Share News

బాలికలకు ఏదీ భద్రత?

ABN , Publish Date - Oct 29 , 2025 | 12:15 AM

గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. పాఠశాలలో బాలికలు వాష్‌రూమ్‌లో ఉన్న సమయంలో ఆ పాఠశాలకు చెందిన ఆఫీసు సబార్డినేట్‌ రహస్యంగా వీడియోలు చిత్రీకరించడమే కాకుండా వాటి ఆధారంగా బ్లాక్‌మెయిల్‌ చేస్తూ లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాలికలకు ఏదీ భద్రత?

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

గంగాధర మండలం కురిక్యాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. పాఠశాలలో బాలికలు వాష్‌రూమ్‌లో ఉన్న సమయంలో ఆ పాఠశాలకు చెందిన ఆఫీసు సబార్డినేట్‌ రహస్యంగా వీడియోలు చిత్రీకరించడమే కాకుండా వాటి ఆధారంగా బ్లాక్‌మెయిల్‌ చేస్తూ లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రులనే కాకుండా అందరిని కలవరపరుస్తున్నది. సంఘటనను సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్‌ పమేలా సత్పతి, సీపీ గౌస్‌ఆలం స్పందించి నిందితుడిని కటకటాల వెనక్కి పంపించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమలను సస్పెండ్‌ చేసి ఉపాధ్యాయులందరికీ షోకాజు నోటీసులు జారీ చేశారు. నిందితుడు ఆఫీసు సబార్డినేట్‌ యాకూబ్‌ పాషాను సస్పెండ్‌ చేసి పోక్సో కేసు అరెస్టు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

ఫ వారం క్రితమే వెలుగులోకి వచ్చినా..

వేధింపుల విషయం వారంరోజుల క్రితమే వెలుగులోకి వచ్చినా విషయం బయటకి వస్తే పాఠశాల పరువు పోతుందని, తాము కూడా బాధ్యులం కావలసి వస్తుందని ప్రధానోపాధ్యాయురాలు ఫిర్యాదు చేయలేదనిఇ సమాచారం. బాఽధిత బాలికలు తమ తల్లిదండ్రులకు విషయం తెలపడంతో వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ పమేలాసత్పతి, సీపీ గౌస్‌ఆలంతో చర్చించి సున్నితమైన అంశం కావడంతో రహస్యంగా విచారణ జరిపించారు. సబార్డినేట్‌ యాకూబ్‌ భాషా కొద్దిరోజులుగా బాధిత విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, శరీర భాగాలను తాకుతూ వారి ఫొటోలు మార్పింగ్‌ చేశానని బెదిరించాడని ఫిర్యాదు వచ్చింది. కలెక్టర్‌ బాలికలు, మహిళా సంక్షేమ అధికారి, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు, మండల విద్యాధికారి, ఎంపీడీవోను పాఠశాలకు పంపించివిచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వారు జరిపిన విచారణలో ఫిర్యాదులో పేర్కొన్న అభియోగాలు నిజమని తేలడంతో ఈనెల 27న సాయంత్రం ప్రధానోపాధ్యాయురాలు ద్వారా గంగాధర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. పోక్సో, ఐటీ, బీఎన్‌ఎస్‌ చట్టాల్లోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కరీంనగర్‌ రూరల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ విజయ్‌కుమార్‌ దర్యాప్తు చేపట్టారు. వారి విచారణలో కూడా లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నిజమని తేలడంతో మంగళవారం కరీంనగర్‌ రేకుర్తి చౌరస్తా వద్ద నిందితుడు యాకూబ్‌ బాషాను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. యాకూబ్‌ బాషాను కేసు నమోదైన వెంటనే సస్పెండ్‌ చేశారు. విచారణ జరిపిన అధికారుల బృందం ప్రధానోపాధ్యాయురాలు కమల జరిగిన సంఘటనను దాచిపెట్టాల్సిందిగా పాఠశాల సిబ్బందిని బెదిరించారని, విద్యార్థినుల భద్రతను విస్మరించారని, జరిగిన సంఘటన ఉన్నతాధికారులకు తెలపకుండా వాస్తవాలను దాచారని నివేదికలో పేర్కొనడంతో ఆమెను కలెక్టర్‌ విధులను తప్పిస్తూ సస్పెండ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అమలులో ఉన్నంత కాలం ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్‌ వదిలి వెళ్లవద్దని ఆదేశించారు. పాఠశాలలో పనిచేస్తున్న మిగతా ఉపాధ్యాయులందరికీ షోకాజ్‌ నోటీసు జారీచేశారు. పాఠశాల ఉపాధ్యాయులతోపాటు సిబ్బంది అందరినీ మూకుమ్మడిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లైంగిక వేధింపుల ఘటనలో పాత్ర ఉన్నట్లు తేలితే ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిపై కూడా పోక్సో కేసు నమోదు చేస్తారని చెబుతున్నారు. కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకొని చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో జరిగిన అమానవీయ ఘటన వెలుగులోకి రావడంతో విద్యార్థులతో తల్లిదండ్రులతోపాటు బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాఠశాల ఎదుట, గంగాధర మండల కేంద్రంలో ఆందోళన నిర్వహించారు.

