పెరిగిన పత్తి విత్తనాల ధరలు
ABN , Publish Date - May 27 , 2025 | 12:22 AM
మూడేళ్లుగా చీడ పీడల బెడదతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. మార్కెట్లో పత్తికి ధర ఏడువేలకు మించి పలకకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు.
హుజూరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): మూడేళ్లుగా చీడ పీడల బెడదతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. మార్కెట్లో పత్తికి ధర ఏడువేలకు మించి పలకకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. పంట దిగుబడి సరిగా రాలేదు. అసలే ఇబ్బందుల్లో ఉన్న పత్తి రైతులపై కేంద్ర ప్రభుత్వం అదనపు భారం మోపింది. ఈసారి పత్తి వ విత్తనాల ధర ప్యాకెట్‌కు 37 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. హుజూరాబాద్ డివిజన్‌లోని జమ్మికుంట, హుజూరాబాద్, వీణవంక, ఇల్లందకుంట, శంకరపట్నం, సైదాపూర్ మండలాలు ఉన్నాయి. 1.2 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా, అందులో 20వేల ఎకరాల్లో బీటీ-2 పత్తి సాగు చేస్తారు. ఈ సారి కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం కంటే ఒక్కో ప్యాకెట్‌పై 37 రూపాయల ధర పెంచింది. 2024 సంవత్సరంలో బీటీ-2 పత్తి విత్తనానికి ఒక ప్యాకెట్‌కు 864 ధర ఉండగా, ప్రస్తుతం 37 రూపాయలు పెంచి 901 రూపాయలుగా నిర్ణయించింది. డివిజన్‌లో 20 వేల ఎకరాల్లో పత్తి సాగు అవుతుండగా, ఒక ఎకరాకు రెండు పత్తి ప్యాకెట్లు అవసరమవుతాయి. విత్తనాలు పెట్టిన తర్వాత వర్షాలు సమృద్ధిగా కురిస్తే 65 శాతం మాత్రమే మెలకెత్తుతాయి. మళ్లీ పోగుంటలకు పత్తి గింజలు అవసరం ఉంటాయి. మొత్తం 30వేల పత్తి ప్యాకెట్లు హుజూరాబాద్ డివిజన్‌కు అవసరమవుతాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు దుకులు దున్ని భూమిని సిద్ధం చేసుకుంటున్నారు. కొంత మంది రైతులు విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు.
ఫ లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి.
- సునీత, ఏడీఏ, హుజూరాబాద్
రైతులు పత్తి విత్తనాలను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయకుండా లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే విత్తనాలను కొనుగోలు చేయాలి. రసీదును జాగ్రత్తగా దాచుకోవాలి. బీటీ-2 పత్తి విత్తనాలు హుజూరాబాద్ డివిజన్‌లో అందుబాటులో ఉన్నాయి. మొదటి వర్షానికే రైతులు విత్తనాలు విత్తి నష్టపోవద్దు. అదును చూసి పత్తి విత్తనాలు వేసుకోవాలి.
2018 నుంచి బీటీ-2 పత్తి విత్తనాల ధరలు
==============================
సంవత్సరం ధర (ప్యాకెట్‌కు రూ.లో)
2018 690
2019 710
2020 730
2021 767
2022 810
2023 853
2024 864
2025 901