Share News

బాల్యాన్ని ‘నులి’పేస్తుంది..

ABN , Publish Date - Aug 10 , 2025 | 02:35 AM

పిల్లలు బడికి వెళ్లడానికి రెడీ అయినా క్షణంలోనే కడుపు నొప్పి అంటూ విల్లవిల్లాడుతారు.

బాల్యాన్ని ‘నులి’పేస్తుంది..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పిల్లలు బడికి వెళ్లడానికి రెడీ అయినా క్షణంలోనే కడుపు నొప్పి అంటూ విల్లవిల్లాడుతారు. కొందరు బడి తప్పించుకోవడానికి అనుకుంటారు.. మరి కొందరు అకస్మాత్తుగా వచ్చిన నొప్పిని చూసి గాభరా పడుతారు. ఇది నులిపురుగుల నొప్పి కూడా అవుతుంది. పిల్లల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండే తల్లిదండ్రులను ఇబ్బందికి గురిచేసే నులిపురుగులు తయారుకావడం ప్రధానంగా శుభ్రత పాటించకపోవడమే. నులి పురుగులతో ఒక్కొక్కసారి ప్రాణాంతకమైన సమస్యలు కూడా వస్తాయి. రక్తహీనతకు 60 శాతం నులిపురుగులే సమస్యగా ఉంటాయి. ముఖ్యంగా సంవత్సరం పిల్లవాడి నుంచి 19 సంవత్సరాల యువకుడి వరకు పొట్టలో పెరిగే పురుగులతో బాధపడుతూనే ఉంటారు. నులి పురుగులు, కొంకి పురుగులు, కొరడా పురుగులు, బద్దె పురుగులు, ఏలిక పాములు, దారపు పురుగులు.. ఇలా పొట్టలో చేరి అనేక రోగాలకు కారణమవుతుంటాయి. వీటి నివారణ కోసం వైద్య ఆరోగ్య శాఖ ప్రతి ఏడాది రెండుసార్లు జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. సోమవారం ఆగస్టు 11న మాత్రలు వేస్తారు. ఆరోజు మాత్రలు వేసుకొని వారికి 18న మాప్‌ఆప్‌ డేగా తప్పని సరిగా నులి పురుగుల మాత్రల పంపిణీకి చేయనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లక్షా 18వేల 736 మందికి నులి పురుగుల నివారణకు అల్బెండజోల్‌ మాత్రలు వేసే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించే విధంగా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

నులి పురుగులతో పిల్లల్లో రక్తహీనత

పిల్లలు అరోగ్యంగా ఉంటేనే తల్లిదండ్రులకు సంతోషం. ఆరోగ్యంపై నిరంతరం అప్రమత్తతతో ఉండాలి. పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది. ఆరోగ్య సమాజం కోసం ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా అనారోగ్య సమస్యలతో సతమతమవతున్నారు. ముఖ్యంగా సంవత్సరం పిల్లవాడి నుంచి 19 సంవత్సరాల యువకుడి వరకు పొట్టలో పెరిగే పురుగులతో బాధపడుతూనే ఉంటారు. నులి పురుగులు, కొంకి పురుగులు, కోరడా పురుగులు, బద్దె పరుగులు, ఏలిక పాములు, దారపు పురుగులు ఇలా మన పొట్టలో చేరి అనేక రోగాలకు కారణమవుతుంటాయి. వీటి నివారణ కోసం వైద్య ఆరోగ్య శాఖ ప్రతి ఏడాది జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,18,736 మందికి మాత్రల లక్ష్యాన్ని పెట్టుకోగా, ఏడాది నుంచి 19 సంవత్సరాల వయసుల వారీగా లక్ష్యాలను గుర్తించారు. జిల్లాలో 47 జూనియర్‌ కాలేజిలు, 626 పాఠశాలలు, 587 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఐసీడీఎస్‌ పరిఽధిలో 30,475 మంది పిల్లలు ఉండగా, పాఠశాలల్లో 77,921 మంది పిల్లలు, జూనియర్‌ కాలేజీల్లో 7,664 మంది ఉన్నట్లు గుర్తించారు. ఇందుకోసం 168 మంది ఆరోగ్య శాఖ సిబ్బంది, 456 మంది ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ, కళాశాలల ప్రతినిధులు పాల్గొంటున్నారు.

వయస్సును బట్టి మాత్ర..

జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పంపిణీ చేసే అల్బెండజోల్‌ మాత్రలను వయస్సును బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, రెండు సంవత్సరాల పిల్లలకు సగం మాత్రను, 2-3 సంవత్సరాలలోపు పిల్లలకు ఒక మాత్రను పొడిచేసి నీళ్లలో కలిపి తాగించాలి. ఆపైబడిన వారికి 400 ఎంజీ అల్బెండజోల్‌ మాత్రను చప్పరించి లేదా నమిలి వేయించాలి.

పొట్టలో దర్జాగా పురుగులు..

అపరిశభ్రతతో అనేక పురుగులు పిల్లల పొట్టలోకి చేరిపోతాయి. పిల్లలు తినే ఆహారం లోపల దర్జాగా తింటూ ఉంటాయి. ఈ పురుగులు పొట్టలోకి ఎలా వస్తాయంటే అపరిశభ్రతతో నులిపరుగులు, ఇతర పురుగులు మన పొట్టల్లో వృద్ధి చెందుతాయి. పిల్లలు మట్టిలో ఆడుకొని వచ్చి ఆదే చేతితో తినుబంఢారం తినడం జరుగుతుంది. పిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా కనిపిస్తుంటారు. మహిళలు బియ్యం ఎరుతూ మట్టిగడ్డలు తినే అలవాటు కూడా ఉంటుంది. చేలల్లో గరకలు, మట్టిని కూడా చప్పరిస్తుంటారు. దీంతో మట్టిలో పురుగుల గుడ్లు పొట్టలోకి వెళ్లిపోతుంటాయి. అంతేకాకుండా మలం మీద వాలిన ఈగలు తిరిగి ఆహారపదార్థాల మీద వాలడం వల్ల పురుగుల గుడ్లు ఆహారం మీద ఉండిపోతాయి. తాగునీటి పైపులైన్లలో డ్రైనేజీ నీళ్లు కలవడం వల్ల కూడా ఈ గుడ్లు పొట్టలోకి చేరుతాయి. పెరిగిన గోళ్లు వాటిలో ఇరుక్కుపోయిన మట్టి వల్ల కూడా గుడ్లు పొట్టలోకి వెళ్లి వివిధ రకాల పురుగులు తయారవుతాయి.

అపోహలు వద్దు.. మాత్రలు వేసుకోవాలి..

- డాక్టర్‌ రజిత, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి

నులి పురుగుల నివారణ కోసం పంపిణీ చేసే ఆల్బెండజోల్‌ మాత్రలు సంవత్సరం నుంచి 19 సంవత్సరాలలోపు వారందరూ తప్పనిసరిగా వేసుకోవాలి. మాత్రలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. ప్రధానంగా రక్తహీనత, పిల్లల ఎదుగుదలపై నులి పురుగుల ప్రభావం చూపుతాయి. ఈనెల 11న జిల్లా వ్యాప్తంగా మాత్రలు పంపిణీ చేస్తాం. ఆరోజు మాత్రలు తీసుకోని వారికి 18వ తేదిన మాత్రలు అందిస్తాం. జిల్లాలో 1.18 లక్షల మందికి మాత్రలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

Updated Date - Aug 10 , 2025 | 02:35 AM