పూడికతీతతో ప్రాజెక్టుల సామర్ధ్యం పెంపు
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:59 PM
పూడికతీతతో ప్రాజెక్టుల సామర్థ్యం పెరుగుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
తిమ్మాపూర్, డిసెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): పూడికతీతతో ప్రాజెక్టుల సామర్థ్యం పెరుగుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రేణికుంట గ్రామం వద్ద లోయర్ మానేరు డ్యాం బ్యాక్ వాటర్ వద్ద అధునాతన సాంకేతిక టెక్నాలజీ ద్వారా చేపట్టిన పూడికతీత పనులను మంత్రి వివేక్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అక్కడ ఉన్న అధికారులను, ఏజెన్సీ వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టు, లోయర్ మానేరు, మిడ్ మానేరు డ్యాంలలో పూడిక పేరుక పోవడంతో నీటి నిల్వలు తగ్గుతున్నాయన్నారు. నూతన టెక్నాలజీతో ప్రాజెక్టుల్లో పూడిక తీయడం ద్వారా ప్రాజెక్టుల సామర్ధ్యం పెరుగుతుందన్నారు. దీంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఇసుక, మట్టి వేరు చేసే విధానం పరిశీలించినట్లు తెలిపారు.