బీసీలకు అవకాశం కల్పించడం అభినందనీయం
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:32 AM
అన్ని పార్టీలు బలహీనవర్గాల నాయకులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్లు కేటాయించడం అభినందనీయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

వేములవాడ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : అన్ని పార్టీలు బలహీనవర్గాల నాయకులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్లు కేటాయించడం అభినందనీయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వే ఎఫెక్ట్ కారణంగానే బడుగు, బలహీన వర్గాల వారికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం దక్కిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రాజరాజేశ్వరి గౌడ సంక్షేమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాన్ని సోమవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఇతర దాతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన సర్వే ఎఫెక్ట్‌తోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు బీసీ నాయకులకు పోటీ చేసే అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, సీపీఐ, బీఆర్‌ఎస్ మూడు పార్టీలు ఐదుగురు బడుగు, బలహీన వర్గాలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించడానికి బీసీ మంత్రిగా స్వాగతం తెలుపుతున్నానని అన్నారు. బీసీలంతా ఐక్యంగా ఉండి 42 శాతం రిజర్వేషన్లు సాధించడంతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఎదగాలన్నారు. పేద విద్యార్దులు చదువుకునేందుకు 200 కోట్ల రూపాయల చొప్పున 55 ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు 11 వేల కోట్ల రూపాయలు మంజూరు చేయడం సంతోషకరమైన విషయమని, ఇది విప్లవాత్మకమైన నిర్ణయం అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు మంజూరు చేసినందుకు సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. బలహీనవర్గాలకు చెందిన నాయకులకు ఎమ్మెల్సీ సీట్లు కేటాయించడంపై అన్ని పార్టీల నాయకత్వాలకు పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. గౌడ సంఘం ట్రస్టు ప్రతినిధులు, నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.