Share News

jagitiala : పైసలిస్తేనే పని..

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:58 AM

జగిత్యాల, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాల్లో పైసలు ఇవ్వనిదే పని జరగడం లేదన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

jagitiala :  పైసలిస్తేనే పని..

-రవాణా శాఖ కార్యాలయాల్లో బ్రోకర్లదే హవా

-ప్రతీ పనికో రేటు

-ఇటీవల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీటీవో

జగిత్యాల, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాల్లో పైసలు ఇవ్వనిదే పని జరగడం లేదన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. కార్యాలయంలో ప్రతీ పనికి ఓ రేటు ఫిక్స్‌ చేసి మరీ వసూలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. కొంత మంది దళారులు ఈ తతంగాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, పాఠశాల బస్సుల రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్‌ వంటి పనుల కోసం అధికారులు లంచాలు డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా కోరుట్లకు చెందిన ఓ వ్యక్తి నుంచి కార్యాలయ డ్రైవర్‌ ద్వారా రూ.22 వేల లంచం తీసుకుంటూ జిల్లా రవాణా శాఖ అధికారి భద్రునాయక్‌ను రెడ్‌ హ్యాండెండ్‌గా ఏసీబీకి చిక్కడం సంచలనం సృష్టించింది. రవాణా శాఖ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడితే నిరోధించాల్సిన జిల్లా స్థాయి అధికారి అవినీతి ఉచ్చులో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఫబ్రోకర్లకు కోడ్‌

ఆర్‌టీఏ కార్యాలయంలో ముందు దరఖాస్తు చూడడం లేదని, దరఖాస్తు వెనకాల ఉన్న సంఖ్యను చూస్తారని, ఒక్కో బ్రోకర్‌కు ఒక్కో కోడ్‌ ఇస్తారని స్థానికులు చెబుతున్నారు. కోడ్‌ భాషలోనే ఆర్‌టీఏ కార్యాలయంలో మాట్లాడుకుంటారని అంటున్నారు. ప్రతీ ఫైల్‌కు పెన్సిల్‌తో కోడ్‌ వేస్తారని, దాన్ని బట్టి ఫైల్‌ భవిష్యత్‌ ఆధారపడుతుంది. వాళ్ల భాషలో సరియైున కోడ్‌ అయితే ఆ పని చకచకా అవుతుంది. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు తమ బస్సుల ఫిట్‌నెస్‌ కోసం ఆ బ్రోకర్లనే ఆశ్రయిస్తారని స్థానికులు చెబుతున్నారు. ఫిట్‌నెస్‌ లేని బస్సులతో పాటు ఇతర పత్రాలు లేకుండా బ్రోకర్ల ద్వారా ఆర్‌టీఏకు వస్తే ఆ ఫైల్‌ ఒకే చేస్తారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో ఆర్‌టీఏ కార్యాలయంలో రవాణా శాఖ అధికారుల అక్రమ ఆదాయం రోజుకు కొన్ని వేలల్లో ఉంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫీస్‌ పరిసరాల్లో ఏజెంట్ల ద్వారా పనులు చక్కబెడుతున్న అధికారులు వారి స్థాయిని బట్టి వాటాలు పంచుకుంటున్నట్లు సమాచారం.

ఫఅడిగినంత ఇవ్వాల్సిందే..

రవాణా శాఖలో వాహనదారులకు లైసెన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల జారీ తదితర కార్యకలాపాల కోసం ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏజెంట్ల ద్వారా వెళ్తేనే ఎలాంటి పనైనా వెంటనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఏజెంట్‌ అడిగినంత ముట్టజెప్పాల్సిందేనంటున్నారు. వీటికి తోడు వాహనాల ఫిట్‌నెస్‌, పేర్ల మార్పిడి, ఓవర్‌ లోడ్‌ వెహికల్స్‌, జరిమానాల పేరిట అదనంగా గుంజుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఫటిప్పర్‌, ట్రాక్టర్‌ యజమానుల నెలవారీ మామూళ్లు

జిల్లాలో ఇసుక, మొరం, కంకర, గ్రానైట్‌ రవాణా చేసే లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. లారీలు ఓవర్‌ లోడ్‌తో ప్రయాణిస్తున్నందున రోడ్లు దెబ్బతినడంతో పాటు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటిని నివారించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించాలి. కానీ లారీ, టిప్పర్‌, ట్రాక్టర్‌ యజమానుల నుంచి నెలవారీ మాముళ్లు తీసుకొని ఆర్టీఏ అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఆర్‌టీఏ కార్యాలయంలో అవినీతిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

జిల్లాలో వాహనాల వివరాలు

-------------------------------------------------------------------

అంబులెన్స్‌లు- 99

ఆటో రిక్షాలు- 5,846

బస్సులు- 137

స్కూల్‌ బస్సులు- 480

మోటార్‌ క్యాబ్స్‌- 4,546

మోటార్‌ కార్స్‌- 14,831

మోటార్‌ సైకిల్స్‌- 1,42,665

-------------------------------------------------------------------

మొత్తం- 1,68,604

-------------------------------------------------------------------

Updated Date - Aug 09 , 2025 | 12:58 AM