Share News

స్వశక్తి మహిళలకు ఇందిరమ్మ చీరలు..

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:07 AM

చీరలు ఎప్పుడెప్పుడు పంపిణీ చేస్తారా అని ఎదురు చూస్తున్న స్వశక్తి మహిళలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.

స్వశక్తి మహిళలకు ఇందిరమ్మ చీరలు..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

చీరలు ఎప్పుడెప్పుడు పంపిణీ చేస్తారా అని ఎదురు చూస్తున్న స్వశక్తి మహిళలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరిం చుకుని నవంబరు 19న ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగే శ్వర్‌రావు ప్రకటించారు. దీంతో జిల్లా అధికార యం త్రాంగం ఇందిరమ్మ చీరలను వచ్చే నెలలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించక ముందు నవంబరు 19వ తేదీన పంపిణీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినప్పటికీ, షెడ్యూల్‌ రావ డంతో అధికారికంగా ప్రకటించలేక పోయారు. ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు తాత్కాలికంగా ఆరు వారాల పాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల కోడ్‌ నిలిచిపోయింది. దీంతో స్వశక్తి సంఘాల మహిళలకు చీరలను పంపిణీ చేయాలని అధికారికంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు జిల్లాకు 75,204 చీరలు సరఫరా కాగా, వచ్చే నెల 15వ తేదీ కల్లా మొత్తం సరఫరా కానున్నాయని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణ కోసం వారికి ఏడాదంతా ఉపాధి కల్పించేందుకు గాను గత ప్రభుత్వ హయాంలో 18 ఏళ్ల వయసు నిండిన వారి నుంచి మొదలుకుని వృద్ధుల వరకు బతుకమ్మ చీరల పేరిట పండుగకు ముందు ఒక్కో మహిళకు ఒక చీర పంపిణీ చేశారు. ఆ చీరలు అంత నాణ్యతగా లేకపోవడంతో వాటిపై మెజారిటీ మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా మంది వాటిని కట్టుకోకుండా ఇతరత్రా అవసరాలకు ఉపయోగించారు. ఎక్కువగా చేన్ల వద్ద వన్యప్రాణులు రాకుండా ఉండేందుకు బెదురు కోసం కట్టారు. యేటా మహిళలకు చీరలు ఇచ్చే విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది. గత ఏడాది ప్రభుత్వం చీరలు పంపిణీ చేయక పోగా, ఈ ఏడాది చీరలు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఫ ఒక్కో మహిళకు రెండు చీరలు..

స్వశక్తి సంఘాల మహిళలందరి గౌరవం కోసం ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇచ్చింది. అయితే గతంలో 18 ఏళ్ల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు అందరికీ ఇచ్చినట్లు గాకుండా స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకే రెండు చీరలు ఇస్తున్నది. దీనికి పండుగ నేపథ్యం కాకుండా ఇందిరాగాంధీ జయంతిని పురస్క రించుకుని ఇందిరమ్మ చీరలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 1,12,992 మంది మహిళలు, పట్టణ ప్రాంతాల్లో 37,848 మంది మహిళలు మొత్తం 1,50,840 మంది దాదాపు 38 వేల స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా ఉన్నట్లు డీఆర్‌డీఓ అధికారులు గుర్తించారు. ఒక్కో మహిళకు రెండు చీరల చొప్పున 3,01,680 చీరలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జిల్లాకు 75,696 చీరలు సరఫరా అయ్యాయి. ఈ చీరలను వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని ఒక గోదాములో భద్రపరిచినట్లు డీఆర్‌డీఓ కాళిందిని, ఏపీడీ రవీందర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. మిగతా చీరలు నవంబర్‌ 15వ తేదీ లోపు సరఫరా కానున్నాయని పేర్కొన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 01:07 AM