Share News

కొత్త దుకాణాలు లేనట్లేనా..!

ABN , Publish Date - Aug 05 , 2025 | 01:37 AM

ప్రభుత్వం జిల్లాలో అదనపు మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటివరకు ఉన్న పాత దుకాణాలకు మాత్రమే త్వరలో టెండర్లు కోసం షెడ్యూల్‌ జారీ చేసేందుకు ఎక్సైజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. సాధారణంగా ఉన్న దుకాణాల కంటే అదనంగా పెంచాలంటే కొత్త జనాభా లెక్కలు రావాల్సి ఉంది.

కొత్త దుకాణాలు లేనట్లేనా..!

జగిత్యాల, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం జిల్లాలో అదనపు మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటివరకు ఉన్న పాత దుకాణాలకు మాత్రమే త్వరలో టెండర్లు కోసం షెడ్యూల్‌ జారీ చేసేందుకు ఎక్సైజ్‌ శాఖ కసరత్తు చేస్తోంది. సాధారణంగా ఉన్న దుకాణాల కంటే అదనంగా పెంచాలంటే కొత్త జనాభా లెక్కలు రావాల్సి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సగటున ప్రతి 5 వేల మందికి ఒక మద్యం దుకాణం చొప్పున అధికారులు గతంలోనే పెంచారు. వాటి ప్రకారం ప్రస్తుతం జిల్లాలో 71 మద్యం దుకాణాలు, 19 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు అదనంగా షాపులకు అనుమతి ఇవ్వకుండా ఉన్న దుకాణాలకే టెండర్లు పిలువనున్నారు.

ఫక్లస్టర్‌ పరిధిలో షాపుల మార్పు...

జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, 385 గ్రామ పంచాయతీలున్నాయి. ఒక్కో వార్డుకు రెండు నుంచి మూడు లెక్కన కేటాయించారు. ఆయా క్లస్టర్ల పరిధిలో ఉన్న షాపులు ఏవైనా సక్రమంగా నడవడం లేదని, దరఖాస్తు చేసుకుంటే ఆ క్లస్టర్‌ పరిధిలోనే ఒకే స్లాబ్‌ విధానం ఉన్న ప్రాంతానికి మద్యం షాపును మార్చుకునేందుకు అనుమతి ఇస్తారు. జిల్లాలో క్లస్టర్‌ జనాభా స్లాబ్‌ను బట్టి షాపుల లైసెన్స్‌ ఫీజులను ఖరారు చేశారు. 5 వేల జనాభా ఉంటే రూ.50 లక్షల లైసెన్సు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. 5వేల నుంచి 10 వేల జనాభా ఉన్న చోట రూ.55 లక్షలు, 10వేల నుంచి 50 వేల జనాభా ఉంటే రూ.60 లక్షలు చెల్లించాలి. 50 వేల నుంచి లక్ష జనాభా ఉంటే రూ.65 లక్షలు, జనాభా లక్షకు ఆ పైన ఉంటే రూ.కోటి లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా స్లాబ్‌ల విధానం అమలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 71 మద్యం షాపులు ఉండగా అందులో కొన్ని షాపులు మాత్రమే పది రెట్ల రెవెన్యూ దాటాయి. మిగిలినవి ఏడెనిమిది రెట్లు మాత్రమే అమ్మకాల లక్ష్యాన్ని దాటాయి. ఇంకా నాలుగు నెలల గడువు ఉండడంతో అన్ని షాపులు పది రెట్ల అమ్మకాలను దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏదైనా ఒక షాపులో ఆ మేరకు అమ్మకాలు జరక్కపోతే ఆ క్లస్టర్‌ పరిధిలో అదే స్లాబ్‌ విధానం ఉన్న ప్రాంతానికి మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

ఫ2023లో 2,636 దరఖాస్తులు

రెండేళ్ల కిందట జిల్లాలోని 155 మద్యం షాపులకు టెండర్లు పిలువగా 2,636 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని షాపులకు పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. జగిత్యాల రూరల్‌ మండలంలోని జాబితాపూర్‌ దుకాణానికి 80 మంది పోటీ పడి దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోనే ఈ దుకాణానికి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. పోటీ పడిన వారిలో కొందరు ఐదారు దరఖాస్తు చేయగా డ్రాలో అవకాశం కల్పించారు.

ఫత్వరలో మద్యం షాపుల టెండర్ల షెడ్యూల్‌..

జిల్లాలో త్వరలోనే మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదల అయ్యే అవకాశం ఉంది. 2023లో ఆగస్టు 21న టెండర్లు పిలిచి డ్రా తీశారు. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి కొత్త షాపులు తెరిచారు. ప్రస్తుతం జిల్లాలోని 71 మద్యం షాపుల లైసెన్స్‌ గడువు నవంబరు 30తో ముగియనుంది. దీంతో మళ్లీ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలను సెప్టెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనే మొదలైతే అందుకు కనీసంగా మూడు నెలల సమయం పట్టనుంది. ఆ సమయంలో దుకాణాల టెండర్లు నిర్వహణ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందుకే గతంలో మాదిరిగానే టెండర్ల ప్రక్రియను ముందుగానే నిర్వహించాలని ఎక్సైజ్‌ శాఖ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

ఫటెండర్‌ డిపాజిట్‌ ధర పెంపు...

గతంలో టెండర్‌లో పాల్గొనాలంటే దరఖాస్తుకు రూ.2 లక్షలు డీడీ చెల్లించాలనే నిబంధన ఉంది. ఈ డబ్బు తిరిగి రాదు. ప్రభుత్వానికే చెందుతుంది. అయితే ఈసారి దరఖాస్తుల ధరను మరింత పెంచి ప్రభుత్వం అదనపు ఆదాయం సమకూర్చుకునే పనిలో పడింది. దరఖాస్తు ఫారం ధరను రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారుల ద్వారా తెలిసింది.

Updated Date - Aug 05 , 2025 | 01:37 AM