Share News

Telangana September 17: సాయుధ పోరాటంలో అలుపెరుగని యోధులు

ABN , Publish Date - Sep 17 , 2025 | 01:17 AM

నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు ఎందరో పోరుబాటను ఎంచుకున్నారు. నిజాం నవాబు పాలనను అంతం చేసేందుకు మంథని, మహదేవపూర్‌, గట్టెపల్లి ప్రాంతానికి చెందిన ఎందరో పోరాటయోధులు అజ్ఞాతం బాట పట్టి నిజాం పాలనపై తిరుగుబాటు జెండా ఎగుర వేశారు.

Telangana September 17: సాయుధ పోరాటంలో  అలుపెరుగని యోధులు

నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు ఎందరో పోరుబాటను ఎంచుకున్నారు. నిజాం నవాబు పాలనను అంతం చేసేందుకు మంథని, మహదేవపూర్‌, గట్టెపల్లి ప్రాంతానికి చెందిన ఎందరో పోరాటయోధులు అజ్ఞాతం బాట పట్టి నిజాం పాలనపై తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఒక వైపు సాయుధంగా, మరో వైపు సత్యగ్రహ ఉద్యమాల్లో ప్రజలను చైతన్యవంతులను చేసి నిజాం మెడలు వంచడానికి అలుపెరుగని పోరాటం చేశారు. ఎందరో పోరాటాల ఫలితంగా సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానాన్ని విలీనం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైన వేళ ఒక్కసారి నాటి పోరాటయోధులను స్మరించుకుందాం..

మంథని/సుల్తానాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): నిజాం నిరంకుశ పాలనలో ఉన్న తెలంగాణ పల్లెల్లో స్వాతంత్ర్యాన్ని తేవడానికి మంథని ప్రాంత పోరాట వీరులు సాయుధ, సత్యాగ్రహ సంగ్రామాలకు శ్రీకారం చుట్టారు. మంథనికి చెందిన గులుకోట శ్రీరాములు సాయుధ పోరా టానికి నాయకత్వం వహించగా, రఘునాథ్‌ కాచే నిజాంకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులు చేస్తూ కార్యకలాపా లను విస్తరించడంలో కీలక భూమిక పోషించారు. వీరిద్దరి నాయకత్వంలో ఎందరో యోధులు సాయుధ, సత్యాగ్రహ పోరాటం చేశారు.

సాయుధ పోరాట వీరులు వీరే..

రావి నారాయణరెడ్డి స్ఫూర్తితో మంథనికి చెందిన స్వర్గీయ గులుకోట శ్రీరాములు నేతృత్వంలో పనకంటి కిషన్‌ రావు, సువర్ణ ప్రభాకర్‌, చొప్పకట్ల చంటయ్య, డీ.రాజన్న, రాంపెల్లి కిష్టయ్య, దామోదర్‌థామస్‌, శివనాద్రి శంకరయ్య గుప్తా, నరహరి, ఎలిశెట్టి సీతారాంలు సాయుధ పోరాటంలో పాల్గొన్నారు.

సత్యాగ్రహవాదులు వీరే..

స్వామి రామనందతీర్థ సరస్వతీ పిలుపు మేరకు సత్యా గ్రహ ఉద్యమంలో మంథనికి చెందిన రఘునాథ్‌కాచే ఆధ్వ ర్యంలో పీ.గణపతిరావు, అవధానుల కిష్టయ్య, ఎం.గణపతి, మురళీధర్‌కాచే, దేవళ్ల రాజేశ్వర్‌రావు, గట్టు రామన్న, వెంకటరాజన్న, ఎస్‌.నర్సింహులు నిజాం సర్కార్‌కు వ్యతిరే కంగా పనిచేశారు. నిజాంను వ్యతిరేకించినందుకు వీరంతా జైలుశిక్షను అనుభవించారు.

చాందాలో సాయుధ శిక్షణ..

