బల్దియాలో బినామీల హవా?
ABN , Publish Date - Mar 10 , 2025 | 12:54 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రతిఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. క్షేత్రస్థాయిలో వాటి లక్ష్యం నెరవేరడం లేదు స్థానిక అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించడం.. బినామీలుగా అవతారం ఎత్తడం.. కమీషన్ల కోసం కక్కుర్తి పడడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఓ కీలక శాఖకు చెందిన ఇద్దరు అధికారుల వ్యవహారం సంబంధిత మున్సిపల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
హుజూరాబాద్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రతిఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. క్షేత్రస్థాయిలో వాటి లక్ష్యం నెరవేరడం లేదు స్థానిక అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించడం.. బినామీలుగా అవతారం ఎత్తడం.. కమీషన్ల కోసం కక్కుర్తి పడడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఓ కీలక శాఖకు చెందిన ఇద్దరు అధికారుల వ్యవహారం సంబంధిత మున్సిపల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిబంధనల ప్రకారం అధికారులు కాంట్రాక్టు పనులు చేయకూడదని తెలిసినా సదరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బినామీతో కాంట్రాక్టు పనులు పూర్తి చేయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫ కాంట్రాక్టర్లను అడ్డుకుని..
హుజూరాబాద్ పట్టణంలో సుమారు 50వేల వరకు జనాభా ఉండగా, అందులో 30వార్డులున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిధులు విడుదల చేస్తున్నాయి. ఈ పనుల కోసం పలువురు లైసెన్స్ ఉన్న కాంట్రాక్టర్లు టెండర్‌లో పాల్గొనకుండా మున్సిపాలిటీలో పనిచేసే ఇద్దరు అధికారులు అడ్డుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా మున్సిపాలిటీలో తిష్ఠ వేసిన ఇద్దరు అధికారులు కాంట్రాక్టు పనులను బినామీలతో చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్‌లో ఏడాది క్రితం సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, పైపులైన్ల నిర్మాణం, మరమ్మతులు తదితర పనులకు నిధులు విడుదలయ్యాయి. ఆన్‌లైన్‌లో టెండర్లు ఇతరులకు కనిపించకుండా ఆ ఇద్దరు అధికారులు చూసుకుంటున్నట్లు తెలిసింది. సదరు బినామీ కాంట్రాక్టరుకు పనులు దక్కేలా చక్రం తిప్పుతున్నారు. సదరు కాంట్రాక్టర్ వివిధ కాలనీల్లో పనులు చేయిస్తున్నాడు. అవి కూడా నాసిరకంగా చేస్తుండడంతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. 15రోజుల క్రితం ఓ కాంట్రాక్టర్ హుజూరాబాద్‌లో టెండర్లలో ఏడాదిగా గోల్‌మాల్ జరుగుతుందని సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
ఫ ఆరా తీస్తున్న మున్సిపల్ ఉన్నతాధికారులు..
హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఏడాదిగా జరుగుతున్న టెండర్ల విషయంలో హైదరాబాద్‌లోని మున్సిపల్ ఉన్నతాధికారులు ఆరా తీస్తు న్నట్లు తెలిసింది. కొంతమంది కాంట్రాక్టర్లను సదరు అధికారులు కలిసి బినామీ కాంట్రాక్టర్ల వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఏళ్లకు ఏళ్లుగా మున్సిపాలిటీలో బదిలీకాకుండా ఇక్కడే ఉన్న ఇద్దరు అధికారుల పనితీరును లోతుగా పరిశీలిస్తున్నారు.