jagitiala : పక్కాగా హాజరు
ABN , Publish Date - Jul 14 , 2025 | 12:58 AM
జగిత్యాల, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమయపాలనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. టీచర్ల హాజరు కోసం ఫెషియల్ రికగ్నిషన్ ప్రవేశపెట్టనుంది.
- ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్
- కసరత్తు చేస్తున్న ప్రభుత్వం
- త్వరలోనే అమలు
జగిత్యాల, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమయపాలనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. టీచర్ల హాజరు కోసం ఫెషియల్ రికగ్నిషన్ ప్రవేశపెట్టనుంది. చాలామంది ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా ఇష్టారీతిన విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విధ్యాబోధన అందడం లేదని, ప్రాథమిక పాఠశాలల్లో కొంత మంది విధులకు హాజరుకాకపోయినా మరుసటి రోజు రిజిస్టర్‌లో సంతకాలు పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు పాఠశాలల పనివేళలకు ముందుగానే ఇంటిముఖం పట్టడం, వివిధ వ్యాపారాలు, ఇతర వ్యాపకాలలో నిమగ్నమవుతూ విద్యార్థుల భవిషత్తుతో ఆడుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కొవిడ్‌కు ముందు సర్కారు పాఠశాలల్లో బయోమెట్రిక్ అమలు చేశారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరయ్యారు. ఆ తర్వాత అవి మూలన పడడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలో టీచర్లకు ఫెషియల్ రికగ్నిషన్ హాజరు అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేశారు. సత్ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలవుతున్న విషయం తెలిసిందే. టీచర్లకు కూడా అమలు చేస్తే సక్రమంగా విధులకు హాజరయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయం ఉంది.
ఫజిల్లా వ్యాప్తంగా 824 ప్రభుత్వ పాఠశాలలు
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 824 వివిధ ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 516 ప్రాథమిక పాఠశాలలు, 88 ప్రాథమికోన్నత పాఠశాలలు, 220 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో సుమారు 57,552 మంది విద్యార్థులు ప్రవేశాలు పొంది విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 3,750 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలోని పాఠశాలల్లో 1,427 మధ్యాహ్నా భోజన పథకం వంట కార్మికులు, హెల్పర్లు పనిచేస్తున్నారు. మండల పరిషత్, జిల్లా పరిషత్, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలతో పాటు కేజీబీవీ, మిని గురుకులాలు, మైనార్టీ సంక్షేమ, మహాత్మ జ్యోతిరావుపులే, టీఎస్ మోడల్, టీఎస్‌ఆర్‌ఈఐ సొసైటీ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల హాజరును గత విద్యా సంవత్సరంలో ఫేసియల్ రికగ్రేషన్ సిస్టం ద్వారా నమోదు చేశారు. ఈ విధానం విద్యార్థుల హాజరు నమోదు విజయవంతం కావడంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల హాజరు సైతం ఇదే విధానంలో నిర్వహించడానికి విద్యాశాఖ యోచిస్తోంది.
ఫమూలనపడ్డ బయోమెట్రిక్
ఉపాధ్యాయుల సమయపాలన కోసం 2018 సంవత్సరంలో ప్రభుత్వం బయోమెట్రిక్ తీసుకొచ్చింది. చాలామంది టీచర్లు వాటిని సరిగా వినియోగించలేదనే ఆరోపణలు వచ్చాయి. నెట్‌వర్క్ సమస్య, యంత్రాల మరమ్మతులు తదితర కారణాలు చూపుతూ హాజరు వేయకుండానే కొందరు తప్పించుకున్నారు. ఇది విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపింది. సర్కారు బడుల్లో చదివే సగం మంది విద్యార్థులకు చదవడం, రాయడం రావడం లేదని సర్వేల్లో వెలడైంది. పర్యవేక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతోనే దుస్థితి నెలకొందని పలువురు పేర్కొంటున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత యంత్రాలను పునఃప్రారంభించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని నెలలు మాత్రమే వాటిని ఉపయోగించి మూలన పడేశారు. ఈ యంత్రాలు పనిచేసిన సమయంలో సమయపాలన పాటించేందుకు పరుగులు తీసిన టీచర్లు, ప్రస్తుతం బయోమెట్రిక్ భయం లేకపోవడంతో ఎప్పుడైనా వెళ్లొచ్చన్న విధంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు పర్యవేక్షణను పూర్తిగా గాలికి వదిలేశారు.
సొంత పనుల్లో నిమగ్నం
జిల్లాలో కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించడం కంటే వారి సొంత పనుల్లోనే నిమగ్నమవులున్నారనే విమర్శలు ఉన్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టమొచ్చినపుడు పాఠశాలకు రావడం, సమయం కాకముంతే ఇంటి ముఖం పట్టడం, మధ్యాహ్న సమయం తర్వాత పాఠశాలల్లో ఉండకుండా కొంతమంది తమ వ్యాపారాలు, చిట్టీలు, రియల్ ఎస్టేట్ దందాల్లో మునిగి తేలుతున్నారు. ప్రాథమిక పాఠశాలల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒకరిద్దరు ఉపాధ్యాయులు పనిచేసే చోట పనులకు వెళ్లినప్పటికీ అనుమతులు లేకుండా డుమ్మా కొడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
ఫమొబైల్ యాప్‌లోనే
జిల్లాలోని మారుమూల మండలాల్లో విధులు నిర్వర్తించే చాలామంది ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని తెలుస్తోంది. ఇలాంటి వాటికి చెక్ పెటేందుకు ఫెషియల్ రికగ్నిషన్ హాజరు ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయులు తమ మొబైల్ ఫోన్‌లోనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఫొటో తీయాల్సి ఉంటుంది. ఈ హాజరు జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి అనుసంధానం ఉంటుంది. దీంతో ఉపాధ్యాయుడు ఏ సమయానికి బడికి వస్తున్నాడు, ఎప్పుడు ఇంటిముఖం పడుతున్నారనే విషయాలు తెలియనున్నాయి.
స్వాగతిస్తున్నాం
- తిరుక్కోవెల శ్యామ్‌సుందర్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఫెషియల్ రికగ్నిషన్ అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. మునుముందు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుంది. ఉపాధ్యాయులకు ఫెషియల్ రికగ్నిషన్ విధానాన్ని స్వాగతిస్తున్నాం.
ప్రభుత్వం పునరాలోచన చేయాలి
- బోయినిపల్లి ఆనంద రావు, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు, జగిత్యాల
ఉపాధ్యాయులకు ఫెషియల్ రికగ్నిషన్ సిస్టం అమలుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్ వినియోగించవద్దన్న మార్గదర్శకాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫెషియల్ రికగ్నిషన్ సిస్టం ఏ విధంగా ఉపయోగించే అవకాశాలుంటాయి.
ఇంకా ఉత్తర్వులు రాలేదు
- రాము, జిల్లా విద్యాధికారి
ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేయాలి. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగేలా విధులు నిర్వర్తించాలి. ఫేషియల్ రికగ్నిషన్ హాజరుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఉత్తర్వులు రాలేదు. ఈ విషయమై విద్యాశాఖ చర్చిస్తోంది. త్వరగా అమలు చేసే అవకాశముంది.