ఫసల్ బీమా లేనట్లే
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:43 AM
జగిత్యాల, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత వానాకాలం సాగు సీజన్‌లోనూ ఫసల్ బీమా పథకం అమలు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గత యేడాది నుంచి ఊరిస్తున్న ప్రభుత్వం ఈ సీజన్‌లోనూ పంటల సాగుకు అదును దాటుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ సీజన్‌లో రైతుకు పంట నష్టం జరిగితే దేవుడే దిక్కు అనే దుస్థితి నెలకొంది.
-పంట నష్టం వాటిల్లితే దేవుడి మీదే భారం
-జిల్లాలో 3.5లక్షల ఎకరాల్లో పంటల సాగు
జగిత్యాల, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత వానాకాలం సాగు సీజన్‌లోనూ ఫసల్ బీమా పథకం అమలు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గత యేడాది నుంచి ఊరిస్తున్న ప్రభుత్వం ఈ సీజన్‌లోనూ పంటల సాగుకు అదును దాటుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ సీజన్‌లో రైతుకు పంట నష్టం జరిగితే దేవుడే దిక్కు అనే దుస్థితి నెలకొంది. జగిత్యాల జిల్లాలో వానాకాలం సీజన్‌లో 4.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారన్న అంచనా వేయగా ఇప్పటి వరకు 3,22,842 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. గతంలో పంటలకు నష్టం వాటిల్లినప్పుడు ఫసల్ బీమా పథకం అమలు చేసే వారు. వానాకాలంలో సాగు చేసే ఆహార పంటలు, నూనె గింజలు, వాణిజ్య, ఉద్యాన పంటలకు పంటల వారీగా, ప్రాంతాల వారీగా ప్రీమియం నిర్దేశించారు. అగ్ని ప్రమాదం, పిడుగుపాటు, గాలివాన, వడగళ్లు, తుఫాను, అనావృష్టి, అతివృష్టి, వరదలు, నీట మునిగిపోవడం, తెగుళ్లు, ప్రతికూల వాతావరణం వల్ల దిగుబడులకు నష్టం వాటిల్లితే పరిహారం చెల్లించేవారు. అంతేగాకుండా ప్రతికూల వాతావరణం వల్ల రైతులు విత్తనాలు విత్తకపోవడం, నార్లు వేయకపోవడం వల్ల కలిగి ఆర్థిక నష్టాలకు బీమా మొత్తంలో 25శాతం వరకు సత్వర నష్టపరిహారం అందించే అవకాశం ఈ పథకంలో ఉండేది. పంట మధ్య కాలంలో నష్టపోయిన రైతులకు సైతం నష్టాన్ని అంచనా వేసి పరిహారంలో పాతిక శాతం చెల్లించే అవకాశం ఉండేది. పంటల రకాలను బట్టి ప్రీమియం చెల్లించేవారు.
ఫఅన్నదాతల ఆశలపై నీళ్లు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఫసల్ బీమా పథకం అమలు అయ్యేది. కానీ వివిధ కారణాలతో కొన్నేళ్లుగా ఈ పథకం నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించడానికి నిర్ణయించిందని పలువురు ప్రజాప్రతినిధులు అనేక సందర్భాల్లో వెల్లడించారు. కానీ రైతుల ఆశపై నీళ్లు చల్లినట్లే కనబడుతోంది. ఈసారి వానాకాలం ఆరంభం నుంచి ఇప్పటి వరకు జగిత్యాల జిల్లాలో భారీ వర్షమే నమోదు కాలేదు. జిల్లాలోని పలు మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. జిల్లాలో 2.41 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తి చేశారు. సరియైున నీరు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పసుపు, మొక్కజొన్న రైతుల పరిస్థితి అలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫసల్ బీమా అమల్లోకి వచ్చినట్లయితే రైతులకు కొంత భరోసా ఉండేది. కానీ ఇప్పటి వరకు ఫసల్ బీమా పథకం అమలుపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. దీంతో ప్రస్తుత వానాకాలం సాగు సీజన్‌లోనూ పథకం అమలు అయ్యే అవకాశం లేదని స్పష్టమవుతోంది.
మార్గదర్శకాలు రాలేదు
-భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి, జగిత్యాల
ప్రస్తుత వానాకాలం సీజన్‌లో ఫసల్ బీమా పథకం అమలుకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ఫసల్ బీమా పథకం అమలు చేయాలని రైతులు అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే రైతులకు సమాచారం అందిస్తాం.