Share News

ఇందిరమ్మ ఇళ్లలో పెరిగిన రాజకీయ జోక్యం

ABN , Publish Date - May 16 , 2025 | 11:54 PM

ఇందిరమ్మ ఇళ్లలో రాజకీయ జోక్యం బాగా పెరిగిపోయిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌ పట్టణ శివారులోని గణేష్‌నగర్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిరుపేదలకు కేటాయించాలని నిరసన చేపట్టారు.

ఇందిరమ్మ ఇళ్లలో పెరిగిన రాజకీయ జోక్యం

హుజూరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్లలో రాజకీయ జోక్యం బాగా పెరిగిపోయిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హుజూరాబాద్‌ పట్టణ శివారులోని గణేష్‌నగర్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిరుపేదలకు కేటాయించాలని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని భారీగా పోలీసు బలగాలు మోహరించారు. సీపీఐ కార్యకర్తలు ర్యాలీగా రాగా, గంటపాటు హుజూరాబాద్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ కనకయ్య సీపీఐ నాయకుల నుంచి వినతిపత్రం స్వీకరించారు. నెల రోజుల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్‌ పట్టణంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను గత ప్రభుత్వం పంపిణీ చేయకపోగా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్న పట్టించుకోవడం లేదన్నారు. పాలకులు పేదరికాన్ని పెంచి పోషించడం వల్ల ఇప్పటికీ ఇల్లు లేని వాళ్లు ఉన్నారంటే వారు సిగ్గు పడాలన్నారు. ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లలో నాలుగు చక్రాల వాహనాలు ఉంటే అనర్హులుగా ప్రకటించడం శోచనీయమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలు తప్పుల తడకగా ఉన్నాయన్నారు. నిరుపేదలకు నెల రోజుల్లో ఇళ్లు కేటాయించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, నాయకులు సృజన్‌, అశోక్‌, రాజు, శ్రీనివాస్‌, వెంకటేష్‌, శారద, జి రవి, రాములు, కల్యాణ్‌, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2025 | 11:54 PM