Share News

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేసుకోవాలి

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:24 AM

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులు నిర్మాణాలను పూర్తిచేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమా ర్‌ ఝా పిలుపునిచ్చారు.

ఇందిరమ్మ ఇళ్లు త్వరగా పూర్తి చేసుకోవాలి

చందుర్తి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులు నిర్మాణాలను పూర్తిచేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సందీప్‌కుమా ర్‌ ఝా పిలుపునిచ్చారు. చందుర్తి మండలకేంద్రంతో పాటు కట్ట లింగంపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్‌ గురువారం పరిశీలించారు. మండల కేంద్రంలో పోంశేట్టి లక్ష్మి, కట్టలింగంపేటలో పల్లికొండ మౌనిక, మారుపాక నర్సవ్వ, కొంక సృజన అనే లబ్ధిదారులతో కలెక్టర్‌ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు దీపావళిలోగా పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు క్యాప్చర్‌ చేస్తూ ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని, లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫు నుంచి ఆర్థికసహాయం సకాలంలో అందేలా అధికారులు చూడాలని, పెండింగ్‌ ఉండకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని, ఇసుక తీసుకె ళ్లేందుకు కూలీ, రవాణా చార్జీలు మాత్రమే లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఎక్కడైనా 1500కంటే ఎక్కువ ట్రాక్టర్‌ ఇసుక సరఫరా కోసం వసూలు చేస్తే అధికారుల దృష్టికి తీసుకుని రావాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఇసుక కోసం ఇబ్బందులు ఎదురైతే సంబంధిత తహసీల్దార్లను సంప్రదించాలని, లబ్ధిదారులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కలెక్టర్‌ సూచించారు. ఆయన వెంట హౌసింగ్‌ పీడీ శంకర్‌రెడ్డి, ఏఈ, తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 12:24 AM