Share News

jagitiala : తప్పుల తడకగా ఓటర్ల జాబితా

ABN , Publish Date - Sep 01 , 2025 | 01:05 AM

జగిత్యాల, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల కోసం రూపొందించిన ఓటరు జాబితా తప్పుల తడకగా ఉంది.

jagitiala :  తప్పుల తడకగా ఓటర్ల జాబితా

- మృతులూ ఓటర్లే

- ఒక్కొక్కరికి రెండు చోట్ల జాబితాలో చోటు

- కుటుంబసభ్యుల పేర్లు వేర్వేరు వార్డుల్లో...

- నివాసం ఒక చోట... ఓటు మరో చోట

- కుప్పలుతెప్పలుగా అభ్యంతరాలు

- రేపు తుది ఫొటో ఓటర్ల జాబితా పబ్లికేషన్‌కు ఏర్పాట్లు

- జిల్లాలో 6,07,222 మంది పంచాయతీ ఓటర్లు

జగిత్యాల, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల కోసం రూపొందించిన ఓటరు జాబితా తప్పుల తడకగా ఉంది. జాబితాలో సవరణలు చేయాల్సిన అవసరముందన్న విజ్ఞప్తులు వెల్లువలా అందించారు. కుటుంబసభ్యుల పేర్లు వేర్వేరు వార్డుల్లో ఉన్నాయని, నివసించే వార్డులో కాకుండా వేరు వార్డులో ఓట్లు ఉన్నాయని, మరణించిన వారి పేర్లు కూడా జాబితాలో చోటు చేసుకున్నాయని, ఒకరిపేరు రెండుసార్లు ఉన్నాయని పేర్కొంటు పలు గ్రామపంచాయతీల్లో అధికారులకు పలువురు విజ్ఞప్తులు అందజేయడం గమనార్హం. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా ఇటీవల పంచాయతీ అధికారులు ముసాయిదా ఓటరు జాబితాలను రూపొందించారు. సంబంధిత జాబితాలను జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, రెవెన్యూ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాల్లో అతికించారు. జాబితాలో తప్పులు, ఒప్పులు, అభ్యంతరాలు, సలహాలు, సూచనలు చేయాలని అధికారులు కోరారు. దీంతో పలు చోట్ల గ్రామస్థులు, చోటామోటా నేతలు ఓటర్ల జాబితాలను పరిశీలించగా పలు తప్పులు వెలుగు చూశాయి. గ్రామ కార్యదర్శులు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులకు స్పష్టమైన ఆధారాలతో పలువురు విజ్ఞప్తులు అందజేశారు. జాబితాలో మృతులకు చోటు కల్పించారని, రెండేసి చోట్ల ఒక్కరికి ఓటుహక్కు కల్పించారని, వేర్వేరు వార్డుల్లో ఒకే కుటుంబసభ్యుల ఓట్లు ఉన్నాయంటూ అధికారులకు విజ్ఞప్తులు అందాయి. వీటిపై అధికారుల పరిశీలన జరిపి తుది ఫొటో ఓటర్ల జాబితాను విడుదల చేసే కసరత్తులు నిర్వహిస్తున్నారు.

ఓటర్ల జాబితా షెడ్యూల్‌ ఇలా..

రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు గత నెల 26వ తేదీన అన్ని గ్రామపంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శించారు. పోలింగ్‌ స్టేషన్ల వివరాలను సైతం గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించారు. అతికించిన ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు గత నెల 30వ తేదీ వరకు స్వీకరించారు. గతనెల 30వ తేదీన అన్ని మండలపరిషత్‌ కార్యాలయాల్లో రాజకీయపార్టీల ప్రతినిధులతో అవగాహన సమావేశం నిర్వహించారు. గత నెల 31వ తేదీన ఓటర్ల జాబితాలో వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించే పనులు నిర్వహిస్తున్నారు.. ఈనెల 2వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో వార్డుల వారీగా తుది ఫొటో ఓటర్ల జాబితాను పబ్లికేషన్‌ చేయనున్నారు.

ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు...

జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో 20 మండలాల్లో 385 గ్రామపంచాయతీల పరిధిలోని 3,536 వార్డుల్లో 2,89,249 మంది పురుషులు, 3,17,964 మహిళలు, తొమ్మిది మంది ఇతరులు, మొత్తంగా 6,07,222 మంది ఓటర్లున్నారు. అధికారులు నిర్వహించిన కసరత్తులో ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు అధికంగా వచ్చాయి. పలు ప్రాంతాల్లో జాబితాలో రెండుచోట్ల ఒకే వ్యక్తి పేర్లు ఉండడం, మృతి చెందిన వారి పేర్లు సైతం జాబితాలో ఉండడం, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లను వేర్వేరు వార్డుల్లో ఉండడం వంటి వాటిని స్థానికులు గుర్తించి గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవోలకు లిఖితపూర్వక అభ్యంతరాలు అందించారు. జిల్లావ్యాప్తంగా 168 గ్రామాల్లో 1,213 అభ్యంతరాలు, సలహాలు, సూచనలను అధికారులు స్వీకరించారు. వీటిని పరిష్కరించి తుది ఓటర్ల జాబితాను పబ్లికేషన్‌ చేయడానికి అవసరమైన కసరత్తులు చేస్తున్నారు. తప్పులకు తావు లేకుండా తుది జాబితా వెలువరిస్తారని ఓటర్లు ఆశతో ఉన్నారు.

జిల్లాలో ఓటరు జాబితాలో తప్పులు..

- రాయికల్‌ మండలం మహితాపూర్‌ గ్రామ పంచాయతీలో మామిడిపల్లి భూమన్న అను వ్యక్తి మృతి చెందినప్పటికీ ఓటరు జాబితాలో వరస సంఖ్య 1,539లో చోటు కల్పించినట్లు గుర్తించి అభ్యంతరం తెలిపారు.

- రాయికల్‌ మండలం మహితాపూర్‌ గ్రామ పంచాయతీలో గాండ్ల రాజారెడ్డి అనే ఓటరు పేరును రెండు చోట్ల ప్రచురించినట్లుగా గుర్తించి అభ్యంతరం అందించారు.

- రాయికల్‌ మండలం మహితాపూర్‌ ఒకటో వార్డులో సీరియల్‌ నంబరు 13లో గల తోట ఎర్రన్న అనే ఓటరు మృతి చెందినప్పటికీ జాబితాలో చోటు కల్పించారు.

- రాయికల్‌ మండలం మహితాపూర్‌ గ్రామ పంచాయతీలో 16 మంది మృతుల పేర్లు ఓటర్ల జాబితాలో వచ్చాయి. రెండు చోట్లలో తొమ్మిది మంది ఓటర్ల పేర్లను జాబితాలో చోటు కల్పించారని అభ్యంతరాలు వచ్చాయి.

ఫ బీర్‌పూర్‌లో ఒక వార్డు ఓటర్ల పేర్లను మరో వార్డులోని జాబితాలో చేర్చారు.

Updated Date - Sep 01 , 2025 | 01:05 AM