ఫ సంఘటనపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆరా

ఈ సంఘటన విషయమై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌తో మాట్లాడాడు. విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశం అయినందున కేసును జాగ్రత్తగా, సమగ్రంగా దర్యాప్తు చేయాలని, అటెండర్‌ యాకూబ్‌భాషాతోపాటు ఇతరులెవరి ప్రవేయం ఉంటే వారిపైన కూడా పోక్సో కేసు నమోదు చేసేందుకు వెనుకాడవద్దని సూచించారు. విద్యార్థినుల తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు అధికారులు నిమగ్నమయ్యారని అన్నారు.

ఫ నిందితులెవరైనా వదిలిపెట్టద్దు

- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కురిక్యాల పాఠశాలలో బాలికల లైంగిక వేధింపుల ఘటనలో నిందితులెవరైనా వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్‌, పోలీసు కమిషనర్‌కు సూచించారు. దేవాలయం లాంటి పాఠశాలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం విచారకరమని, సమగ్ర విచారణ జరిపించి బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఫ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం

సీపీ గౌస్‌ఆలం

పాఠశాలలో బాలికలతో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో పాఠశాలలో పనిచేస్తున్న ఆఫీసు సబార్డినేటర్‌ యాకూబ్‌భాషాను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసు కమిషనర్‌ గౌస్‌ఆలం తెలిపారు. ఈ ఘటనపై మరింత సమగ్రంగా విచారణ జరిపించి సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నామని, ఈ ఘటనతో సంబంధం ఉన్న అందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. చాలా రోజులుగా జరుగుతున్న ఈ ఘటన వివరాలను ఉన్నతాధికారులకు తెలుపక పోవడం కూడా నేరంలో భాగం పంచుకున్నట్లుగానే పరిగణించి వారిపై కూడా చట్టపరమైన చర్యలుంటాయని అన్నారు. ఇలాంటి ఘటన జరిగితే వెంటనే చైల్ద్‌ వెల్ఫేర్‌ కమిటీకి, ఉన్నతాధికారులకు సమాచారమివ్వాలని సూచించారు.

బాలికల భద్రతపై నిర్లక్ష్యాన్ని సహించబోం....

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ళ శారద

విద్యాసంస్థల్లో చదువుకునే బాలికల భద్రత, గౌరవంపై నిర్లక్ష్యాన్ని ఏ రూపంలోనూ సహించబోమని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద స్పష్టం చేశారు. జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై అటెండర్‌ అనుచిత ప్రవర్తను ఆమె మంగళవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. విద్యాసంస్థలు విద్యార్ధినుల భవిష్యత్తు నిర్మాణంలో కీలకమైనవని, అవి స్వేచ్ఛాయుత, సురక్షిత, గౌరవప్రదమైన వాతావరణంలో ఉండాలన్నారు. విద్యార్థినులపై ఎలాంటి వేధింపులు, అనుచిత ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, పోలీసు అధికారులు ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించేందుకు, జిల్లా యంత్రాంగం కళాశాలలు, విద్యాసంస్థలు, హాస్టళ్లలో తనిఖీలు చేపట్టి భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసు పురోగతిని మహిళా కమిషన్‌ పర్యవేక్షిస్తుందని, బాధిత విద్యార్థినులకు అన్ని విధాల సహకారం అందిస్తామని చైర్‌పర్సన్‌ హామీ ఇచ్చారు.

Updated Date - Oct 29 , 2025 | 12:15 AM