Share News

ముఖ గుర్తింపుతో పెరిగిన హాజరు

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:51 AM

ఇంటర్మీడియట్‌ స్థాయిలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లాస్థాయి అధికారులతో పాటు ఇంటర్మీడియట్‌ బోర్డు పర్యవేక్షిస్తోంది.

ముఖ గుర్తింపుతో పెరిగిన హాజరు
జగిత్యాల బాలికల జూనియర్‌ కళాశాలలో హాజరు నమోదు చేస్తున్న అధ్యాపకురాలు

- ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఫలితమిస్తున్న ఎఫ్‌ఆర్‌సీ

- గైర్హాజరైతే తల్లిదండ్రులకు సమాచారం

- జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు...ఐదు వేల మంది విద్యార్థులు

జగిత్యాల, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ స్థాయిలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లాస్థాయి అధికారులతో పాటు ఇంటర్మీడియట్‌ బోర్డు పర్యవేక్షిస్తోంది. అధ్యాపకులతో పాటు సిబ్బందికి రోజుకు రెండుసార్లు ముఖగుర్తింపుతో హాజరు అమలు చేస్తోంది. దీంతో పాటు ప్రతినెలా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తుండటం సత్ఫలితాలను ఇస్తోంది.

పెరిగిన హాజరు...

ముఖ గుర్తింపు హాజరు కోసం ఇంటర్‌ బోర్డు అధికారులు టీజీబీఐఈ ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను తీసుకొచ్చారు. దీని ద్వారా ప్రస్తుతం ప్రతీరోజు విద్యార్థులకు హాజరు తీసుకుంటున్నారు. ఈ విధానం వల్ల గతంలో కంటే 10 నుంచి 15 శాతం విద్యార్థుల హాజరు శాతం పెరిగినట్లు అధికారులు అంటున్నారు. ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌కు అనుసంధానం చేస్తూ ముఖ గుర్తింపు హాజరును రూపొందించారు. విద్యార్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

సెల్‌ఫోన్లకు సంక్షిప్త సందేశం...

ముఖ గుర్తింపు హాజరు ద్వారా ఏ విద్యార్థి అయినా కళాశాలకు హాజరు కాకుంటే తల్లిదండ్రుల సెల్‌ఫోన్లకు సంక్షిప్త సందేశం వెళ్తోంది. ఈ హాజరును కళాశాల ప్రిన్సిపాల్‌, డీఐఈవో, రాష్ట్ర అధికారులు పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సంక్షిప్త సందేశం వెళ్లిన తర్వాత వారి తల్లిదండ్రుల నుంచి సంబంధిత కళాశాల అధ్యాపకులకు ఫోన్‌ రాకపోతే, కళాశాల అధ్యాపకులే వారితో ఫోన్‌లో మాట్లాడి కారణాలను తెలుసుకుంటున్నారు. ఇలా చాలారోజులు కళాశాలకు రాని విద్యార్థుల ఇళ్లకు అధ్యాపకులు వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడి చదువు విశిష్టతను తెలిపి కళాశాలకు పంపేలా చేస్తున్నారు. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల ముఖ గుర్తింపు హాజరు నిర్వహిస్తున్నారు.

Updated Date - Oct 25 , 2025 | 12:51 AM