భూముల విలువ పెంపు
ABN , Publish Date - Jul 09 , 2025 | 01:22 AM
రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్, రూరల్ ఏరియాల్లో భూములు, ఇళ్ల స్థలాల ధరలకు, రిజిస్ట్రేషన్ శాఖ మార్కెట్ విలువకు భారీ వ్యతాసం ఉంది. దీనిని సరిచేస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే భూములు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, ప్లాట్ల ధరల విలువలను భారీగా పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం.
కరీంనగర్ క్రైం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్, రూరల్ ఏరియాల్లో భూములు, ఇళ్ల స్థలాల ధరలకు, రిజిస్ట్రేషన్ శాఖ మార్కెట్ విలువకు భారీ వ్యతాసం ఉంది. దీనిని సరిచేస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే భూములు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, ప్లాట్ల ధరల విలువలను భారీగా పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటి వరకు భూముల విలువల సవరణకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేయలేదు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న భూములు, ఇతర ఆస్తుల మార్కెట్ ధరలనుబట్టి ఏ మేరకు రేట్లను సవరించుకునే వీలుంటుందో సూచిస్తూ జిల్లా అధికారయంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లా నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించి ఏ మేరకు మార్కెట్ విలువలను పెంచుతారనేది నిర్ణయించాల్సి ఉన్నది.
ఫ రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గే అవకాశం
ఆదాయం సమకూర్చేందుకు ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను పెంచడంతోపాటు రిజిస్ట్రేషన్ ఫీజును 1.5 శాతం వరకు తగ్గించాలనే ప్రతిపాదన ఉందని సమాచారం. మహిళకు మాత్రమే స్టాంపుడ్యూటీ తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్టాంపు డ్యూటీని తగ్గించి భూముల విలువలను పెంచితే ఎలాంట ఉంటుందనే అంశంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు విస్తృత కసరత్తులు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేశారు.
ఫ కలెక్టర్ చైర్మన్‌గా మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2021లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో మార్కెట్ విలువను 20 శాతం పెంచింది. 2022లో మళ్లీ 33 శాతం పెంచింది. అప్పటి నుంచి భూముల మార్కెట్ విలువను పెంచలేదు. రెండు సంవత్సరాలకు ఒకసారి భూములు, ఆస్తుల మార్కెట్ విలువలు పెంచేందుకు అవకాశం ఉంది. జిల్లాల్లో అర్బన్ ప్రాంతాల్లో కలెక్టర్ చైర్మన్‌గా అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో, సబ్‌రిజిస్ట్రార్లు సభ్యులుగా మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీలు ఏర్పాటు చేశారు. రూరల్ ఏరియాలో ఆర్డీవో చైర్మన్‌గా తహసీల్దార్, ఎంపీడీవో సభ్యులుగా, కన్వీనర్‌గా సబ్‌రిజిస్ట్రార్లతో కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు సమావేశమై ప్రస్తుతం జిల్లాల్లోని భూముల మార్కెట్ విలువకు ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ విలువకు వ్యత్యాసం ఎంత ఉందనేది నివేదికను స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఐజీకి పంపించినట్లు సమాచారం.
ఫ భారీ వ్యత్యాసం
ప్రస్తుతం కరీంనగర్ అర్బన్ ప్రాంతాల్లో భూములకు ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ గజానికి అత్యల్పంగా 4,000 వేల నుంచి అత్యధికంగా 36,900 వేల వరకు ఉంది. అదే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో గజానికి 700 నుంచి 4,100 రూపాయల వరకు విలువ ఉన్నది. బహిరంగ మార్కెట్‌లో దీని ధర చాలా రెట్లు ఉంటుంది. అర్బన్(టవర్‌సర్కిల్)లో బహిరంగమార్కెట్‌లో గజం స్థలం ధర లక్ష రూపాయల వరకు ఉండగా, గ్రామాల్లో (కొత్తపల్లి) 25 వేల నుంచి 30 వేల వరకు ఉంది. ప్రభుత్వ నిర్ధారిత విలువలకన్నా అధిక మొత్తంలో భూములు, ఆస్తుల క్రయవిక్రయాలు జరుగుతున్నా 90 శాతం మంది ప్రభుత్వ నిర్ధారిత విలువకే రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. మార్కెట్ విలువకన్నా చాలా తక్కువ ధరలు రిజిస్ట్రేషన్ విలువ ఉన్న కారణంగా బ్యాంక్ రుణాలు పొందడంలోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కరీంనగర్‌లో భూముల ధరలకు రెక్కలువచ్చి అమాంతం పెరిగాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పరిసర గ్రామాలు విలీనంతోపాటు ఉమ్మడి జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెకుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులు అధిక శాతం కరీంనగర్‌కు వచ్చి స్థిరపడ్డారు. మరో వైపు వ్యవసాయం ఊపందుకుంది. దీంతో వ్యవసాయ భూముల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఏడాదిన్నరగా రియల్‌ఎస్టేట్ పడిపోయి భూములు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గాయి. దీంతో రిజిస్ట్రేషన్లు తగ్గిపోయి ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది.
ఫ ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు
ప్రస్తుతం సేల్‌డీడ్‌కు మార్కెట్ వాల్యూపై స్టాంపు డ్యూటీ 5.5 శాతం, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ 1.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతంఉంది. మ్యుటేషన్ ఫీజు మున్సిపాలిటీల్లో మూడు వేలు, గ్రామపంచాయతీల్లో 800 రూపాయలు ఉంది. యూజర్ చార్జీల కింద 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. గిఫ్ట్‌డీడ్‌కు స్టాంపు డ్యూటీ రెండు శాతం, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ 0.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతం ఉంది. యూజర్ ఛార్జీలు 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. మార్ట్‌గేజ్ రుణాలకు బ్యాంక్ ఇచ్చే రుణం విలువలో స్టాంపు డ్యూటీ 0.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 0.1 శాతం, యూజర్ ఛార్జీలు 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎక్చైంజ్(రద్దుబదులు)కు సేల్‌డీడ్ మాదిరిగానే రిజిస్ట్రేషన్ ఫీజు వసులు చేస్తున్నారు. ప్రస్తుతం సేల్‌డీడ్‌కు మొత్తం 7.5 శాతం ఫీజు వసూలు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 13 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. ఈ కార్యలయాఓ్ల రోజుకు 300 నుంచి 350 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద ప్రభుత్వానికి రోజుకు 60 లక్షల నుంచి 70 లక్షల ఆదాయం వస్తున్నది. పెరగనున్న మార్కెట్ విలువతో రెట్టింపు ఆదాయం సమకూరే అవకాశముందని అంచనావేస్తున్నారు.