Share News

పెరుగుతున్న సిజేరియన్లు

ABN , Publish Date - Mar 14 , 2025 | 01:18 AM

జిల్లాలో ప్రసవాలకు ఆసుపత్రులకు వెళితే ఎక్కువగా శస్త్ర చికిత్సలే చేస్తున్నారని ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

పెరుగుతున్న సిజేరియన్లు

జగిత్యాల, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రసవాలకు ఆసుపత్రులకు వెళితే ఎక్కువగా శస్త్ర చికిత్సలే చేస్తున్నారని ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గర్భిణులకు సాధారణ కాన్పు చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నా పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఆపరేషన్లు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి ఎక్కువ శాతం ఆపరేషన్ల ద్వారానే ప్రసవాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు చేయడంతో మహిళలు భవిష్యత్తులో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరియైున కారణం లేకుండా శస్త్ర చికిత్సలు చేస్తే నోటీసులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఒక్కో శస్త్ర చికిత్సకు రూ.50 వేల నుంచి రూ.1.20లక్షల వరకు వసూలు చేస్తున్నారు.

జిల్లాలో పరిస్థితి ఇలా...

జిల్లా వ్యాప్తంగా ఒక ప్రధాన ఆసుపత్రి, ఒక మాతా శిశు సంరక్షణ కేంద్రం, 4 తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రులు, 19 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, 151 ఆరోగ్య ఉప కేంద్రాలు, 24 గంటలు పనిచేసే 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా ఆరోగ్య సేవలను ప్రభుత్వం అందిస్తోంది. వీటికి తోడు సుమారు 300 వరకు ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 80 శాతం సిజేరియన్లు చేస్తున్నారు. సాధారణ ప్రసవం చేస్తే వైద్యులకు ఎక్కువ డబ్బులు రావన్న కారణంతో కొంతమంది సిజేరియన్లు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. సాధారణ ప్రసవంలో కొన్నిసార్లు బిడ్డ మెడకు పేగులు పెనవేసుకోవడం, విరేచనం మింగడం, ప్రాణ వాయువు అందకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయన్న అభిప్రాయాలతో శస్త్ర చికిత్సలను వైద్యులు ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ సాధారణ ప్రసవాలు తగ్గడం విస్మయానికి గురిచేస్తోంది.

శస్త్ర చికిత్సలతో కలిగే దుష్పరిణామాలు

శస్త్ర చికిత్స ప్రసవాలతో ఎక్కువగా తల్లీ బిడ్డలు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తోంది. రక్తస్రావం అధికమైనా, ఇతరత్రా సమస్యలు తలెత్తినా ప్రాణాపాయంతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కొనాల్సి రావచ్చును. గర్భాశయానికి గాట్లు పెట్టి కుట్టు వేసిన ప్రాంతంలో మాయ అతుక్కుపోయే అవకాశాలుంటాయి. దీంతో అప్పుడప్పుడు కడుపు నొప్పి సమస్యలు తలెత్తవచ్చు. కొన్ని సందర్బాల్లో గర్భ సంచి తొలగించే పరిస్థితి ఏర్పడవచ్చు. శస్త్ర చికిత్స సమయంలో గర్భ సంచి పక్కన ఉండే మూత్రాశయం దెబ్బతింటే రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

సాధారణ ప్రసవాలతో ప్రయోజనాలు

సాధారణ ప్రసవాల్లో మహిళలు రెండు రోజుల్లోనే ఎప్పటిలా పనులు చేసుకోవడానికి వీలుంటుంది. రెండో కాన్పుపై దుష్ప్రభావం ఉండదు. గర్భసంచికి ప్రమాదం ఉండదు. భవిష్యత్తులో రుగ్మతలకు గురికాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. పుట్టిన బిడ్డకు సైతం మొదటి గంటలో తల్లి పాలు అందించవచ్చును. తద్వారా ఇటు తల్లికి అటు బిడ్డకు మంచి ఆరోగ్య అందే అవకాశాలుంటాయి. ఒక వేళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయితే ప్రోత్సాహక నగదు సైతం అందుతుంది.

ఫకత్తెరకు కట్టడి చేస్తేనే...

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందించాయి. రాష్ట్రంలోనే అధిక సిజేరియన్లు చేస్తున్న జాబితాలో జగిత్యాల జిలా ఉందని, ఇందులో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించారు. గర్భిణులకు శస్త్ర చికిత్స జరపడానికి విధిగా అనుమతి తీసుకోవాలన్న నిబంధనను ముందుకు తెస్తున్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంలో భాగంగా ఆయుష్మాన్‌ భారత్‌ ఎన్‌హెచ్‌పీఎం (కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం) తీసుకొచ్చారు. మొత్తం ప్రసవాల్లో 30 శాతం మాత్రమే శస్త్ర చికిత్సలు జరగాలని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రైవేటులో జరుగుతున్న శస్త్ర చికిత్సలకు సంబంధించి ప్రతీ నెల నివేదికలను అందించాలని ఆదేశించింది. ప్రతి నర్సింగ్‌ హోం యాజమాన్యం విధిగా ఆ గర్భిణి ఆరోగ్య పరిస్థితి, సాధారణ ప్రసవానికి ఎదురయ్యే అడ్డంకుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తే శస్త్ర చికిత్సలు తగ్గే అవకాశాలున్నాయి.

Updated Date - Mar 14 , 2025 | 01:19 AM