jagitiala : జన గణనకు సన్నాహాలు
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:46 AM
జగిత్యాల, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): జనాభా లెక్కల సర్వేకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. జనగణనకు సంబంధించి ఇటీవల కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
-ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర హోంశాఖ
-సిబ్బంది జాబితా, గ్రామాల వారీగా మ్యాప్‌లు రెడీ
-ఎన్యూమరేటర్లుగా ఉపాధ్యాయులు
-త్వరలో విడతల వారీగా శిక్షణ
జగిత్యాల, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): జనాభా లెక్కల సర్వేకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. జనగణనకు సంబంధించి ఇటీవల కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, పర్యవేక్షణ అధికారుల నియామకం, సమకూర్చుకోవాల్సిన సామాగ్రి తదితర అంశాలపై దృష్టి సారించింది. ఇప్పటికే సిబ్బంది నియామకం, గ్రామాల వారీగా మ్యాప్‌లు తదితర వాటిపై కసరత్తులు జరుగుతున్నాయి. సాధారణంగా ప్రతీ పదేళ్లకోసారి జనాభా లెక్కలు వెల్లడిస్తారు. చివరిసారి 2011లో జనగణన చేపట్టారు. నాటి లెక్కల ప్రకారం జిల్లా జనాభా 7,70,833 మంది ఉన్నారు. ఆ తరువాత 2021లో లెక్కంచాల్సి ఉండగా కరోనా కారణంగా ప్రక్రియ నిలిచి పోయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం జనగణన గెజిట్ విడుదల చేయడంలో జిల్లాలోనూ జనాభాను లెక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో పేపర్ ద్వారా జనగణన చేపట్టగా ఈసారి డిజిటల్ మొబైల్ యాప్ ద్వారా సర్వే చేయనున్నారు.
ఫజిల్లా, మండల స్థాయిలో కమిటీలు
జనాభా లెక్కల సేకరణకు జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక క మిటీలు ఏర్పాటు చేయన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డీఆర్‌డీవో, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ మరికొందరు అధికారులతో జిల్లా కమిటీ ఉంటుంది. మండల స్థాయిలో తహహసీల్దార్, ఏఎస్‌వో (అసిస్టెంట్ స్టాటిస్టికల్ అఽధికారి)తో కమిటీ ఉంటుంది. తహసీల్దార్ జనాభా లెక్కల సేకరణ అధికారిగా, ఏఎస్‌వో సహాయ అధికారిగా వ్యవహరిస్తారు. ఉపాధ్యాయులను ఎన్యూమరేటర్లుగా నియమించనున్నారు. ఐదుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్ వైజర్ ఉంటారు. వీరికి జిల్లా పరిధిలోనే వివిధ స్థాయిల్లో శిక్షణ ఇస్తారు. ఉన్నత స్థాయి కమిటీలకు హైదరాబాద్‌లో శిక్షణ ఉంటుంది. ఈసారి డిజిటల్ మొబైల్ యాప్‌ను జనాభా లెక్కల సేకరణకు వినియోగించనున్నారు.
ఫరెండు విడతల్లో లెక్కింపు
రెండు విడతల్లో జనాభా లెక్కింపు చేయనున్నారు. మొదటి విడత 2025 అక్టోబరు 1, రెండో దశ 2027 మార్చి 1 నాటికి జనాభా లెక్కలు సేకరించనున్నారు. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి రెండు దఫాలు వెళ్తారు. మొదటిసారి ఇళ్లను లెక్కించడంతో పాటు కుటుంబ స్థితిగతులు, ఆస్తులు, ఆదాయం, వసతులు వంటి అంశాలను సేకరిస్తారు. రెండో దశలో జనాభా వివరాలు సేకరించేందుకు ఇంటింటికీ వెళ్తారు. కుల, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమాచారం సేకరిస్తారు. ముఖ్య ప్రణాళిక, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ శాఖల అధికారులు, ఎన్యూమరేటర్లు సేకరించి రూపొందించిన జాబితాల ఆధారంగా ప్రత్యేక కమిటీలు క్షేత్రస్థాయికి వెళ్లి నిర్ధారిస్తాయి. 2027 ఫిబ్రవరి మాసంలో ఇంటింటికి వెళ్లి జన గణన చేపట్టనున్నారు. ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు జన్మించిన వారి వివరాలనూ నమోదు చేస్తారు. మార్చి ఒకటో తేదీ నాటికి జన గణన ప్రక్రియ ముగియనుంది. జనగణన చేపట్టే ఉపాధ్యాయులకు 2025లోనే శిక్షణ ఇవ్వనున్నారు.
ఫఅభివృద్ధికి దోహదం....
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపాలిటీల శివారు ప్రాంతాలను గుర్తించి వాటిని విస్తరించేందుకు అనువైన పరిస్థితులను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. వీటి అభివృద్ధికి జనాభా లెక్కలు దోహదపడనున్నాయి. భవిష్యత్తులో విస్తరణకు అవకాశం ఉండేలా మున్సిపాలిటీలకు సమీపంలో ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించనున్నారు. మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో అనువైన ప్రాంతాలు, రైల్వే కాలనీలు, విశ్వ విద్యాలయాలు, సైనిక శిబిరాలు వాటిని ప్రత్యేకంగా గుర్తిస్తారు. ఈమేరకు త్వరలోనే తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా వివరాలు సేకరించనున్నారు.
జిల్లా వివరాలు..
ఫమున్సిపాలిటీలు-5
ఫ రెవెన్యూ గ్రామాలు 287
ఫ రెవెన్యూ మండలాలు 20
ఫ గ్రామ పంచాయతీలు 383
ఫ భౌగోళిక విస్తీర్ణం 2,419 చదరపు కిలోమీటర్లు
ఫ నివాస గృహాలు 2,54,608