Share News

jagitiala : ‘ఉపాధి’ కుదింపు

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:55 AM

జగిత్యాల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం పని దినాలు తగ్గుతున్నాయి.

jagitiala :  ‘ఉపాధి’ కుదింపు

-ఈజీఎస్‌ కూలీల పని దినాల్లో కోత

-గత యేడాది జిల్లాలో 39.99 లక్షల పని దినాలు

-ప్రస్తుత యేడాది 19.08 లక్షలకు పరిమితం

జగిత్యాల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం పని దినాలు తగ్గుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను తగ్గించేందుకు 2008 సంవత్సరంలో నాటి మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ఉపాధిహామీ పథకానికి శ్రీకారం చుట్టింది. భూమి లేని వారికి వ్యవసాయం పనులు లేని సమయంలో కూలీలకు గ్రామాల్లోనే ఉపాధి కల్పించేందుకు ఈ పథకం దోహద పడింది. ఏటేటా గ్రామీణ ప్రాంతాల్లో పథకానికి ఆదరణ పెరిగి ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో కూలీలు జాబ్‌ కార్డులు తీసుకున్నారు. నాలుగేళ్ల క్రితం జిల్లాలో 26.63 లక్షలుగా ఉన్న పనిదినాలు జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 19.80 లక్షలకు కుదించబడినట్టు అధికారిక లెక్కలతో వెల్లడవుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త నిబంధనలతో కూలీలు పనికి దూరమవుతున్నారు.

ఫజిల్లాలో పని దినాలు ఇలా...

జిల్లాలో 2022-23 సంవత్సరంలో 26.63 లక్షల పని దినాలు లక్ష్యంగా నిర్ణయించగా 32.26 లక్షల పని దినాలు కల్పించారు. 2023-24 సంవత్సరంలో 30.72 లక్షల పని దినాల లక్ష్యానికి గాను 37.32 లక్షల పని దినాలు కల్పించారు. 2024-25 సంవత్సరంలో 39.99 లక్షల పని దినాల లక్ష్యానికి గాను 42.45 లక్షల పని దినాలు కల్పించారు. ప్రస్తుత 2025-26 సంవత్సరానికి గాను 19.80 లక్షల పని దినాల లక్ష్యాన్ని నిర్ణయించారు. గత యేడాదితో పోలిస్తే పని దినాల సంఖ్య తగ్గింది. కొన్నేళ్లుగా వరుసగా ఏటేటా పనిదినాలు తగ్గుతున్నాయి. జిల్లాలో ఉన్న కూలీల సంఖ్యకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇచ్చిన పనిదినాలు చాలా తక్కువగా ఉన్నందున మరికొన్ని పనిదినాలు పెంచాలని ఈజీఎస్‌ కూలీలు కోరుతున్నారు.

ఫవసతుల లేమి..

పథకం ప్రారంభంలో పని ప్రదేశంలో కూలీలకు నీడ, పనిముట్లు ఇవ్వటంతో పాటు తాగునీరు, మెడికల్‌ కిట్‌ లాంటి ఎన్నో సౌకర్యాలు కల్పించేవారు. పని ప్రదేశంలో గాయపడిన వారికి ప్రభుత్వం తరపున వైద్యం అందించడంతో పాటు పరిహారం ఇచ్చే వెసులుబాటు ఉండేది. ఇన్నాళ్లు స్వగ్రామంలో ఉపాధి పనులు చేసుకుంటూ కూలీలు ఆర్థికంగా వృద్ధి చెందారు. సరియైున వివరాలు సేకరించకుండానే పనిదినాలను ఏటేటా తగిస్తూ కూలీలను అయోమయంలో పడేస్తున్నారు. జిల్లాలో జాబ్‌ కార్డులు పొందిన కుటుంబాల్లోని అందరూ క్రమం తప్పకుండా పనిచేస్తే ఏడాదికి కేటాయించిన పనిదినాలు పట్టుమని పది రోజుల్లో పూర్తి కావడం గమనార్హం.

ఫచేపట్టే పనులు

ఉపాధిహామీ పథకంలో గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల వ్యవసాయ పొలాల్లో భూమి చదును, చెరువు, కాల్వల పూడికతీత, శుభ్రం చేయటం వంటి పనులు చేపట్టేవారు. అంతేగాకుండా ప్రధాన కాల్వలోని పూడికతీత, చెట్లు, పిచ్చిమొక్కలు తొలగించడం, పొలాలకు మట్టి రోడ్డు, పంట పొలాల్లో నీటి కుంటల నిర్మాణాలు లాంటి పనులు చేస్తూ గ్రామీణ ప్రజలకు పని దినాలు కల్పించేవారు. దీంతో రైతులకు కూడా ప్రయోజనకరంగా ఉండేది. ప్రస్తుతం పనుల సంఖ్యను కుదించినట్లు తెలుస్తోంది.

ఫతగ్గిపోతున్న మెటీరియల్‌ కాంపొనెంట్‌

పని దినాలకు వెచ్చించిన కూలి డబ్బుల ఏడాది ఖర్చులో 40శాతం నిధులను మెటీరియల్‌ కాంపోనెంట్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్మాణ పనుల కోసం విడుదల చేయాలని నిబంధన ఉంది. కానీ ఏటేటా పనిదినాలు తగ్గిపోవటంతో మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు సైతం తగ్గుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిధులతో సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు నిర్మాణం చేసేవారు. ప్రస్తుతం ఈ శాశ్వత నిర్మాణ పనులు తగ్గినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే...

-రఘువరన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

జిల్లాలో గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పని దినాలు కేటాయిస్తున్నాం. పని దినాలు పెంచాలని వస్తున్న అభిప్రాయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లి అవసరమైన చర్యలు చేపడుతాం. పని దినాలను అవసరం మేరకు పెంచుతాం.

జిల్లా సమాచారం

----------------------------------------------------------------------------------------------------

మండలాలు...20

గ్రామ పంచాయతీలు..380

జాబ్‌ కార్డులు...1.67 లక్షలు

కూలీల సంఖ్య..2.73 లక్షలు

Updated Date - Aug 11 , 2025 | 12:55 AM