పెరుగుతున్న జ్వర పీడితులు
ABN , Publish Date - Aug 08 , 2025 | 01:07 AM
జిల్లాలో రోజురోజుకూ జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీల సంఖ్య సైతం ఎక్కువవుతోంది.
జగిత్యాల, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోజురోజుకూ జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీల సంఖ్య సైతం ఎక్కువవుతోంది. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహిస్తోంది. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ప్రతి ఇంటికి వెళ్లి జ్వరం లక్షణాలు ఉన్న వారికి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. బాధితులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులను సైతం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వారంలో ఒక రోజు విధిగా డ్రైడేగా పాటించాలని ప్రచారం చేస్తూ మలేరియా, డెంగీలతో పాటు సీజనల్ వ్యాధులను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సర్వే నివేదికను ప్రతీ రోజు హైదరాబాద్ వైద్య ఆరోగ్య శాఖకు పంపుతున్నారు.
ఫబాధితులకు పరీక్షలు
జిల్లా వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన జ్వర సర్వేలో 16,728 మంది బాధితులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. జిల్లాలో 2,60,516 కుటుంబాలు ఉండగా, 10,98,959 జనాభా ఉంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు ఏరియా ఆసుపత్రులు, పీహెచ్‌సీలు, ఇతర ప్రభుత్వ వైద్య శాలలో 3,05,589 మందికి ఓపీ సేవలు అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కోరుట్ల ఏరియా ఆసుపత్రి పరిధిలో అత్యధికంగా 5,216 మంది, జగిత్యాలలోని జనరల్ ఆసుపత్రి పరిధిలో 1,420 మంది, ధర్మపురి సీహెచ్‌సీలో 2,323 మంది, రాయికల్ సీహెచ్‌సీలో 1,315 మంది జ్వర పీడితులు ఉన్నారు. మెట్‌పల్లి సీహెచ్‌సీలో 833 మంది జ్వర పీడితులను గుర్తించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యధికంగా కల్లెడ పీహెచ్‌సీ పరిధిలో 605 మంది, అయిలాపూర్ పీహెచ్‌సీ పరిధిలో 531 మంది జ్వరపీడితులు ఉండగా, అత్యల్పంగా కొడిమ్యాల పీహెచ్‌సీ పరిధిలో 126 మంది బాధితులు ఉన్నట్లు సర్వేలో తేల్చారు. జిల్లా వ్యాప్తంగా పలు పట్టణాలు, పల్లెల్లో గృహాలను సందర్శించి ప్రమాదకరమైన దోమల వృద్ధికి కారణమయ్యే లార్వా ఉన్నట్లుగా గుర్తించారు.
ఫవైద్య శిబిరాలు ఏర్పాటు
జిల్లాలో చేపడుతున్న సర్వే ద్వారా జ్వర పీడితులను ముందుగా గుర్తించి కట్టడికి ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో 24 మంది మెడికల్ ఆఫీసర్లు, 754 మంది ఆశా కార్యకర్తలు, 80 మంది సూపర్‌వైజర్లు, 268 మంది ఏఎన్‌ఎంలు, 101 మంది ఎంఎల్‌హెచ్‌పీలు 28 మంది హెల్త్ అసిస్టెంట్లు బృందాలుగా ఏర్పడి సర్వే చేస్తున్నారు. అనుమానితుల రక్త నమూనాలు సేకరించి మలేరియా, డెంగీ, చికున్ గున్యా మొదలైన జ్వరాల నిర్ధారణ కోసం ఎన్‌ఎస్-1, ఎన్‌ఎస్-ఎలీసా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరమైన రోగులకు మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రులకు తరలిస్తున్నారు. జిల్లాలో వర్షాకాలం ముగిసే వరకు విడతల వారీగా జ్వరాల సర్వేను చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
జిల్లాలో ఇప్పటి వరకు నిర్వహించిన సర్వే ఆధారంగా బాధితులను బట్టి మెడికల్ క్యాంపులు పెడుతున్నారు. ఇందులో జ్వర పీడితులను గుర్తించి మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
ఫపరిసరాల పరిశుభ్రతపై అవగాహన
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పలు ఇళ్లలో కూలర్లలో నిల్వ ఉన్న నీరు, పాత డబ్బాలు, పూల కుండీల్లో ఉన్న నీటిని ఎప్పటికప్పుడు దగ్గరుండి పారబోయిస్తున్నారు. దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలని, కిటీలకు, తలుపులకు మెష్‌లను ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. యాంటి లార్వా ద్రావణాలను పిచికారి చేయిస్తున్నారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
-డాక్టర్ నీలారపు శ్రీనివాస్, జిల్లా కీటక జనిత వ్యాదుల నియంత్రణ అధికారి, జగిత్యాల
జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఫీవర్ సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ఇంటింటికీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది వెళ్లి సర్వే చేస్తున్నారు. జ్వర పీడితులను గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నాం. డ్రైడే, ఫ్రైడే కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం.