పనులు ప్రారంభించని ఇందిరమ్మ ఇళ్ల రద్దు
ABN , Publish Date - Nov 05 , 2025 | 12:44 AM
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం చెక్ పెట్టింది. నిర్ణీత గడువు లోపు ఇళ్ల నిర్మాణాలు చేపట్టని ఇళ్లను రద్దు చేసి అర్హులైన ఇతరులకు మంజూరు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లాలో రద్దు ప్రక్రియను ఆరంభించారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం చెక్ పెట్టింది. నిర్ణీత గడువు లోపు ఇళ్ల నిర్మాణాలు చేపట్టని ఇళ్లను రద్దు చేసి అర్హులైన ఇతరులకు మంజూరు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లాలో రద్దు ప్రక్రియను ఆరంభించారు. మొదటి విడత మంజూరు చేసిన ఇళ్లలో ఇప్పటి వరకు 1017 ఇళ్లకు పైగా రద్దు చేశారు. వాటి స్థానంలో అర్హులైన జాబితాలో ఎమ్మెల్యేలు సూచించిన వారికి ఇళ్లను మంజూరు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుక వచ్చిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో కేవలం డబుల్ బెడ్ రూముల ఇళ్లను మాత్రమే మంజూరు చేసినప్పటికీ, వాటిని నిర్మించేందుకు కాంట్రాక్టర్లు పెద్దగా ముందుకు రాకపోవడంతో కేవలం కొన్ని చోట్ల మాత్రమే ఇళ్లు పూర్తయ్యాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మంథనిలో 74 మంది లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి, రాంపెల్లి వద్ద నిర్మించిన ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో పూర్తయిన ఇళ్ల ప్రాంగణాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించింది. అందులో భాగంగా పెద్దపల్లి నియోజక వర్గంలో 3.330 ఇళ్లు మంజూరు చేశారు. రామగుండం నియోజకవర్గంలో 1600 ఇళ్లు మాత్రమే మంజూరు చేశారు. మంథని నియోజకవర్గంలోని జిల్లాలో గల నాలుగు మండలాలకు 1750 ఇళ్లు కేటాయించగా, ఇప్పటి వరకు 900 ఇళ్లు మంజూరు చేశారు. ధర్మపురి నియోజకవర్గం పరిధిలో గల ధర్మారం మండలానికి 676 ఇళ్లు కేటాయించగా, మొత్తం మంజూరు చేశారు. మంజూరు చేసిన ఇళ్లలో 4,297 ఇళ్లకు సంబంధిత హౌజింగ్ అధికారులు మార్కవుట్ చేయగా, 3,089 ఇళ్లు ప్రగతిలో ఉన్నాయి. ఇందులో 1,741 ఇళ్లు బేస్‌మెంట్ లెవెల్‌లో, 651 ఇళ్లు లెంటల్ లెవెల్‌లో, 668 ఇళ్లు స్లాబ్ లెవెల్‌లో నిర్మాణంలో ఉండగా, 23 ఇళ్లు పూర్తయ్యాయి.
ఫ గడువు మీరిన ఇళ్ల మంజూరు రద్దు...
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు ప్రోసీడింగ్‌లు జారీ చేసి, అధికారులు మార్కవుట్ చేసిన తర్వాత రోజు నుంచి 45 రోజుల వరకు పనులు ఆరంభించకుంటే ఆ ఇళ్లను రద్దు చేయా లని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ఆరంభించిన తర్వాత మొదటి విడత ఈ ఏడాది జనవరి 31న మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సర్వేలో అర్హులైన వారిని గుర్తించి ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో ఇళ్లను మం జూరు చేశారు. అందులో భాగంగా ధర్మారం మండలం బంజేరుపల్లి, కమాన్‌పూర్ మండలం రొంపికుంట, ముత్తారం మండలం మచ్చుపేట, రామగిరి మండలం రత్నాపూర్, ఎలిగేడు మండలం శివపెల్లి, జూలపల్లి మండలం కోనరావుపేట, ఓదెల మండలం షానగొండ, పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలం అంకంపల్లి, సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి, అంతర్గాం మండలం మద్దిర్యాల, పాలకుర్తి మండలం రామారావుపల్లి, మంథని మండలం అడవి సోమన్‌పల్లి గ్రామాలను ఎంపిక చేసి 1951 ఇళ్లు మంజూరు చేశారు. ఎనిమిది మాసాల వరకు కూడా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను చేపట్టకపోవడంతో ఆ ఇళ్లను ఇటీవల రద్దు చేశారు. బంజేరుపల్లిలో 33 ఇళ్లు, రొంపికుంటలో 127 ఇళ్లు, మచ్చుపేటలో 11 ఇళ్లు, రత్నాపూర్‌లో 171 ఇళ్లు, శివపల్లిలో 47 ఇళ్లు, కోనరావు పేటలో 106 ఇళ్లు, షానగొండలో 177 ఇళ్లు, నిమ్మన పల్లిలో 93 ఇళ్లు, అంకంపల్లిలో 79 ఇళ్లు, కాట్నపల్లిలో 86 ఇళ్లు, మద్దిర్యాలలో 35 ఇళ్లు, రామారావుపల్లిలో 52 ఇళ్లను రద్దు చేసినట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ రాజేశ్వర్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వాటి స్థానంలో పట్టణ ప్రాంతాల్లో అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.