jagitial : ఉపాధ్యాయుల ‘సర్దుబాటు’ వివాదం
ABN , Publish Date - Jul 21 , 2025 | 01:13 AM
జగిత్యాల, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ జిల్లాలో వివాదాస్పదమవుతోంది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేక, విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు ఎదురవుతుండడంతో ప్రభుత్వం ఉపాధ్యాయుల తాత్కాలిక సర్దుబాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
-ప్రభుత్వ జాబితాను తప్పుపడుతున్న టీచర్లు, గ్రామస్థులు
-ఇష్టారాజ్యంగా వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేశారని ఆరోపణలు
-మల్లాపూర్‌లో రోడ్డెక్కిన తల్లిదండ్రులు
-జిల్లాలో 222 మంది సర్దుబాటు
జగిత్యాల, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ జిల్లాలో వివాదాస్పదమవుతోంది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్న చోట విద్యార్థులు లేక, విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు ఎదురవుతుండడంతో ప్రభుత్వం ఉపాధ్యాయుల తాత్కాలిక సర్దుబాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జిల్లా విద్యాశాఖ నాలుగు రోజుల క్రితం 222 మంది ఉపాధ్యాయులతో సర్దుబాటు జాబితాను విడుదల చేసింది. సర్దుబాటు జాబితా తప్పుల తడకగా రూపొందించారంటూ పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనికి తోడు ప్రజాప్రతినిధులు, నాయకుల జోక్యంతో పలు చోట్ల వివాదాలు ముదురుతున్నాయి. ఈ వ్యవహారం జిల్లా విద్యాశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు సర్దుబాటు మినహాయింపు కోరుతూ డీఈవో, ఎంఈవో కార్యాలయాలకు క్యూ కడుతున్నారు.
ఫసీనియారిటీ పట్టించుకోలేదని ఆవేదన
రాష్ట్ర విద్యా శాఖ మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం జిల్లా విద్యాశాఖ అధికారులు 222 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ జాబితా రూపొందించారు. ఈ ప్రక్రియలో ఉపాధ్యాయుల సీనియారిటీ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని పలువురు ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులను ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. దీనిపై పలువురు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల సర్దుబాటు జాబితాను ఆయా మండలాల ఎంఈవోలు ఇచ్చిన సమాచారం మేరకు సిద్ధం చేశారు. తొలుత ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సర్దుబాటు, మలి విడతలో ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల సర్దుబాటు జాబితాను రూపొందించాలని ప్రయత్నించారు. అయితే పలు చిక్కులు ఎదురుకావడంతో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులందరీతో కలిపి సర్దుబాటు జాబితాను రూపొందించారు.
ఫఅవసరమైన చోట ఉపాధ్యాయులు లేక ఇక్కట్లు..
పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు పైగా గడిచింది. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరడంతో పలు ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడుతున్నాయి. అయితే పలు ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ వివాదస్పదం కావడంతో క్షేత్ర స్థాయిలో అవసరమైన చోట ఉపాధ్యాయులు లేక అటు తల్లిదండ్రులు, విద్యార్థులు, ఇటు ఎంఈవోలు ఇబ్బందులు పడుతున్నారు.
ఫప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిళ్లు..?
సర్దుబాటు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు. అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా వాస్తవ పరిస్థితులు ఆధారంగా సర్దుబాటును పూర్తి చేస్తేనే విద్యార్థులకు అన్ని పాఠ్యాంశాల బోధన అందుబాటులోకి వస్తుందని వారు అంటున్నారు. అయితే కొంత మంది ఉపాధ్యాయులు తమకు అనుకూలంగా ఉండే పాఠశాలకు సర్దుబాటులో వెళ్లేందుకు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో జిల్లా అధికారులకు సిఫారుసు లేఖలు, ఫోన్లు చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కొంత మంది ఉపాధ్యాయులు తప్పుడు సమాచారాన్ని జొప్పిస్తూ తమకు అనుకూలంగా సర్దుబాటు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫనిబంధనలు ఇలా..
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతీ 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. విద్యార్థుల సంఖ్య ఒకటి నుంచి పది వరకు ఉంటే ఒక ఉపాధ్యాయుడు, 11 నుంచి 60మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు, 61 నుంచి 90 వరకు ముగ్గురు ఉపాధ్యాయులు, 91 నుంచి 120 వరకు నలుగురు ఉపాధ్యాయులు, 121 నుంచి 150 వరకు ఐదుగురు ఉపాధ్యాయులు, 151 నుంచి 200 వరకు ఆరుగురు ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే సందర్భాల్లో నాలుగు స్టేజీల్లో నిబంధనలు పాటించాల్సి ఉంటుందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. మొదటి దశలో రెండు ఉన్నత పాఠశాలలు ఒకే ప్రాంతంలో నిర్వహిస్తున్నట్లయితే ఒక స్కూల్‌గా పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. రెండో దశలో ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో గాని, ఒకే స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో గాని సర్దుబాటు చేయాలని, మూడో దశలో ఒకే మండలం పరిధిలోని స్కూల్ కాంప్లెక్స్‌లలో, నాల్గవ దశలో సమీప మండంలోని గాని, జిల్లాలోని ఇతర మండలాల్లో గాని ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్ల సర్దుబాటు సందర్భంగా విద్యార్థుల సంఖ్యను బట్టి సబ్జెక్టుల వారీగా జాబితాను రూపొందించాల్సి ఉంటుందన్న అభిప్రాయాలున్నాయి.
జిల్లాలో నెలకొన్న కొన్ని వివాదాలు..
ఫ మల్లాపూర్ మండలం రేగుంట పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలిని గ్రామానికన్నా తక్కువ విద్యార్థులున్న ఇతర పాఠశాలకు సర్దుబాటు చేశారని ఆరోపిస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
ఫ ఎండపల్లి మండలంలోని ఓ పాఠశాల నుంచి ఇంకో పాఠశాలకు సర్దుబాటు అయిన ఉపాధ్యాయుడు ఒకరు ఉత్తర్వుల నుంచి మినహాయింపు కోసం ఇటీవల ఓ ప్రజాప్రతినిధితో అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఫనిబంధనలకు విరుద్ధంగా దూర ప్రాంతానికి చెందిన తనను పెగడపల్లి మండలానికి సర్దుబాటు చేశారని, తనకు మినహాయింపు ఇవ్వాలని ఓ ఉపాధ్యాయురాలు డీఈవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది.
ఫ ఇబ్రహీంపట్నం మండలం నుంచి జగిత్యాల అర్బన్‌కు ఓ ఉపాధ్యాయున్ని, రాయిల్ మండలం నుంచి వెల్గటూరు మండలానికి ఒక ఉపాధ్యాయున్ని, మెట్‌పల్లి మండలం నుంచి జగిత్యాల పట్టణానికి ఒక ఉపాధ్యాయుడిని, సారగపూర్ మండలం నుంచి కోరుట్ల మండలానికి ఒక ఉపాధ్యాయుడిని నిబంధనలకు విరుద్ధంగా సర్దుబాటు చేశారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే..
-రాము, జిల్లా విద్యాశాఖ అధికారి
ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు సర్దుబాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎంఈవోలు క్షేత్ర స్థాయిలో అవసరాన్ని గుర్తించి ఇచ్చిన సమాచారం మేరకు, ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం నిర్ణయం తీసుకున్నాం. అన్ని ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ అన్ని సబ్జెక్లుల్లో బోధన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. సర్దుబాటులో ఉపాధ్యాయులు విధిగా జిల్లా అధికారుల ఆదేశాలు పాటించాలి.