Share News

‘కపాస్‌ కిసాన్‌’తో కష్టమే..

ABN , Publish Date - Nov 03 , 2025 | 02:11 AM

తెల్ల బంగారంగా రైతులు పిలుచుకునే పత్తి కొనుగోళ్లకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఈసారి కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులను దళారుల మోసాల నుంచి కాపాడే దిశగా కపాస్‌ కిసాన్‌ యాప్‌ను ప్రారంభించింది.

‘కపాస్‌ కిసాన్‌’తో కష్టమే..

- జిల్లాలో పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం

- అతివృష్టితో దెబ్బతిన్న పత్తి చేలు

- దిగుబడిపై అన్నదాతల దిగులు

- నేడు పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

తెల్ల బంగారంగా రైతులు పిలుచుకునే పత్తి కొనుగోళ్లకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ఈసారి కేంద్ర ప్రభుత్వం పత్తి రైతులను దళారుల మోసాల నుంచి కాపాడే దిశగా కపాస్‌ కిసాన్‌ యాప్‌ను ప్రారంభించింది. జిల్లాలో రైతులకు కపాస్‌ కిసాన్‌ యాప్‌పై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో రైతులు ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రైవేట్‌ వ్యాపారులు రైతులకు పెట్టుబడి కోసం ముందుగానే డబ్బు అప్పుగా ఇవ్వడం, పంట చేతికి వచ్చిన తర్వాత ఇంటి వద్దనే పత్తి కొనుగోలు చేసి తీసుకువెళ్లడం, డబ్బులు సక్రమంగా ఇవ్వకపోవడమే కాకుండా తూకంలోనూ మోసాలు జరిగేవి. మద్దతు ధర రైతులు పొందలేక నష్టపోయేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పత్తిని రైతులు సీసీఐ కేంద్రాలకు తీసుకువెళ్లేకంటే ముందుగానే కపాస్‌ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకొని భూమి, బ్యాంకు వివరాలు, పత్తికి సంబంధించిన వివరాలు నమోదు చేయాలి. పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి ముందుగా బరువు తేమ శాతం, జిన్నింగ్‌ మిల్‌ పేరు నమోదు చేయాలి. ఇందుకు ప్రతి రైతు స్మార్ట్‌ఫోన్‌ను ఆధార్‌ ఫోన్‌ నంబర్‌తో అనుసంధానం చేయాలి. ఇప్పటికే రైతులు పంట దిగుబడి లేక ఆందోళన చెందుతున్న అన్నదాతలకు స్మార్ట్‌ఫోన్లు తలనొప్పిగా మారే పరిస్థితి ఏర్పడింది. కపాస్‌ యాప్‌తో రైతులు తమకు అవసరమైన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించుకోవడానికి స్లాట్‌ బుక్‌ చేసుకొని వెళ్లడం ద్వారా చెల్లింపు స్థితి, ట్రాక్‌ చేసుకునే వీలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా రైతులు తమ ఇబ్బందులను అధికారుల దృష్టికి తేవడానికి టోల్‌ ఫ్రీనంబర్‌లను తీసుకొచ్చారు.

జిల్లాలో మూడు కొనుగోలు కేంద్రాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి అధికారులు సన్నద్ధం చేశారు. సోమవారం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. జిల్లాలోని వేములవాడ మండలం నాంపల్లిలోని లక్ష్మీ నరసింహ కాటన్‌ ఇండస్ట్రీస్‌, సంకేపల్లిలోని లక్ష్మీఇండస్ట్రీస్‌, కోనరావుపేట మండలం సుద్దాలలోని శ్రీ కావేరి కాటన్‌ ఇండస్ట్రీస్‌లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు పత్తిలో 8 తేమ శాతం కంటే తక్కువ ఉంటే క్వింటాలకు రూ 8110, తేమ 10 శాతం ఉంటే క్వింటాలుకు రూ 7947, తేమ 11శాతం ఉంటే రూ 7866, తేమ 12 శాతం ఉంటే రూ 7785 మద్దతు ధర చెల్లిస్తారు.

జిల్లాలో 46,385 ఎకరాల్లో పత్తి సాగు

పత్తి ఇంటిని బంగారంగా మారుస్తుందని రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే అతివృష్టితో పత్తి పంట దెబ్బతినగా, తాజాగా వచ్చిన మొంథా తుఫాన్‌ దిగుబడిపై దిగాలు నింపింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 46,385 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. దుక్కులు దున్నడం మొదలు విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులతో జిల్లా రైతులు ఎకరానికి రూ 35 వేల నుంచి రూ 50 వేల వరకు ఖర్చు చేశారు. వర్షాలు ఆలస్యంగా కురవడంతో విత్తనాలు ఆలస్యంగా వేసుకున్నారు. కొందరు రైతులు ముందుగా విత్తనాలు వేసుకోవడంతో విత్తనాలు మొలకెత్తక రెండోసారి కూడా విత్తనాలు వేసుకున్నారు. తర్వాత అల్పపీడనంతో వదలని వాన దిగుబడి కష్టమే అన్నట్లుగా మార్చగా, మొంథా తుఫాన్‌ పెట్టుబడి కూడా వస్తుందో రాదేమోనని రైతుల్లో ఆవేదన నింపింది. జిల్లాలో ఎకరానికి ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల చొప్పున 5 లక్షల నుంచి ఐదున్నర లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు మాత్రం ఎకరానికి నాలుగు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో ఖరీఫ్‌ సాగు ఇలా..

మండలం మొత్తం పత్తి

గంభీరావుపేట 18598 85

ఇల్లంతకుంట 36970 12000

ముస్తాబాద్‌ 23835 530

సిరిసిల్ల 5623 800

తంగళ్లపల్లి 21086 870

వీర్నపల్లి 8300 300

ఎల్లారెడ్డిపేట 21100 3600

బోయినపల్లి 19167 6400

చందుర్తి 21367 6200

కోనరావుపేట 23140 4800

రుద్రంగి 10964 2200

వేములవాడ 10038 4800

వేములవాడ రూరల్‌ 15142 3800

--------------------------------------------------------------------------------------------

మొత్తం 235330 46385

----------------------------------------------------------------------------------------------------

Updated Date - Nov 03 , 2025 | 02:11 AM