్న పిల్లలు, పెద్దల్లో సైతం వాంతులు, విరేచనాలు, జ్వరాల వంటివి రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీని వల్ల ఆసుపత్రులు, ల్యాబ్‌ల ఖర్చులతో పాటు మందులకు అధికంగా వ్యయం చేయాల్సి ఉంటుంది.
జూన్‌లో ఆర్థిక భారం ఎక్కువ
-అడిగొప్పుల రజిని, గృహిణి, మెట్‌పల్లి
ప్రతీ యేడాది జూన్‌లో అటు పిల్లల బడి ఫీజుల, ఇటు ఇంటి ఖర్చులు ఎక్కువవుతుంటాయి. దీంతో ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు జూన్‌లో ఆర్థిక కష్టాలు ఎదురవుతుంటాయి.
ఫీజులను నియంత్రించాలి
-దొనికెల నవీన్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులను ప్రభుత్వం నియంత్రించాలి. రూ.లక్షల్లో ఫీజులు ఉండడం వల్ల తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం పడుతోంది. పిల్లలను మంచి స్కూళ్లలో చదివించి ప్రయోజకులను చేయాలని తల్లిదండ్రులు కార్పొరేట్ బాట పడుతున్నారు. వారిలో ఉన్న బలహీనతను ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి.
వ్యవసాయ పెట్టుబడుల భారం
-నోముల రాజేశ్వర్‌రావు, రైతు, లక్ష్మీదేవిపల్లి
వర్షాకాలం ప్రారంభం అయిందంటే వ్యవసాయ పనులు మొదలు పెట్టాల్సి ఉంటుంది. దీంతో వ్యవసాయ పెట్టుబడులు అవసరమవుతుంటాయి. ఏ యేటికి ఆ యేడు వ్యవసాయ పెట్టుబడులు వివిధ కారణాల వల్ల పెరుగుతున్నాయి. దీంతో అప్పులు చేసి సాగుకు పెట్టుబడులు పెడుతున్నాం.
---------------------------------------------------------------------------------------
ఒక్కో విద్యార్థికి అయ్యే ఖర్చు...
---------------------------------------------------------------------------------------
మొదటి విడత స్కూలు ఫీజు రూ.10 వేల నుంచి రూ.25 వేలు
పుస్తకాలు...రూ.5 వేల నుంచి రూ.7 వేలు
రెండు జతల యూనిఫాం...రూ.2 వేల నుంచి రూ.2,500
ట్రాన్స్‌పోర్టు చార్జీ (నెలకు)..రూ.1000 నుంచి రూ.1,500
స్కూలు బ్యాగు, స్టేషనరీ...రూ.1000 నుంచి రూ.1,500