ఎడతెరిపి లేని వాన..
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:05 AM
అల్పపీడన ప్రభావంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
అల్పపీడన ప్రభావంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. బుధవారం మొదలైన వర్షం గురువారం కొనసాగింది. భారీ వర్ష సూచన జిల్లా అధికార అప్రమత్తమైంది. జిల్లాలో ఎక్కడా ప్రజలు ఇబ్బందులు పడకుండా, అవాంఛనీయ సంఘటన జరగకుండా, ప్రాణ, ఆస్తినష్టం లేకుండా ముందస్తుగానే చర్యలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. గురువారం జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మానేరు వాగు పరివాహక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద వరదలు చిక్కుకున్న ఏడుగురు సురక్షితంగా వైమానిక హెలికాప్టర్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం మరొకరిని సురక్షితంగా రక్షించారు. ఎగువమానేరు ప్రాజెక్టు వద్ద వరదలో చిక్కుకున్న రైతు పంపుకాడి నాగం వరద నీటిలో గల్లంతయ్యారు. మానేరు ప్రాజెక్టు వద్ద కేంద్ర హోమ్ శాఖ మంత్రి బండి సంజయ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహాయ చర్యలను పర్యవేక్షించారు. వరద ప్రాంతాన్ని మాజీ మంత్రి కే తారకరామారావు పరిశీలించారు. గల్లంతైన నాగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. జిల్లాలో వర్షం పరిస్థితిని నిరంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ కుమార్ బి గాతే పర్యవేక్షించారు.
ఫ ఎగువమానేరు నుంచి మధ్యమానేరు ప్రాజెక్టు వరకు వరద ఉధృతి
జిల్లాలోని గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టుకు కామారెడి జిల్లా పాల్వంచ, సిద్దిపేట జిల్లా నుంచి కూడేల్లి వాగుల నుంచి భారీ వరద నీరు చేరుతోంది. ఎగువ మానేరు ప్రాజెక్టు రెండు టీఎంసీల సామర్థ్యాన్ని మించి ఇన్‌ఫ్లో 85446 క్యూసెక్కుల వరద మీరు వస్తుండగా భారీగా మత్తడి దూకుతోంది. మానేరువాగు ద్వారా 85446 క్యూసెక్కుల నీళ్లు జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర మధ్యమనేరు ప్రాజెక్టులోకి వెళ్తుంది. సిరిసిల్ల మానేరు వాగు ఉధృతం వహిస్తుండగా వాగు ఇరువైపులా ఉన్న పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. వేములవాడ మూలవాగు నుంచి వరద నీరుతో పాటు శ్రీరాంసాగర్ వరద కాలువ నుంచి మధ్య మానేరు ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో 95905 క్యూసెక్కుల నీరు వస్తుంది.
మిడ్ మానేరు గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రీ రాజరాజేశ్వర మద్య నీరు ప్రాజెక్టు నుంచి కరీంనగర్ ఎల్‌ఎండి ప్రాజెక్టుకు, అన్నపూర్ణ ప్రాజెక్టులకు నీటి విడుదల కొనసాగుతుంది. సిరిసిల్ల మానేరు, వేములవాడ మూలవాగులతోపాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా 95905 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. శ్రీరాంసాగర్ వరద కాలువ నుంచి 16365 క్యూసెక్కులు, మానేరు, మూలవాగుల నుంచి 79540 క్యూసెక్కులు వస్తున్న నీటి ప్రవాహంతో మిడ్‌మానేరు ప్రాజెక్టులో 27.55 టీంఎంసీల సామర్థ్యానికి 20 .407 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్ట్ నుంచి 17 గేట్లు ఎత్తి కరీంనగర్ ఎల్‌ఎండి ప్రాజెక్టుకు 45635 క్యూసెక్కులు, అన్నపూర్ణ ప్రాజెక్టు 9600 క్యూసెక్కులు నీటి ప్రవాహం కొనసాగుతుంది. అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి రంగనాయక సాగర్ ప్రాజెక్టు 9600 క్యూసెక్కుల నీటిని వదిలారు.
పొంగుతున్న వాగులు.. నిండుతున్న చెరువులు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న మోస్తారు వర్షానికి జిల్లాలోని మానేరు, మూల వాగులతో పాటు ఒర్రెలు, చిన్న చిన్న వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది.ఎల్లారెడ్డిపేట, చందుర్తి ఇల్లంతకుంట, గంభీరావుపేట మండలాల్లో పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. సిరిసిల్ల మానేరు తీరంలోని బతుకమ్మ ఘాట్ నీట మునిగింది. మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు మానేరు వాగు వద్దకు వచ్చి ప్రవాహాన్ని తిలకించారు.