‘స్థానిక’ంలో ముందుకేనా?
ABN , Publish Date - Oct 08 , 2025 | 01:15 AM
స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతాయా... రిజర్వేషన్లు ఉంటాయా.. రద్దు చేస్తారా.. కొత్త రిజర్వేషన్లు లేదా పాత రిజర్వేషన్లను కొనసాగిస్తారా ఇలా అనేక ప్రశ్నలతో గ్రామాల్లో ఎవరు కలిసినా చర్చలు జరుగుతున్నాయి.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతాయా... రిజర్వేషన్లు ఉంటాయా.. రద్దు చేస్తారా.. కొత్త రిజర్వేషన్లు లేదా పాత రిజర్వేషన్లను కొనసాగిస్తారా ఇలా అనేక ప్రశ్నలతో గ్రామాల్లో ఎవరు కలిసినా చర్చలు జరుగుతున్నాయి. స్థానిక ఎన్నికల బరిలో నిలవడానికి సిద్ధమైన ఆశావహులు, పార్టీల నేతలు బుధవారం హైకోర్టు ఇచ్చే తీర్పుపైనే దృష్టిపెట్టారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఉన్న 23 శాతం రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జడ్పీటీసీ, ఎంపీటీసీ, జడ్పీ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ప్రకటించినది. సుప్రీంకోర్టు గతంలో 50 శాతం రిజర్వేషన్ల పరిమితి దాట వద్దని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన రిజర్వేషన్లు 67 శాతం దాటిపోయాయి. దీనిపై కొందరు సుప్రీంకోర్టు, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. దీంతో బుధవారం హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.
రెండు విధాలుగా సిద్ధం.
జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల ప్రకారం ఆశావాహులు పోటీకి సిద్ధమవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీలు 260 సర్పంచులు 2,268 వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణపై బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దానికనుగుణంగా ఈనెల 9న మొదటగా ప్రాదేశిక నియోజకవర్గం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయనున్నది. రిజర్వేషన్లు ఎలా ఉన్నా ఆశావాహులు రెండు విధాలుగా సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు కొత్త రిజర్వేషన్లు, పాత రిజర్వేషన్లు రెండిటిని దృష్టిలో పెట్టుకొని ఎంపికకు కసరత్తు చేస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. రిజర్వేషన్లలో 12 జడ్పీటీసీ స్థానాల్లో ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు మూడు, బీసీలకు ఐదు, జనరల్ మూడు స్థానాలను కేటాయించారు. జడ్పీ చైర్మన్ ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేశారు. 123 ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీలకు 7, ఎస్సీలకు25, బీసీలకు 56, జనరల్ 35 స్థానాలను కేటాయించారు. ఎంపీపీల రిజర్వేషన్లలో రుద్రంగి ఎస్టీ జనరల్, ముస్తాబాద్ ఎస్సీ మహిళ, కోనరావుపేట ఎస్సీ జనరల్, వేములవాడ రూరల్ ఎస్సీ జనరల్, ఇల్లంతకుంట బీసీ మహిళ, బోయినపల్లి బీసీ మహిళ, గంభీరావుపేట, వేములవాడ అర్బన్, ఎల్లారెడ్డిపేట బీసీ జనరల్, వీర్నపల్లి మహిళా జనరల్, చందుర్తి, తంగళ్ళపల్లి జనరల్ రిజర్వ్ చేశారు. 260 సర్పంచ్ స్థానాల్లో ఎస్టీలకు 30, ఎస్సీలకు53, బీసీలకు 101, జనరల్ 76 స్థానాలను కేటాయించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రితో సహా సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు..జిల్లాలో పరిషత్ ఎన్నికలకు సంబంధించి 12 జడ్పీటీసీలు, 123 ఎంిపీటీసీ స్థానాలకు సంబంధించి 712 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నరు. జిల్లాలో 260 గ్రామపంచాయతీలు, 2268 వార్డు సభ్యులు ఉండగా 1734 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబందించి 200 మంది ఓటర్లు ఉన్నవరకు 1,734 పోలింగ్ కేంద్రాలు, 400 ఓటర్ల వరకు 468 పోలింగ్ కేంద్రాలు, 650 ఓటర్ల వరకు ఉన్న పంచాయతీల్లో 76 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని సిద్ధం చేశారు. 200 మంది ఓటర్లు ఉన్న చోట ఒక ప్రిసైడింగ్ అధికారి ఒక పోలింగ్ అధికారి ఉంటారు. 201 నుంచి 400 వరకు ఒక ప్రిసైడింగ్ అధికారి ఇద్దరు పోలింగ్ అధికారులు, 401 నుంచి 650 వరకు ఉంటే ప్రిసైడింగ్ అధికారితో పాటు ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించారు. జిల్లాలో గ్రామపంచాయతీ, జిల్లా, మండల ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించి వేరువేరుగా ప్రకటించిన తుది ఓటరు జాబితా ప్రకారం .జిల్లాలో ఓటర్లు 3 లక్షల 53 వేల 351 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 1,70,772 మంది, మహిళలు 1,82,559 మంది ఉన్నారు. ఇందులో పురుషుల కంటే మహిళా ఓటర్లు 11,787 మంది అధికంగా ఉన్నారు.