సీలింగ్ భూముల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు
ABN , Publish Date - May 20 , 2025 | 01:04 AM
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కొత్తపల్లిలో సీలింగ్ పరిధిలో ఉన్న భూముల్లో అక్రమ రిజిస్ర్టేషన్లు చేసి రియల్ మాఫియా, దళారులు అధికారులతో కలిసి లక్షల్లో దండుకున్నారు.
- హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు
- 2008లోనే హైకోర్టు ఆదేశాలు
- రిజిస్ర్టేషన్ల రద్దుకు కలెక్టర్ ఆదేశాలు
- కొత్తపల్లిలోని సర్వే జూం. 175, 197, 198లో 476 రిజిస్ట్రేషన్లు రద్దు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కొత్తపల్లిలో సీలింగ్ పరిధిలో ఉన్న భూముల్లో అక్రమ రిజిస్ర్టేషన్లు చేసి రియల్ మాఫియా, దళారులు అధికారులతో కలిసి లక్షల్లో దండుకున్నారు. ఈ అక్రమాలపై ముప్పై ఏళ్ల క్రితమే కొందరు హైకోర్టులో ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ విచారణ జరిపించి అవి సీలింగ్ భూములని తేల్చిచెప్పారు. ఆ భూముల్లో ఎలాంటి లావాదేవీలు చేయవద్దని హైకోర్టు అధికారులను ఆదేశించింది. కొందరు వ్యక్తులు మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో ఆ వ్యవహారం వాయిదాల్లో నానుతూ వచ్చింది. భూముల వ్యవహారం కోర్టులో ఉండగానే కొందరు రియల్ వ్యాపారులు రంగప్రవేశం చేసి అధికారులు, ఇతరుల అండతో ఆ భూముల్లో 476 రిజిస్ర్టేషన్లు చేసి జేబులు నింపుకున్నారు. మళ్లీ ఈ వ్యవహారాన్ని కొందరు లోకాయుక్త దృష్టికి తీసుకువెళ్లగా లోకాయుక్త కలెక్టర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ భూములను సీలింగ్ భూములుగా పేర్కొంటూ కలెక్టర్ ఆయా రిజిస్ర్టేషన్లను రద్దు చేయాల్సిందిగా గంగాధర సబ్ రిజిస్ర్టార్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ఫ మూడు సర్వే నంబర్లు.. 456 రిజిస్ర్టేషన్లు
కొత్తపల్లి శివారులోని సర్వే నంబర్ 175, 197, 198 భూములకు సంబంధించిన దాదాపు 465 రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తూ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలు జారీ చేశారు. ఆ భూములు సీలింగ్ లాండ్ కిందకు వస్తాయని, అందులో రిజిస్ట్రేషన్లు చేయవద్దని 1995లో ఒక ఫిర్యాదుపై విచారణ చేయాలని అప్పటి కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ చేసిన కలెక్టర్ ఆ భూములన్నీ సీలింగ్ పరిధిలో ఉన్నట్టు హైకోర్టుకి నివేదించారు. దీంతో హైకోర్టు ఆ భూములపై ఎలాంటి లావాదేవీలు జరపవద్దని జిల్లా యంత్రాంగానికి సూచింది. ఆ సమయంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కోర్టుని ఆశ్రయించారు. అప్పటి నుంచి ఆ భూములు విచారణ దశలోనే కొనసాగుతున్నాయి. ఆ కేసు అలా పెండింగ్ లో ఉండగానే కొంతమంది వ్యక్తులు ఆ భూముల్లో యథేచ్చగా లావాదేవీలు జరుపుతున్నారు.
ఫ లోక్‌సత్తా ఉద్యమ సంస్థ ఫిర్యాదుతో..
భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై లోక్‌సత్తా ఉద్యమ సంస్థ 2015 సంవత్సరంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన లోకాయుక్త ఆ భూములకు సంబంధించిన లావాదేవీలపై పూర్తి వివరాలు తమకి సమర్పించాలని ఆదేశిస్తూ, ఇక ముందు ఎలాంటి లావాదేవీలు జరపవద్దని రెవిన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. లోకాయుక్త సూచన మేరకు ఆ మూడు సర్వే నంబర్లలో అప్పటివరకు జరిగిన లావాదేవీలను లోకాయుక్తకు రెవిన్యూ శాఖ సమర్పించింది. అనంతరం ఆ భూముల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దని జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖకు రెవిన్యూ శాఖ సూచించింది. ఇంతలో లోకయుక్తాకు ఫిర్యాదు చేసిన లోక్ సత్తా ఉద్యమ సంస్థ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ మరణించడం, లోకాయుక్తలో విచారణ ఆగిపోవడం కబ్జారాయుళ్లకు కలిసి వచ్చింది. ఇదే అదునుగా గంగాధర సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొంతమంది అవినీతి అధికారులు సీలింగ్ ల్యాండ్ కేసు విచారణను తొక్కిపెట్టి, యథేఛ్చగా రిజిస్ట్రేషన్లు చేయడం ప్రారంభించారు. దీంతో 476 డాక్యుమెంట్లు చేతులు మారాయి. ఈ క్రమంలో లోకాయుక్తా తిరిగి విచారణ వేగవంతం చేసింది. నిషేధం ఉన్న భూముల్లో రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతున్నాయని గమనించి 2024లో మళ్లీ రెవిన్యూశాఖను హెచ్చరించింది. తక్షణం రిజిస్ట్రేషన్లు నిలిపివేయాల్సిందిగా రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించమని రెవెన్యూశాఖకు సూచించింది. ఇప్పటివరకు చేసిన లావాదేవీలన్నింటినీ రెండు రోజుల్లో రద్దు చేయాలని కరీంనగర్ ఆర్డీవో జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు 2024 నవంబరు 14న లేఖ రాశారు. ఆర్డీవో లేఖ రాసి ఆరు నెలలు గడిచినా రిజిస్ట్రేషన్ల శాఖ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇదే విషయాన్ని ఆర్డీవో లోకాయుక్తాకు తెలియజేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన లోకాయుక్త తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించింది. రంగంలోకి దిగిన కలెక్టర్ పమేలా సత్పతి కొత్తపల్లిలోని సర్వేనంబర్లు 175, 197,198లో ఉన్న భూముల్లో ఇప్పటివరకు జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్లను రద్దు చేయాల్సిందిగా జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం ద్వారా గంగాధర సబ్‌రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా భూముల్లో జరిగిన 476 డాక్యుమెంట్లు తక్షణం రద్దు కానున్నాయి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌లో ఉన్న భూముల వివరాలను జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు, రెవిన్యూ శాఖకు అందించింది. ఆ భూముల్లో ఎలాంటి లావాదేవీలు జరుపకూడదని ఎప్పటికప్పుడు ఆ శాఖని హెచ్చరించింది. 1998, 2011, 2016, 2017, 2018లలో ఎనిమిది సార్లు రిజిస్ట్రేషన్ శాఖను రెవిన్యూ శాఖ అప్రమత్తం చేసింది. రిజిస్ట్రేషన్ల శాఖలోని కొంతమంది అవినీతి అధికారుల కారణంగా ఆ భూముల్లో కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయి. వందలాది డాక్యుమెంట్లు చేతులు మారాయి. రిజిస్ట్రేషన్ల శాఖ నిర్లక్ష్యం, అవినీతి అధికారుల బరితెగింపు వల్ల వందలాది కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌లో ఉన్న ప్రభుత్వ భూములని తెలియక భూములు కొన్న సామాన్యుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.
ఫ గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో..
కొత్తపల్లికి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్లు 2016 వరకు కరీంనగర్ రూరల్ రిజిస్ర్టేషన్ కార్యాలయంలో జరిగాయి. కొత్తపల్లి మండలం భూములు గంగాధర సబ్‌రిజిస్ట్రార్ పరిధిలోకి వచ్చిన తరువాత 2018లో లోకాయుక్త ఆర్డర్‌తో ఒక రిజిస్ట్రేషన్ జరిగింది. అప్పటి నుంచి నవంబర్ 2024 వరకు గంగాధరలో 52 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. అప్రమత్తమైన అధికారులు ఎట్టకేలకు ఈ సర్వె నంబర్లను నిషేదిత జాభితాల్లో చేర్చడంతో 11 నవంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగలేదు. అయితే ఈ భూములు నిషదిత జాభితాలో లేకపోవడంతో సదరు వ్యక్తులు తగిన చాలన్ చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని రిజిస్ట్రేషన్ అధికారులు చెప్పుతున్నారు. ఇప్పటి వరకు నిషేధిత జాభితాల్లో పై సర్వె నెంబర్లలో జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ ఈనెల 15న గంగాధర సబ్ రిజిస్ర్టార్‌కు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు చేయడానికి కొత్తపల్లి తహసీల్దార్‌తో సంప్రదించి చర్యలు తీసుకోనున్నట్లు గంగాధర సబ్ రిజిస్ర్టార్ అఫ్జల్ నూర్‌ఖాన్ తెలిపారు.