శ్రీరాములు బృందం మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ (చాందా)లో భారత సైన్యం ఆధ్వర్యంలో సాయుధ శిక్షణ పొందారు. గడ్చిరోలి జిల్లా సిరివంచ లో క్యాంపును ఏర్పాటు చేసుకొని అజ్ఞాతంలో ఉంటూ నిజాం పోలీస్‌, అధికారుల పై గెరిల్లా దాడులు చేసి సంచలనం సృష్టించారు.

పోలీస్‌స్టేషన్లపై దాడులు, అధికారుల హత్యలు..

మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆయుధ సంపత్తిని సమకూర్చుకున్న శ్రీరాములు బృందం 1948లో గోదావరినది దాటి నిజాం సంస్థాన గ్రామాలైన కాళేశ్వరం, మహదేవ పూర్‌, దామెరకుంట పోలీస్‌స్టేషన్లపై దాడులు చేసి నిజాం ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. దామెరకుంటలో కలెక్టర్‌ పర్యటనకు వెళ్ళిన అధికారులపై దాడి చేసి హతమార్చారు. కాళేశ్వరంలో నిజాం ఠాణా పై జరిపిన దాడిలో శ్రీరాములు కాలుకు తుపాకి తూటాలు తగిలినా మొక్కవోని ధైర్యంతో దాడిని విజయవంతం చేశారు. మంథని, మహదేవపూర్‌ తాలూకాల్లో నిజాంపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించారు. 1948 సెప్టెంబర్‌ 17న భారత సైనిక చర్యతో దిగి వచ్చి భారత సర్కార్‌ ముందు నిజాం నవాబ్‌ తలవం చడంతో హైదరాబాద్‌ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనమైంది.

మంథని తొలి ఎమ్మెల్యే గెలిచిన శ్రీరాములు..

అజ్ఞాతంలో ఉన్న శ్రీరాములు బృందం బయటకు రాగా కాళేశ్వరం నుంచి మంథని వరకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రఘునాథ్‌ కాచే ఆధ్వర్యంలో మంథనిలో జరిగిన బహిరంగ సభలో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవే శారు. 1952లో జరిగిన తొలి శాసన సభ ఎన్నికల్లో శ్రీరాము లు సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మంథని మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శ్రీరాములు బృం దంలో సాయుధ పోరాటం చేసిన వారిలో సువర్ణ ప్రభాకర్‌ ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌గా పని చేయగా, పనకంటి కిషన్‌రావు జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా పని చేసి స్వర్గస్థులైనారు.

పోరాట యోధులకు గుర్తింపు..

నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటానికి చిహ్నంగా గుంజపడు గు, దామెరకుంట, ఒడిపిలవంచ గ్రామాల్లో కేంద్ర ప్రభు త్వం స్తూపాలను ఏర్పాటు చేసింది. అప్పటి ప్రధాని స్వర్గీ య ఇందిరాగాంధీ మంథని స్వాతంత్య్ర సమరయోధులను ఢిల్లీలో సన్మానించి పెన్షన్లు, భూములు, స్వాతంత్య్ర సమరయోధుల ధ్రువీకరణ ప్రతాలను ప్రదానం చేశారు.

స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలి..

తెలంగాణ విమోచన కోసం సత్యగ్రహ, సాయుధ ఉద్యమంలో పని చేసిన స్వాతంత్ర సమరయోధుల వివ రాలు, వారి పోరాటాలు, త్యాగాలను భావితరాలకు అందిం చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మంథనిలో స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని స్వాతంత్య్ర సమరయోధుల వారసులు గులుకోట శ్రీకాంత్‌, శశిభూషన్‌కాచే, చొప్పకట్ల రాము, శ్రీకాంత్‌లు కోరుతున్నారు.

