ఏదీ ఫుడ్ సేఫ్టీ?
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:48 AM
కరీంనగర్ క్రైం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో స్వీట్ షాపుల్లోకి వెళ్లి స్వీట్లు, ఇతర ఆహారపదార్థాలు తీసుకుంటున్నారా?... జాగ్రత్తసుమా... స్వీట్లపై ప్రమాదకరమైన బల్లుల మలం, స్వీట్ల తయారీకి ఉపయోగించే పాలలో ఈగలు, దోమలు ఉంటున్నాయి. స్వీట్లు తయారు చేసే దుకాణాల్లో డ్రైనేజీ సిస్టం సరిగాలేకపోవడంతో ఎక్కడి మురికి అక్కడే ఉండి తీవ్ర దుర్వాసన వెలువడుతున్నది.
- స్వీట్ షాపుల్లోని పాలలో ఈగలు, దోమలు
- పరిమితికి మించి కృత్రిమ రంగులు
- ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో వెలుగులోకి...
కరీంనగర్ క్రైం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో స్వీట్ షాపుల్లోకి వెళ్లి స్వీట్లు, ఇతర ఆహారపదార్థాలు తీసుకుంటున్నారా?... జాగ్రత్తసుమా... స్వీట్లపై ప్రమాదకరమైన బల్లుల మలం, స్వీట్ల తయారీకి ఉపయోగించే పాలలో ఈగలు, దోమలు ఉంటున్నాయి. స్వీట్లు తయారు చేసే దుకాణాల్లో డ్రైనేజీ సిస్టం సరిగాలేకపోవడంతో ఎక్కడి మురికి అక్కడే ఉండి తీవ్ర దుర్వాసన వెలువడుతున్నది. ఈ విషయాలన్నీ బుధవారం కరీంనగర్ ఫుడ్ సేఫ్టీ అధికారులు మూడు స్వీట్ షాపుల్లో జరిపిన తనిఖీల్లో వెలుగు చూశాయి. కొందరు వ్యాపారులు కాసులకు కక్కుర్తిపడి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. నాణ్యతలేని ఆహారపదార్థాలతో తీవ్రమైన జబ్బుల బారినపడుతూ ఆర్థికంగా, శారీరకంగా, అన్ని రకాల ప్రజలు నష్టపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీలు, స్వీట్ షాపులు, ఇతర ఆహారపదార్థాలు విక్రయించే వారు పరిశుభ్రతను పాటించడంలేదనే విషయం గతంలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో వెల్లడైంది. అయినా వ్యాపారుల వైఖరిలో మార్పు రావడం లేదు. ఈ అక్రమ కల్తీ, నాణ్యత లేని, నకిలీ దందాలను అరికట్టాల్సిన ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించకుండా ఫిర్యాదులు అందిన సందర్భంలోనే దాడులు చేస్తున్నారనే విమర్శలున్నాయి.
ఫ నామమాత్రంగా కేసులు
కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్న వ్యాపారులపై నామమాత్రంగా కేసులు నమోదు చేసి, జరిమానాలతో సరిపెడుతుండడంతో నాణ్యతలేని వస్తువులు తయారు చేసేవారికి భయంలేకుండా పోతున్నదని ప్రజలు విమర్శిస్తున్నారు. కరీంనగర్‌లో ఇటీవల విజిలెన్స్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంత కాలం క్రితం టాస్క్‌ఫోర్స్, సివిల్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కల్తీ తినుబండారాలు, నాసిరకం పప్పు దినుసులు, పశువుల కొవ్వుతో తయారైన వనస్పతి, కల్తీ ఇంజన్ ఆయిల్, నకిలీ డిస్టిల్డ్ వాటర్, నకిలీ వాహన విడి భాగాలు, కల్తీ పెట్రోల్, డీజిల్, చివరకు పశువుల ఔషధాలలో కూడా నకిలీ దందాలు వెలుగుచూశాయి. కరీంనగర్‌లో కొంతకాలం క్రితం ఫుడ్‌సేఫ్టీ అధికారు పలు హోటళ్లు, బేకరీలు, ఇతర ఆహార తయారీ కేంద్రాలను తనిఖీ చేయగా ఆహారపదార్థాల తయారీలో కృత్రిమ రంగుల వాడుతున్నట్లు గుర్తించారు. కేక్‌లు, ఇతర బేకరీ పదార్థాల్లో గడువు ముగిసిన రంగులు వాడుతున్నట్లు వెల్లడైంది. కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంతో హెచ్చరించారు. అయినా వ్యాపారులు తమ తీరు మార్చుకోవడం లేదు. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఫ కలుషిత ఆహారంతో వ్యాధులు
ప్రతి సంవత్సరం లక్షలాది మంది కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆహార సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు, రసాయన కలుషితాలతో వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులు విషపూరితమైనవి.
ఫ కరీంనగర్‌లోని స్వీట్‌షాపుల్లో ఫుడ్‌సేఫ్టీ దాడులు....
రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాలతో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఖలీల్, గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రోహిత్‌రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్‌రెడ్డి బృందం కరీంనగర్‌లోని అనిల్ స్వీట్స్ బేకరి (టవర్ సర్కిల్), ఆనంద్ స్వీట్స్ (టవర్ సర్కిల్), మహారాజా స్వీట్ (ముకరంపుర)లో బుధవారం దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్వీట్స్ తయారు చేసే కిచెన్ అపరిశుభ్రంగా ఉందని, తయారు చేసిన స్వీట్స్ భద్రపరచడంలో లోపాలు ఉన్నాయని ఫుడ్‌సేఫ్టీ అధికారులు తెలిపారు. స్వీట్స్‌పైన బళ్లుల మలం గుర్తించామని, స్వీట్స్ తయారీ కిచెన్‌లో డైన్రేజ్ బ్లాక్ అవడంతో దుర్వాసన వెదజల్లుతోందన్నారు. కిచెన్‌లో నిలువ ఉంచిన పాలలో ఈగలు, దోమలు పడి ఉన్నాయని తెలిపారు. స్వీట్స్ తయారీలో పరిమితికి మించి కృత్రిమ రంగులు ఉపయోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. స్వీట్స్ తయారీ చేసేటప్పుడు సిబ్బది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నారు. ఆనంద్ స్వీట్స్, మహారాజా స్వీట్స్‌లో లోపాలు గుర్తించిన స్వీట్స్‌ను వెంటనే పారవేశామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. ఆనంద్ స్వీట్ హౌస్‌లో 20 లీటర్ పాలను పారబోశామని, మహారాజా స్వీట్స్‌లో 10 కిలోల బాదుషా, మూడు కిలోల కారా పారవేసినట్లు తెలిపారు. తనిఖీ చేసిన స్వీట్స్ షాప్‌లలో శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామన్నారు.