Share News

ఉపాధి వేటలో..

ABN , Publish Date - Jul 05 , 2025 | 01:09 AM

ఉపాధి వేటలో వందల కిలో మీటర్లు దాటుకుంటూ వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు వ్యవసాయ పనుల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాకు వలస వస్తున్నారు. వర్షాలు ఆలస్యమైనా వ్యవసాయ బావులు, బోరు బావుల్లో నీళ్లు ఉన్నచోట నాట్లు మొదలయ్యాయి.

 ఉపాధి వేటలో..
వరినాట్లు వేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర కూలీలు

- ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వలస కూలీలు

- ఖరీఫ్‌ నాట్లతో చేతినిండా పనులు

- కూలీల కొరతతో అడ్వాన్సులు..

- జిల్లాలో 2.43 లక్షలు ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఉపాధి వేటలో వందల కిలో మీటర్లు దాటుకుంటూ వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు వ్యవసాయ పనుల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాకు వలస వస్తున్నారు. వర్షాలు ఆలస్యమైనా వ్యవసాయ బావులు, బోరు బావుల్లో నీళ్లు ఉన్నచోట నాట్లు మొదలయ్యాయి. నాలుగు రోజులగా వర్షాలు పడుతుండటంతో నాట్లు పెరిగి వలస కూలీలకు చేతినిండా పనులు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రతి ఏటా వరి నాట్లు, పత్తిలో కలుపు తీయడం వంటి పనులకు ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి దాదాపుగా వెయ్యి మంది వరకు కూలీలు వలస వచ్చారు. జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఇందులో ప్రధానంగా వరి సాగు 1.84 లక్షల ఎకరాలు, పత్తి 49760 ఎకరాలు వేసుకుంటున్నారు ఇందులో వరి నాట్లు జిల్లాలో ఇప్పటికీ మొదలు కాలేదు. పత్తి విత్తనాలు 30 వేల ఎకరాల్లో వెసుకున్నారు. జిల్లాలో వరి సాగు పెరిగినా కూలీల కొరతను రైతులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో ఆరు రాష్ట్రాల నుంచి జిల్లాకు వ్యవసాయ పనుల కోసం రావడంతో రైతులకు సాగు ఇబ్బందులు తొలగిపోతున్నాయి. గడిచిన సీజన్‌లలో కూడా వలస కూలీలతోనే సాగు చేసుకున్న రైతులు ప్రస్తుత ఖరీఫ్‌లో కూడా వలస కూలీలతోనే పనులు చేయించుకుంటున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా రెండు పంటల్లోనూ రైతులకు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలే ఆధారంగా మారుతున్నారు.

ఫ పెరిగిన డిమాండ్‌..

గత మూడు సంవత్సరాలుగా ఖరీఫ్‌, యాసంగి సీజన్ల సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధిని వెతుక్కుంటూ వరినాట్లకు కూలీలు వలస వస్తున్నారు. జిల్లాలోని గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌, వీర్నపల్లి, ఇల్లంతకుంట, బోయినపల్లి, వేములవాడ ప్రాంతాల్లో వలస కూలీలు వరినాట్లు వేస్తున్నారు. ఇక్కడి మధ్యవర్తుల ద్వారా కొందరు ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలకు ఎకరానికి రూ 4 వేల నుంచి రూ 5500 వరకు వలస కూలీలకు చెల్లిస్తున్నారు. స్థానికంగా ఉండే కూలీలకు కూడా డిమాండ్‌ ఏర్పడింది. గతంలో రూ 300 నుంచి రూ 400 వరకు ఉండే కూలీ ప్రస్తుతం రూ 500 నుంచి రూ 600 వరకు చెల్లిస్తున్నారు. మగ కూలీలకు రూ 700 నుంచి రూ 800 వరకు ఇస్తున్నారు. దీంతో పాటు సిరిసిల్ల జిల్లాకు సరిహద్దులో ఉన్న సిద్దిపేట, కరీంనగర్‌, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల నుంచి పొరుగు గ్రామాలకు వరినాట్లకు వచ్చే కూలీలకు రవాణా చార్జీలు అదనంగా చెల్లిస్తున్నారు. రైతులు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూలీలతో నాట్లలో వేగం పెరిగిందని చెప్పుకుంటున్నారు.

రెండు నెలలు ఉపాధి దొరుకుతుంది..

- కామిరిరూప, చంద్రాపూర్‌ మహారాష్ట్ర

మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా బ్రహ్మపురి తాలూకా జోర్టీ గ్రామం మాది. మా ఊరిలో ఉపాధి లేక 20 రోజులకు ముందే వ్యవసాయ పనులకు వలస వచ్చాం. ఎకరానికి రూ 4 వేలు ఇస్తున్నారు. రెండు నెలల పాటు ఉపాధి దొరుకుతుంది. అన్ని ఖర్చులు పోను రూ 50 వేలు మిగులుతాయి.

రోజూ ఆరు ఎకరాల్లో నాట్లు వేస్తాం..

- మురళీధర్‌, ఉత్తర ప్రదేశ్‌

మేము 40 మంది కలిసి వచ్చాం. ప్రతి రోజు ఆరు ఎకరాల్లో నాట్లు వేస్తాం. పొలాల వద్ద ఉన్న రేకుల షెడ్‌ లోనే ఉంటున్నాం. రెండు నెలల్లో రూ 60 వేలు మిగులుతుంది.

Updated Date - Jul 05 , 2025 | 01:09 AM