Share News

jagitiala : పీఏసీఎస్‌లకు ప్రత్యేక అధికారులు

ABN , Publish Date - Sep 13 , 2025 | 01:01 AM

జగిత్యాల, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ (పీఏసీఎస్‌)ల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

jagitiala : పీఏసీఎస్‌లకు ప్రత్యేక అధికారులు

ఇన్‌చార్జి పాలన నుంచి ఆరోపణల పీఏసీఎస్‌లు అవుట్‌

జిల్లాలో 23 సొసైటీలకు అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిలు

ఉత్తర్వులు జారీ చేసిన సహకార శాఖ ఉన్నతాధికారులు

అవినీతి, అక్రమాలు, అవకతవకలే కారణం

జగిత్యాల, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ (పీఏసీఎస్‌)ల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం సుమారు నెల రోజుల క్రితం రెండోసారి పీఏసీఎస్‌ల పాలకమండళ్ల గడువు పెంచగా, జిల్లాలో 23 సొసైటీలకు బ్రేక్‌ పడింది. సంబంధిత సొసైటీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ శుక్రవారం సహకార శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ యేడాది ఫిబ్రవరి 14వ తేదీతో పాలక వర్గాల పదవీ కాలం ముగియగా...ఆరు నెలల పాటు పాలకవర్గం గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల ఆగస్టు 14వ తేదీన మొదటిసారి ఇచ్చిన గడువు ముగియడంతో పాలక మండళ్లకు మరో ఆరు నెలల పాటు అవకాశం ఇస్తూ రెండో పర్యాయం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వచ్చే యేడాది ఫిబ్రవరి 14వ తేదీ వరకు పాలక మండళ్లకు గడువు పొడగించినట్లయింది. ప్రస్తుత చైర్మన్లకే పర్సన్‌ ఇన్‌చార్జిలుగా బాధ్యతలను అప్పగించింది.

ఫ జిల్లాలో 51 సహకార సంఘాలు..

జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లో 51 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. వీటిలో సుమారు 1.50 లక్షల మంది సభ్యులున్నారు. కరీం నగర్‌ కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్‌ జగిత్యాల జిల్లా పరిధిలో 17 బ్రాంచీలున్నాయి. 2019 సంవత్స రంలో ఫిబ్రవరి మాసంలో సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికైన పాలకవర్గాల గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 14తో ముగిసింది. అయితే రాష్ట్రంలోని డీసీసీబీ చైర్మన్లంతా సీఎం రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావును కలిసి విజ్ఞప్తి చేయడంతో పదవీకాలం ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ గడువు గత నెల 14తో ముగియడంతో.. మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మొదటిసారి ఎలాంటి నిబంధనలు లేకుండా పదవీ కాలం పొడిగించిన ప్రభుత్వం ఈసారి మాత్రం నిబంధనల ప్రకారం ఉన్న వాటికి మాత్రమే వర్తింపజేయాలని నిర్ణయించడంతో సొసైటీల కొనసాగింపు పై ప్రభావం చూపింది.

ఫ జిల్లాలో 23 సొసైటీలకు..

జిల్లాలోని 23 సొసైటీల్లో నిధుల దుర్వినియోగం, అవకతవకలు, అక్రమాలు, నిబంధనలు పట్టించుకోకపోవడం తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 సొసైటీల పాలకమండళ్ల గడువు పొడిగింపును ప్రభుత్వం పక్కన బెట్టింది. సంబంధిత సొసైటీల పరిధిలో కొన్నేళ్లుగా నిధుల దుర్వినియోగం, పంట రుణాల జారీలో అక్రమాలు, సొసైటీ స్థలాల ఆక్రమణ, ఐకేపీ సెంటర్ల నుంచి వచ్చే కమీషన్‌ డబ్బులను ఇతర వాటికి వినియోగించడం తదితర ఆరోపణలతో సంబంధిత సొసైటీ చైర్మన్లను పర్సన్‌ ఇన్‌చార్జీల నుంచి తప్పించి ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. కాగా జిల్లాలో ఇప్పటికే పలు సొసైటీ చైర్మన్లకు, సీఈవోలకు నోటీసులు జారీ చేయగా, సమగ్ర విచారణ, కేసులు కొనసాగుతున్నాయి.

ఫ పనితీరు మెరుగ్గా లేకపోవడంతోనే...

తాజా నిబంధనల ప్రకారం పనితీరు మెరుగ్గా ఉంటేనే వాటి పాలకవర్గాల గడువు పొడిగింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం సొసైటీల వారీగా పది అంశాలతో కూడిన సమాచారం అందించాల్సిందిగా జిల్లా సహకార శాఖను ఆదేశించింది. సొసైటీ పరిధిలో పాత బకాయిల పరిస్థితి... రుణాల తిరిగి చెల్లింపులు సక్రమంగా ఉన్నాయా, నిధుల దుర్వినియోగం ఏమైనా జరిగిందా.. జరిగితే వాటిపై ఎలాంటి విచారణ చేపట్టారు..దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టపరంగా ఏమైనా చర్యలు తీసుకున్నారా.. సొసైటీ కార్యకలాపాలపై ఆడిట్‌ చేశారా..చట్టపరమైన చర్యలకు సంబంధించిన పిటిషన్‌ ఏదైనా పెండింగ్‌లో ఉందా...అనే తదితర వివరాలతో కూడిన సమాచారం పంపించాలని ససహకార శాఖ కమిషనర్‌ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రంగంలోకి దిగిన ఆశాఖ అధికారులు సొసైటీల వారీగా సమాచారం సేకరించారు. పనితీరును గుర్తించి వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. తదనుగుణంగా తాజాగా 23 సొసైటీలకు అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారం సహకార శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ల్లాలో అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జీలు వీరే..

పర్సన్‌ఇన్‌చార్జీ పేరు పీఏసీఎస్‌ పేరు

ఎ మల్లేశం తిమ్మాపూర్‌, పోతారం, కల్లెడ,

సాయికుమార్‌గౌడ్‌ జగిత్యాల, ఇటిక్యాల, పోరుమల్ల

సుజాత నూకపల్లి, మేడిపల్లి

సీహెచ్‌ మల్లేశం గంబీర్‌పూర్‌, వల్లంపల్లి, అయిలాపూర్‌

నాగ సంకీర్త్‌ తిమ్మాపూర్‌, మాదాపూర్‌, భూషన్‌రావుపేట

సత్యనారాయణ పెగడపల్లి, గొల్లపల్లి, ధర్మపురి

ఎం శ్రీనివాస్‌ సిరిపూర్‌, చిట్టాపూర్‌, యామాపూర్‌

ఎండీ అసద్‌ మల్లాపూర్‌, మెట్లచిట్టాపూర్‌, భూపతిపూర్‌

ప్రభుత్వ నిర్ణయం మేరకే...

మనోజ్‌ కుమార్‌, జిల్లా సహకార శాఖ అధికారి, జగిత్యాల

జిల్లాలో 23 సహకార సంఘాలకు ప్రభుత్వ నిర్ణయం మేరకు అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జీలను నియమించాము. వచ్చే రెండు, మూడు రోజుల్లో సంబంధిత పర్సన్‌ ఇన్‌చార్జీలు భాధ్యతలను స్వీకరిస్తారు. సహకార చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంఘాల్లో అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జీలను ప్రభుత్వం నియమించింది.

Updated Date - Sep 13 , 2025 | 01:13 AM