నిజాం నవాబును గడ గడలాడించిన మురళి

తెలంగాణ విముక్తి పోరులో సుల్తానాబాద్‌ మండలం గట్టేపల్లి గ్రామానికి చెందిన మురళీధర్‌ రావు కీలకపాత్ర పోషించారు. సాయుధ పోరులో ఆలుపెరగని ధీరుడిగా నిజాం పాలకులకు సింహ స్వప్నంగా మారాడు. రజాకార్ల చీఫ్‌ ఖాసీం రజ్వీ అరాచకాల నుంచి ప్రజల మాన ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషించారు. పలుమార్లు నిజాం సైన్యానికి పట్టుబడగా చిత్రహింసలకు గురి చేశారు.

ఉన్నత కుటుంబంలో జన్మించినా..

గట్టేపల్లి మురళి ఉన్నత కుటుంబంలో జన్మించినా దేశ సేవే లక్ష్యంగా సాయుధ పోరులో నిలిచారు. ఆనభేరి ప్రభాకర్‌ రావు సహాయంతో మురళి పోరాడుతూ నిజాం సైన్యం, రజాకార్ల పై దాడులు చేసే వారు. 1943 లో మురళి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. దళాలతో కలసి గౌరెల్లి జమీందారిని నర్సుబాయమ్మ దౌర్జన్యాలను ఎదుర్కొ న్నాడు. హుస్నాబాద్‌ గుట్టల్లో ఆనభేరి నాయకత్వంలో మురళి దళసభ్యులతో కలసి రజాకార్ల సైన్యాన్ని ఎదిరిం చాడు. అయితే ఆ రోజు జరిగిన కాల్పుల్లో పలువురు మృతి చెందగా మురళి బయటపడ్డాడు.

ధైర్యసాహసాలే ఆయన ఊపిరి

ఎలాంటి సాహసానికైనా మురళి తెగించేవాడు. విద్యార్థి దశలో మురళి గట్టేపల్లి నుంచి సైకిల్‌ పై జమ్మికుంట, వరంగల్‌కు వెళ్లేవారు. మార్గమధ్యలో పులి ఎదురుపడితే గొడ్డలితో పులిని హతమార్చాడు. ఇంటి పేరు సాయపు రాజు అయినా ఆయనను అందరూ గట్టేపల్లి మురళి అనే పిలిచేవారు. హెచ్‌ఎస్‌సీ విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. మంథనిలో పీపీ నర్సింహరావు కాంగ్రెస్‌ తరపున, మురళి కమ్యూనిస్టు అభ్యర్థిగా అసెంబ్లీ పోటీ చేయగా పీవీ గెలిచారు. అనేక భాషల పై మురళి పట్టు సాధించారు. మురళి వాయు, జల స్తంభన విద్యలతో పలుమార్లు తప్పిం చుకున్నాడు. నిజాం సైన్యం మురళిని వెంటపడగా ఓ చెరువులో దూకాడు. సైన్యం ఎంత సేపు ఎదురుచూసిన మురళి బయటకు రాలేదు. వాయు, జల స్తంభన విద్యలతో నీటిలో గంటల తరబడి ఉన్నాడు. మురళి చనిపోయాడని సైన్యం వెళ్లిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆరేళ్ల అజ్ఞాత వాసం గడిపారు.

మురళి పట్టుబడిన సందర్భంలో సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ సీతాపతి మురళిని కాలితో తన్నాడు. వీరి మధ్య వాగ్వాదం తో నెల రోజుల్లో సీఐని చంపుతానని మురళి శపథం చేశాడు. జైలు నుంచి తప్పించుకున్న మురళి తన ఉనికిని సీఐ సీతాపతికి పంపించడం, పోలీసులతో కలిసి సీతాపతి కాల్పులు జరపగా మురళి గాయపడ్డాడు. మురళి జరిపిన కాల్పుల్లో సీఐ సీతాపతి చనిపోయాడు. మురళి 1988 జూన్‌ 2న మృతి చెందాడు. 2023 మే 7న మురళి కాంస్య విగ్రహాన్ని వారి అభిమానులు గట్టేపల్లిలో ఏర్పాటు చేయగా ఆనాటి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆవిష్కరించారు.

Updated Date - Sep 17 , 2025 | 09:06 AM