Share News

రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:32 AM

రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ కార్డులు అందిస్తామని కలెక్టర్‌ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం చొప్పదండిలో రేషన్‌ కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు.

రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

చొప్పదండి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ కార్డులు అందిస్తామని కలెక్టర్‌ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం చొప్పదండిలో రేషన్‌ కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకునేందుకు రేషన్‌ కార్డు కీలకమని జిల్లావ్యాప్తంగా 78 వేలకుపైగా నూతన రేషన్‌ కార్డులు, చొప్పదండి నియోజకవర్గంలో నాలుగు వేల కార్డులను అందిస్తున్నామని తెలిపారు. కార్డు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, నిరుపేదలకు సన్న బియ్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ కార్డులు అందిస్తుందని తెలిపారు. త్వరలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ రాబోతుందని, గంగాధరలో డిగ్రీ కాలేజీ, రామడుగులో అడ్వాన్స్‌ ట్రేడ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ కొత్తూరు మహేష్‌, తహసీల్దార్‌ నవీన్‌కుమార్‌, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ఫ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. బుధవారం మండలంలోని రుక్మాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యపరమైన జాగ్రత్తలను ప్రతి విద్యార్థి పాటించాలని అన్నారు. పాఠశాలలో వృథాగా ఉన్న ఎలక్ర్టానిక్‌ పరికరాలను, ఇతర వస్తువులను వెంటనే డీఈవో కార్యాలయానికి పంపించాలని, పరిసరాలు శుభ్రం చేయించి నీటి కనెక్షన్‌ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రత పాటించాలని, అన్ని గదులను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. మండలంలోని పాఠశాలలను పర్యవేక్షించి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంఈవో మోహన్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయులకు పలు సూచలను చేశారు. కార్యక్రమంలో ఎంఈవో మోహన్‌, తహసీల్దార్‌ నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 12:32 AM